WhatsApp: వాట్సప్ లేకపోతేనేం,అరట్టై వాడండి..మేక్ ఇన్ ఇండియాకు సుప్రీంకోర్టు మద్దతు
WhatsApp : వాట్సప్ అకౌంట్ పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ, ప్రజలు స్వదేశీ యాప్‌లను వాడాలని సూచించింది.

స్వదేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’ (Arattai) ఇటీవల నెట్టింట ఓ రేంజ్‌లో ప్రజాదరణ పొందుతోంది. తాజాగా, ఈ యాప్ ప్రస్తావన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. వాట్సప్ అకౌంట్ పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ, ప్రజలు స్వదేశీ యాప్‌లను వాడాలని సూచించింది.
తన వాట్సప్(WhatsApp) ఖాతాను ఆ సంస్థ బ్లాక్ చేసిందని, దానిని పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఒక పిటిషనర్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సామాజిక మాధ్యమాలు ఇలా ఖాతాలను ఉన్నట్టుండి నిషేధించకుండా ఉండేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కూడా పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు.దీనిపై సుప్రీం ధర్మాసనం ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ, ఆర్టికల్ 32 కింద ఈ పిటిషన్‌ను ఎందుకు వేశారు? వాట్సప్ యాక్సెస్ ఉండటం ప్రాథమిక హక్కు ఎలా అవుతుందని కొన్ని కీలక ప్రశ్నలు వేసింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్ పాలీ డయాగ్నస్టిక్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. 10-12 ఏళ్లుగా ఆయన తన క్లయింట్‌లతో వాట్సప్‌లోనే టచ్‌లో ఉన్నారు. ఉన్నట్టుండి ఆ ఖాతాను బ్లాక్ చేశారు అని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

న్యాయవాది వాదనపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ, కమ్యూనికేషన్ కోసం ఇతర యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయని సూచించింది. ముఖ్యంగా, “అయితే ఏంటి? కమ్యూనికేషన్ కోసం ఇతర యాప్‌లు కూడా ఉన్నాయి. వాటిని ఉపయోగించొచ్చు కదా.. ఈ మధ్యే స్వదేశీ యాప్ ‘అరట్టై’ కూడా వచ్చింది. దాన్ని వాడుకోండి. మేక్ ఇన్ ఇండియా అని సూచించింది.
ఈ పిటిషన్ హైకోర్టులో కూడా విచారణకు అర్హమైంది కాదని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ, ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించి పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో పిటిషనర్ కోర్టు అనుమతితో తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు.
దేశీయ సంస్థ జోహో (Zoho) అభివృద్ధి చేసిన అరట్టై యాప్‌కు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోంది. ఇప్పటికే కోటి మందికి పైగా దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. నిజానికి అరట్టై’ అంటే తమిళంలో పిచ్చాపాటీ సంభాషణ అని అర్థం. ఈ యాప్ ద్వారా మెసేజ్‌లు, వాయిస్, వీడియో కాల్స్, మీటింగుల్లో పాల్గొనడం, స్టోరీలు, ఫొటోలు, డాక్యుమెంట్లు షేర్ చేసుకోవచ్చు.
దీని క్లీన్ ఇంటర్‌ఫేస్, పలు ఫీచర్లు, ముఖ్యంగా గోప్యత (Privacy) మీద దృష్టి పెట్టడం వంటి వాటితో ఇది వాట్సప్(WhatsApp)కు మంచి ప్రత్యామ్నాయ వేదికగా పేరు తెచ్చుకుంటోంది. అరట్టై ప్రత్యేకత పాకెట్స్. మనకు కావాల్సిన ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. త్వరలో చాట్స్‌కు కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను తీసుకొస్తామని జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు వెల్లడించారు.