Harry Brook : శతక్కొట్టిన హ్యారీ బ్రూక్..సెమీఫైనల్లో ఇంగ్లాండ్
Harry Brook : ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ ఫామ్ కొనసాగిస్తోంది. సూపర్ 8 గ్రూప్ 2లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ సెంచరీ ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది
Harry Brook
ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ ఫామ్ కొనసాగిస్తోంది. సూపర్ 8 గ్రూప్ 2లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ హ్యారీ బ్రూక్(Harry Brook) సెంచరీ ఇన్నింగ్స్ హైలెట్ గా నిలిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. దూ కుడుగా ఆడే క్రమంలో కేవలం 27 రన్స్ కే 2 వికెట్లు కోల్పోయింది.
అయితే బాబర్ అజామ్ , ఫర్హాన్ మూడో వికెట్ కు 46 జోడించారు. బాబర్ అజామ్ ఔటైనప్పటకీ కీలక భాగస్వామ్యం పాక్ ను ఆదుకుంది. తర్వాత ఫర్హాన్, ఫకర్ జమాన్ కూడా 49 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. ఫర్హాన్ 46 బంతుల్లో7 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. చివర్లో షాదాబ్ ఖాన్ ధాటిగా ఆడి 11 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు చేశాడు. చివరికి పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో డాసవ్ 3, ఓవర్టన్ 2 , ఆర్చర్ 2 వికెట్లు తీసారు.

ఛేజింగ్ లో ఇంగ్లాండ్ కు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి బంతికే షాహీన్ అఫ్రిది ఫిల్ సాల్ట్ ను ఔట్ చేశాడు. కాసేపటికే బట్లర్ కూడా వెనుదిరిగాడు. తర్వాత బెథెల్ , టామ్ బాంటన్ కూడా వెంటవెంటనే ఔటవడంతో పాక్ ఫుల్ జోష్ లోకి వెళ్లింది. ఇక్కడ నుంచి హ్యారీ బ్రూక్ పాక్ బౌలర్లను ఆటాడుకున్నాడు.
సామ్ కరన్ తో కలిసి 45 , విలి జాక్స్ తో కలిసి 58 పరుగులు జోడించడంతో ఇంగ్లాండ్ లక్ష్యం దిశగా సాగింది. ఈ క్రమంలో హ్యారీ బ్రూక్(Harry Brook) 50 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. అతని ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. సామ్ కరన్ 16, విల్ జాక్స్ 28 పరుగులకు ఔటవగా.. చివర్లో మరో రెండు వికెట్లు కోల్పోయింది. వరుస వికెట్లు పడడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠ రేపినా ఆర్చర్ ఇంగ్లాండ్ ను గెలుపు తీరాలకు చేర్చాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 4 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ కు సూపర్ 8లో ఇది రెండో విజయం.



