USA: అమెరికాలో మహిళ హత్య.. 8 ఏళ్ల తర్వాత దొరికిన నిందితుడు
USA: 2017 మార్చి 23న శశికళ, సాయి హత్యకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
USA
ఎంత తెలివిగల నేరస్తుడైనా ఎక్కడో ఒకచోట తప్పు చేస్తాడు.. కాకుంటే కొన్ని సందర్భాల్లో బాగా ఆలస్యమవుతుంది.. పోలీసులు మాత్రం నిందితుడిని పట్టుకునే వరకూ వేటాడుతూనే ఉంటారు. తాజాగా అలాంటి ఓ హత్య కేసులో నిందితుడు ఎనిమిదేళ్ల తర్వాత దొరికాడు. అమెరికా(USA)లో జరిగిన ఈ హత్యలో హతురాలు ఏపీకి చెందిన మహిళ, ఆమె కుమారుడు.. నిందితుడు కూడా ఇండియాకు చెందిన వ్యక్తే… కొన్నేళ్ళుగా సాగుతున్న ఈ కేసు దర్యాప్తులో పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని కనిపెట్టారు.
ఏపీకి చెందిన నర్రా హనుమంతరావు. భార్య శశికళ కుమారు అనీష్ సాయితో కలిసి న్యూజెర్సీలో ఉండేవారు. భార్యాభర్తలు కాగ్నిజెంట్ కంపెనీలో పనిచేసేవారు. 2017 మార్చి 23న శశికళ, సాయి హత్యకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే భర్త హనుమంతరావుపై శశికళ కుటుంబసభ్యులు ఆరోపణలు చేయడంతో ఆయన్నే నిందితుడిగా భావించారు. కానీ హనుమంతరావును నేరస్తుడిగా నిర్థారించే సాక్ష్యాలు ఏవీ దొరకలేదు. దర్యాప్తులో అసలు హంతకుడు అతడు కాదని తెలిసింది.

ఘటనా స్థలిలో దొరికి డీఎన్ఏ శాంపిల్స్ తో శశికళ భర్త డీఎన్ఏ శాంపిల్స్ సరిపోలకపోవడంతో అతన్ని విడుదల చేశారు. కేసును లోతుగా దర్యాప్తు చేసే క్రమంలో సహోద్యోగి హమీద్ తో హనుమంతరావు, శశికళకు విభేదాలున్నట్టు గుర్తించారు. గతంలో పలుసార్లు శశికళను అతను వేధించడం, హనుమంతరావు మందలించడం జరిగాయి. కంపెనీలో ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితులున్నాయి.
ఈ కోణంలోనే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే హత్యలు జరిగిన ఆరు నెలల తర్వాత హమీద్ భారత్‌కు వచ్చేశాడు. దీంతో హమీద్‌ను అమెరికా (USA)అధికారులు సంప్రదించి, డీఎన్ఏ నమూనా ఇవ్వాలని కోరగా..దానికి అతను నిరాకరించడంతో కేసు దర్యాప్తు నిలిచిపోయింది. ఎలాగైనా డీఎన్ఏను సేకరించాలని భావించిన అమెరికా పోలీసులు కాగ్నజిెంట్ కార్యాలయాన్ని సంప్రదించారు.
ఆఫీసులో అతను వాడిన ల్యాప్ టాప్ కావాలని కోరారు. కాగ్నిజెంట్ యాజమాన్యం సహకారంతో డీఎన్ఎ శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. ఘటనా స్థలంలో దొరికిన శాంపిల్స్ తో సరిపోయింది. దీంతో అసలు నిందితుడు హమీదేనని నిర్థారించారు. హనుమంతరావు లేనప్పుడు శశికళ ఇంటికెళ్లిన హమీద్ అక్కడ ఆమెతో పాటు కుమారుడు అనీశ్ సాయిని కూడా దారుణంగా హత్య చేసాడు. తర్వాత ఆధారాలు ఏమీ దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు. కానీ పోలీసులు ఛాలెంజింగ్ గా తీసుకుని డీఎన్ఏ శాంపిల్స్ తో నిందితుడిని కనిపెట్టారు. ప్రస్తుతం హమీద్ ను అమెరికా(USA) తీసుకెళ్ళేందుకు అమెరికా పోలీసులు సిద్ధమయ్యారు. దీని కోసం భారత విదేశాంగ శాఖ సహాయం కోరారు.




2 Comments