Mosquitoes: ఇంట్లో దోమలకు ఇలా కూడా చెక్ పెట్టొచ్చా?
Mosquitoes: దోమలను నివారించడానికి మార్కెట్లో ఎన్నో రకాల కెమికల్ ప్రొడక్టులు ఉన్నా కూడా, వాటి వాడకం వల్ల కొన్నిసార్లు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది.

Mosquitoes
వానాకాలం వచ్చిందంటే దోమల(Mosquitoes) బెడద ఎక్కువైపోతుంది. దీంతో జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. సీజన్‌తో సంబంధం లేకపోయినా కొన్ని చోట్ల దోమల బెడద ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అయితే దోమలను నివారించడానికి మార్కెట్లో ఎన్నో రకాల కెమికల్ ప్రొడక్టులు ఉన్నా కూడా, వాటి వాడకం వల్ల కొన్నిసార్లు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే ఎలాంటి రసాయనాలు లేకుండా, ఇంట్లోని సహజసిద్ధమైన పదార్థాలతో దోమలను సులభంగా అరికట్టే పద్ధతులను తెలుసుకుందాం.
దోమల(Mosquitoes)ను తరిమికొట్టే సహజ పద్ధతులు:
వెల్లుల్లి నీరు (Garlic Water)… వెల్లుల్లిలో ఉండే ఘాటైన వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను ముద్దగా చేసి నీటిలో ఉడకబెట్టాలి. ఆ తర్వాత ఈ ద్రావణాన్ని చల్లబరచి, ఇంటి చుట్టూ పిచికారీ చేయడం వలన దోమల రాక తగ్గిపోతుంది.

కర్పూరం (Camphor).. కర్పూరం వాసన చాలా తీవ్రంగా ఉంటుంది, దీనిని దోమలు తట్టుకోలేవు. అందుకే ఇది దోమలను దరిచేరకుండా నిరోధిస్తుంది. అన్ని కిటికీలు, తలుపులు మూసివేసి, ఒక కర్పూరం బిళ్లను కాల్చితే, ఆ పొగ దోమలను దూరం చేస్తుంది. లేదా ఒక గిన్నె నీటిలో కర్పూరం బిళ్లను వేసి ఇంటి మూలల్లో ఉంచడం కూడా మంచి ఫలితం ఇస్తుంది. (అయితే, పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచడం ముఖ్యం).
సిట్రోనెల్లా (Citronella).. దోమల నివారణ ప్రొడక్టుల్లో ఎక్కువగా సిట్రోనెల్లా మొక్కను ఉపయోగిస్తారు. మార్కెట్లో దొరికే సిట్రోనెల్లా నూనెను ఇంట్లో వాడవచ్చు, లేదా సిట్రోనెల్లా కొవ్వొత్తులను కాల్చవచ్చు. ఈ మొక్కను ఇంటి లోపల ఉంచడం వలన కూడా దోమలు వ్యాప్తి చెందవు. దీన్ని కిటికీలు లేదా బాల్కనీలో పెంచితే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి.
తులసి (Tulsi).. తులసి మొక్క నుంచి వచ్చే సహజ సువాసన దోమలను తరిమికొడుతుంది. కిటికీల దగ్గర అనేక తులసి మొక్కలను ఉంచడం వల్ల దోమలను నిలువరిస్తాయి. అంతేకాకుండా, తులసి ఆకులతో చేసిన కషాయాన్ని చర్మంపై లేదా ఇంటి చుట్టూ స్ప్రేగా ఉపయోగించవచ్చు. ఈ మూలిక దోమ కాటుకు చికిత్స చేయడంలో కూడా సహాయపడుతుంది.
నిమ్మకాయ మీద లవంగాలు (Lemon & Cloves).. ఇది ఒక సులభమైన చిట్కా. నిమ్మకాయలను సగానికి కోసి, వాటిపై పదునైన భాగంలో లవంగాలను గుచ్చాలి. దీని నుంచి వచ్చే ఘాటైన వాసనతో దోమలు, ఈగలు ఇంట్లో తిరగలేవు.