Just TelanganaJust PoliticalLatest News

BRS : పట్టు నిలుపుకోకుంటే కష్టమే..గ్రేటర్ పై గులాబీ పార్టీ ఫోకస్

BRS : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని గులాబీ పార్టీ పట్టుదలగా ఉంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జిల్లాల్లో ఓడిపోయినా గ్రేటర్ పరిధిలో మాత్రం పట్టు నిలుపుకుంది

BRS

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఊహించినట్టుగానే అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కనబరచింది. ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) ఓ మాదిరిగా పర్వాలేదనిపించింది. కొన్ని చోట్ల పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టకపోవడం, అదే సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నోటీసులు వంటివి బీఆర్ఎస్(BRS) ను ఆత్మరక్షణలో పడేశాయి. దీంతో ఇప్పుడు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలని గులాబీ పార్టీ పట్టుదలగా ఉంది.

ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జిల్లాల్లో ఓడిపోయినా గ్రేటర్ పరిధిలో మాత్రం పట్టు నిలుపుకుంది. నిజానికి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచీ గులాబీ పార్టీకి హైదరాబాద్ ఓటు బ్యాంకు చెక్కు చెదర్లేదు. గ్రేటర్ పరిధిలో ఇప్పుడు కొత్తగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. మూడు చోట్లా గులాబీ జెండానే పాతాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే జీహెచ్ఎంసీ ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని గులాబీ అధినేత డిసైడయినట్టు తెలుస్తోంది.

తెలంగాణకు గుండెలా భావించే హైదరాబాద్ లో మూడొంతుల అసెంబ్లీ సీట్లు ఉంటాయి. డీలిమిటేషన్ జరిగి సీట్ల సంఖ్య పెరిగితే గ్రేటర్ పరిధిలోనూ కొత్త నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో కొత్తగా ఏర్పాటైన మల్కాజ్ గిరి, సైబరాబాద్, జీహెచ్ఎంసీల్లో ఖచ్చితంగా తమదే పైచేయి కావాలని బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటోంది.

BRS
BRS

ఎందుకంటే గ్రేటర్ పై పట్టు కోల్పోతే వచ్చే ఎన్నికల్లో ఆ ప్రభావం ఖచ్చితంగా పడుతుందన్నది కేసీఆర్ కు తెలియంది కాదు. అందుకే గ్రేటర్ పరిధిలో తమ నాయకులను, పార్టీ శ్రేణులను ఇప్పటికే అప్రమత్తం చేసి వారిని సన్నద్ధం చేస్తోంది. గత ఎన్నికల సమయంలో గ్రేటర్ పరిధిలో గులాబీ పార్టీదే పైచేయిగా నిలిచింది. రాష్ట్రమంతటా కీలక స్థానాలను గెలిచిన కాంగ్రెస్ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ను అనుకున్న స్థాయిలో ఢీకొట్టలేకపోయింది. దీనికి కారణంగా గ్రేటర్ పై గులాబీ పార్టీకి ఉన్న పట్టే. గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ స్థానాలకు గానూ 15 స్థానాలను బీఆర్ఎస్ దక్కించుకుంది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకు గానూ 99 డివిజన్లలో గెలుపొంది రికార్డు సృష్టించింది.

2020లో 56 సీట్లను సొంతంగా గెలిచి ఎంఐఎంతో కలిసి మేయర్ సీటును కైవసం చేసుకుంది. దీంతో తమ పట్టును మరోసారి నిలుపుకుని గ్రేటర్ లో పాగా వేయాలని బీఆర్ఎస్ ఎదురుచూస్తోంది. దీని ప్రకారం చూస్తే గ్రేటర్ లో ప్రచారానికి కేసీఆర్ వచ్చే అవకాశముందని సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button