Vizag: గూగుల్‌లోనే వైజాగ్ గూగుల్ గురించి సెర్చ్ చేసేయండి మరి..
Vizag: హుద్‌హుద్ తుఫాన్‌ను తట్టుకున్న విశాఖపట్నం, ఇప్పుడు ఈ గూగుల్ డేటా వేవ్‌తో టెక్నాలజీ రంగంలో కొత్త అలలను సృష్టించడానికి రెడీ అవుతోంది.

Vizag
వైజాగ్(Vizag) మీద గూగుల్ కన్నేసింది. ఒక కంపెనీ పెట్టుబడి కాదిది, దేశ రాజకీయాల్లోనూ, రాష్ట్ర భవిష్యత్తులోనూ మైలురాయిగా నిలిచే నిర్ణయం. ఐదు లక్షల కోట్లు కాదు, ఏకంగా ఏభై వేల కోట్లు. ఈ అంకె ఒక్కటే ఆంధ్ర ప్రగతి దిశను చూపిస్తోంది.
అవును..మనందరికీ తెలిసిన పోర్ట్ సిటీ, బీచ్ నగరం అయిన విశాఖపట్నం ఇప్పుడు కేవలం ఒక తీర ప్రాంత పట్టణం కాదు. ఇది భారతదేశానికి సరికొత్త టెక్నాలజీ హబ్‌గా, సిలికాన్ వేవ్ సిటీగా మారబోతోంది. టెక్ దిగ్గజం గూగుల్ విశాఖ గడ్డపై అడుగు పెట్టబోతోంది. ఇది కేవలం ఒక కంపెనీ రాక మాత్రమే కాదు, ప్రపంచ పటంలో విశాఖ(Vizag) భవిష్యత్తును కొత్తగా లిఖించబోయే ఒక సంచలన నిర్ణయం.
గూగుల్ లాంటి సంస్థలకు భవిష్యత్తును చెప్పడానికి జ్యోతిష్యం అవసరం లేదు. వాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉంది. గూగుల్ విశాఖను ఎంచుకోవడానికి గల కారణం.. ఇక్కడ ఉన్న ప్రతిభ, సముద్రతీరం,అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు. ఇవన్నీ టెక్ విప్లవానికి సరైన వాతావరణాన్ని కల్పిస్తాయి.
విశాఖ(Vizag)లో నిర్మించబోయే డేటా సెంటర్ కేవలం సర్వర్ల గోదాం కాదు. మనం ప్రతిరోజూ చేసే గూగుల్ సెర్చులు, యూట్యూబ్ వీడియోలు, క్లౌడ్‌లో సేవ్ చేసే డాక్యుమెంట్లు… ఇవన్నీ ఇక్కడి నుంచే పనిచేస్తాయి. ఈ డేటా సెంటర్ అక్షరాలా డిజిటల్ ప్రపంచానికి ఒక మెదడులా పనిచేస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద సైజులో ఉండబోతున్న ఈ డేటా సెంటర్ వల్ల విశాఖ జీడీపీ భారీగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

దీనితో స్టార్టప్‌లు, ఫిన్‌టెక్‌లు, గ్లోబల్ కంపెనీలు కూడా ఇక్కడికి తరలివచ్చే అవకాశముంది. భవిష్యత్తులో హైదరాబాద్ ఐటీకి దీటుగా విశాఖ డేటా అనే కొత్త గుర్తింపును ఈ ప్రాజెక్ట్ తీసుకొస్తుంది. అంతేకాకుండా, గూగుల్ ఈ ప్రాజెక్ట్‌ను పర్యావరణ అనుకూలతతో నడిపిస్తోంది. హరిత శక్తితో నడిచే డేటా సిటీ అనేది మన దేశంలోనే ఒక అరుదైన, గర్వకారణమైన అంశం.
విశాఖలో గూగుల్(Vizag) ప్రాజెక్ట్ ఒక వ్యాపార నిర్ణయం మాత్రమే కాదు, రాజకీయంగా కూడా ఇది ఒక మైలురాయి కాబోతోంది. ఈ ప్రాజెక్ట్ కింద రూ. 50,000 కోట్ల భారీ పెట్టుబడి రాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ వల్ల యువతకు వేలల్లో ఉద్యోగావకాశాలు వస్తాయి. విశాఖపట్నం పేరు అంతర్జాతీయ స్థాయిలో మరింత బలపడుతుంది.
కానీ ఇక్కడ కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. డేటా సెంటర్లు భారీగా విద్యుత్‌ను వినియోగిస్తాయి, ఇది రాష్ట్రానికి సవాలుగా మారొచ్చు. పర్యావరణం పేరుతో ప్రతిపక్షం “భూములు ఎలా ఇచ్చారు? స్థానికులకు ఎంత లాభం వస్తుంది?” అంటూ విమర్శలు విసరడం ఖాయం.
ఏది ఏమైనా, హుద్‌హుద్ తుఫాన్‌ను తట్టుకున్న విశాఖపట్నం, ఇప్పుడు ఈ గూగుల్ డేటా వేవ్‌తో టెక్నాలజీ రంగంలో కొత్త అలలను సృష్టిస్తుందనేది మాత్రం కన్ఫమ్.