Uric acid:యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలు.. నియంత్రణ మార్గాలు ..
Uric acid:యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో సహజంగా ఏర్పడే ఒక వ్యర్థ పదార్థం. మనం తీసుకునే ఆహారంలోని ప్యూరిన్‌లు (Purines) అనే రసాయనాలు విచ్ఛిన్నం కావడం వల్ల ఇది ఏర్పడుతుంది.

Uric acid
మీరు తరచుగా మోకాళ్లలో, లేదా పాదాల పెద్ద వేళ్లలో నొప్పి ,వాపును ఎదుర్కొంటున్నారా? అయితే ఇది మీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినట్లుగా (హైపర్యూరిసిమియా) ఒక స్పష్టమైన లక్షణం కావచ్చు. ఈ పెరిగిన స్థాయిలు కీళ్ల నొప్పులు (గౌట్), మూత్రపిండాల్లో రాళ్ల వంటి ప్రమాదకరమైన వ్యాధుల ముప్పును పెంచుతాయి. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సమస్యను కేవలం సమతుల్య ఆహారం, తగినంత నీరు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా నియంత్రించొచ్చని నిపుణులు వివరిస్తున్నారు.
యూరిక్ యాసిడ్(uric acid) అనేది మన శరీరంలో సహజంగా ఏర్పడే ఒక వ్యర్థ పదార్థం. మనం తీసుకునే ఆహారంలోని ప్యూరిన్‌లు (Purines) అనే రసాయనాలు విచ్ఛిన్నం కావడం వల్ల ఇది ఏర్పడుతుంది. సాధారణంగా ఇది రక్తంలో కరిగి, మూత్రపిండాల ద్వారా మూత్రంలో బయటకు వెళ్తుంది. అయితే, ఆహారం సరిగా లేనప్పుడు ఈ ప్రక్రియలో సమస్య వస్తుంది.
మనం అధిక ప్రోటీన్ లేదా అధిక ప్యూరిన్ ఉన్న ఆహారాలు (ముఖ్యంగా ఎర్ర మాంసం) ఎక్కువగా తీసుకున్నప్పుడు, యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ అదనపు భారం మూత్రపిండాలపై ఒత్తిడి పెంచి, యాసిడ్‌ను పూర్తిగా తొలగించకుండా నిరోధిస్తుంది. ఫలితంగా, ఇది రక్తంలో పేరుకుపోయి, కీళ్లలో స్ఫటికాలుగా (Crystals) ఏర్పడటం మొదలవుతుంది. ఆల్కహాల్, జన్యుశాస్త్రం, కిడ్నీ సమస్యలు కూడా ఈ పెరుగుదలకు ఇతర కారణాలు కావచ్చు.

యూరిక్ యాసిడ్ (uric acid)సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. వీటిలో రెడ్ మీట్ (ఎర్ర మాంసం), మటన్, కిడ్నీ బీన్స్, కాలీఫ్లవర్, పుట్టగొడుగులు, పాలకూర వంటి ప్యూరిన్‌లు ఎక్కువగా ఉండే పదార్థాలు ఉన్నాయి. అలాగే, చక్కెర పానీయాలు , ఆల్కహాల్ (ముఖ్యంగా బీరు) తీసుకోవడం కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను మరింత పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యూరిక్ యాసిడ్(uric acid)ను సమర్థవంతంగా నియంత్రించడానికి కొన్ని జీవనశైలి మార్పులు , ఆహారపు అలవాట్లు పాటించాలి. రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తప్పనిసరిగా త్రాగాలి. శరీరంలో నీరు పుష్కలంగా ఉంటేనే, యూరిక్ యాసిడ్ సులభంగా మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు లేదా ఉసిరి (ఆమ్లా) రసం వంటివి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి.
అధిక ప్యూరిన్ ఉన్న ఎర్ర మాంసం, కిడ్నీ బీన్స్, కాలీఫ్లవర్ వంటి వాటి వినియోగాన్ని తగ్గించాలి.మీ ఆహారంలో తృణధాన్యాలు, పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు మరియు గంజి వంటి వాటిని పెంచండి.పాల ఉత్పత్తులు (తక్కువ కొవ్వు ఉన్నవి), విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు (నిమ్మ, నారింజ వంటివి) తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే, మిగిలిన సభ్యులు కూడా తరచూ పరీక్షలు చేయించుకుని జాగ్రత్త పడాలి.
మీకు తరచుగా ఈ సమస్యలు ఎదురైతే, సొంత చికిత్స చేయకుండా, వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స పొందడం ఉత్తమం.