Gold :భారత ప్రజల వద్ద ఉన్న బంగారం విలువ అక్షరాలా రూ.337 లక్షల కోట్లంటే నమ్ముతారా?
Gold: ఇటీవల కాలంలో, అంతర్జాతీయ అనిశ్చితులు మరియు దేశీయ పండుగ సీజన్ల డిమాండ్ కారణంగా పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Gold
బంగారం(Gold)అనేది భారతీయుల జీవితంలో కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు; వందల సంవత్సరాల నుంచి ఇది ఒక సంస్కృతి, భావోద్వేగం మరియు అత్యవసర ఆర్థిక భద్రతగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో, అంతర్జాతీయ అనిశ్చితులు మరియు దేశీయ పండుగ సీజన్ల డిమాండ్ కారణంగా పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2025లోనే ఇప్పటి వరకు చూసుకుంటే పసిడి ధర ఏకంగా 62 శాతం పెరిగింది.
ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం (24 క్యారెట్ల) ధర రూ.1.25 లక్షల మార్కు దాటగా, కిలో వెండి రేటు రూ.1.84 లక్షలపైకి ఎగబాకింది. అయినా కూడా , భారతీయ ప్రజలు బంగారం కొనుగోలుకు వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో, ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ భారత ప్రజల వద్ద ఉన్న బంగారం విలువపై విడుదల చేసిన నివేదిక వివరాలు కళ్లు చెదిరేలా ఉన్నాయి.
భారతీయ గృహాలు , ప్రజల వద్ద నిల్వ ఉన్న బంగారు(Gold)నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయో మోర్గాన్ స్టాన్లీ నివేదిక స్పష్టం చేసింది. మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం, భారత్‌లో ప్రజల వద్ద మొత్తం 34,600 టన్నుల బంగారం ఉంది. దీని విలువ ప్రస్తుతం 3.8 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేయబడింది. భారత కరెన్సీలో దీని విలువ అక్షరాలా రూ.337 లక్షల కోట్లు. ఈ భారీ సంపద భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఏకంగా 89 శాతంగా ఉంటుందని నివేదిక పేర్కొంది.

బంగారం ధరలు రోజు రోజుకూ పెరుగుతుండడం వల్ల ప్రజల సంపద విలువ మరింత పెరుగుతున్నట్లు ఈ నివేదిక తెలియజేసింది. ప్రజల ఇంటి బ్యాలెన్స్ షీట్‌లో ఇది సానుకూల (Positive) అంశంగా మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది.
భారత ప్రజల వద్ద ఇంత బంగారం ఉండటానికి ప్రధాన కారణం, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉండటమే. ప్రపంచ బంగారం డిమాండ్‌లో భారత్ 26 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. చైనా 28 శాతంతో అగ్రస్థానంలో ఉంది.భారత ప్రజలు భౌతిక రూపంలోనే కాకుండా, ఇటీవల కాలంలో ఆర్థిక పరమైన ఆస్తుల్లో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF)ల ద్వారా బంగారంలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు.
గడిచిన ఏడాది కాలంలో గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి భారీగా పెట్టుబడులు వచ్చినట్లు నివేదిక పేర్కొంది. రానున్న భవిష్యత్తులోనూ ఈ పెట్టుబడి ధోరణి కొనసాగవచ్చని, బంగారం కొనుగోలు చేసేందుకు భారత ప్రజలు మరింత ఆసక్తి కనబర్చవచ్చని మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది.