Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
Rains: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి నుంచి రాబోయే 24 గంటల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

Rains
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం క్రమంగా బలహీనపడుతున్నా కూడా.. దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవస్థ ఉత్తర తమిళనాడు , దక్షిణ అంతర్గత కర్ణాటక ప్రాంతాల్లో సుస్పష్ట అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది రాబోయే 24 గంటల్లో దక్షిణ అంతర్గత కర్ణాటక దిశగా కదులుతూ మరింత బలహీనపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా వెల్లడించింది.
ఏపీలో వర్షాల(Rains) ప్రభావం.. ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి నుంచి రాబోయే 24 గంటల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ కూడా జారీ చేసింది.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, దక్షిణ కోస్తా , రాయలసీమ జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రకాశం,నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
భారీ వర్షంతో పాటు తీరం వెంబడి గంటకు 30-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ప్రజలకు సూచనలు, హెచ్చరికలు..ఈ భారీ వర్షాల వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాల్లో ప్రజలు ఎవరూ ఉండరాదని.. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచించింది.