New bill: 30 రోజులు జైలులో ఉంటే..సీఎం, పీఎం పదవి రద్దు..ఏంటీ కొత్త బిల్లు?
New bill: ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా ఏదేని ఒక మంత్రి క్రిమినల్ కేసులో అరెస్ట్ అయి, 30 రోజుల పాటు జైలులో ఉంటే, ఆ 31వ రోజున వారి పదవి ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది.

New bill
ఇవాళ లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు కీలక బిల్లులు (New bill)దేశ రాజకీయాల్లో భారీ చర్చకు తెరలేపాయి.నిస్వార్థంగా దేశానికి సేవ చేయాల్సిన నాయకులు, నేరారోపణలు ఎదుర్కొంటే వారిని పదవిలోంచి తొలగించడం సరైందేనా? ఒక నాయకుడిని కేవలం అరెస్ట్ ఆధారంగా, నేరం నిరూపితం కాకముందే పదవి నుంచి తీసేయడం ప్రజాస్వామ్యానికి ముప్పేనా? ఈ ప్రశ్నలే ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెను రచ్చకు దారితీస్తున్నాయి.
వీటిలో అత్యంత ప్రధానమైన అంశం ఏమిటంటే, ఒక ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా ఏదేని ఒక మంత్రి క్రిమినల్ కేసులో అరెస్ట్ అయి, 30 రోజుల పాటు జైలులో ఉంటే, ఆ 31వ రోజున వారి పదవి ఆటోమేటిక్‌గా రద్దు అవుతుంది. ఈ నిబంధన దేశ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు అరెస్ట్ అయిన నాయకులు పదవి వదిలివేయడం ఒక సంప్రదాయంగా ఉండేది.
మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కానీ, దానిని న్యాయపరంగా బలవంతంగా తొలగించేందుకు స్పష్టమైన నిబంధన రాజ్యాంగంలో లేదు. కొత్త బిల్లు ఆ లోటును భర్తీ చేయనుంది. ఈ నిబంధన ప్రకారం, కేంద్రంలో ప్రధానమంత్రిని రాష్ట్రపతి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని గవర్నర్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ తమ పదవి నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటారు. అయితే, అరెస్ట్ నుంచి విడుదలైన తర్వాత అదే పదవిలో తిరిగి నియమించుకునే అవకాశం మాత్రం ఉంది.
ప్రభుత్వం ఈ బిల్లు(New bill)లను దేశ పాలనలో పారదర్శకత, ప్రజాప్రతినిధులపై నమ్మకాన్ని పెంచడానికే ఉద్దేశించిందని అంటోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నాయకుల ప్రవర్తన ఉండాలని, నేరారోపణలు ఎదుర్కొంటూ పదవిలో కొనసాగడం ప్రజాభిప్రాయానికీ, చట్టబద్ధతకూ విరుద్ధమని తెలిపారు. ఇది ఒక శుభ పరిణామమని, మంచి పాలనకు అవసరమైన నైతిక ప్రమాణాలను పెంచుతుందని ప్రభుత్వం వాదిస్తోంది.
Modi: ఒకేసారి ఉద్యోగులు, వ్యాపారులకు మోదీ సర్కార్ దీపావళి కానుక
అయితే, ప్రతిపక్షాలు ఈ బిల్లుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, AIMIM వంటి పార్టీలు దీనిని రాజ్యాంగబద్ధ సమాఖ్య నిర్మాణానికి, రాష్ట్రాల అధికారానికి పెను ముప్పు అని విమర్శిస్తున్నాయి.
కేవలం అరెస్ట్ ఆధారంగా, నేరం నిరూపితం కాకముందే ఒక ముఖ్యమంత్రి పదవి కోల్పోవడం చాలా ప్రమాదకరమని, ఇది ఎక్కువగా రాజకీయ దుర్వినియోగానికి దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఈ బిల్లును “దేశాన్ని పోలీసు రాజ్యంగా మార్చే బిల్లు” అంటూ తీవ్రంగా ఖండించారు. అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తమ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టి, వారిని సులభంగా పదవి నుంచి తొలగించవచ్చని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.

న్యాయ నిపుణులు కూడా ఈ బిల్లుపై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది న్యాయ నిపుణులు ఈ బిల్లును ప్రజా విశ్వాసాన్ని నిలిపే మార్గంగా సానుకూలంగా చూస్తున్నా కూడా , మరికొందరు దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి నేర నిర్ధారణ లేకుండా, కేవలం అరెస్ట్‌తోనే పదవి పోవడం న్యాయపరంగా సరైందేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రాజకీయ కక్ష సాధింపులు, తప్పుడు కేసులతో ప్రత్యర్థులను బలహీనపరిచే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులతో ఈ బిల్లులను మరింత లోతుగా విశ్లేషించడం కోసం పార్లమెంటరీ జాయింట్ కమిటీకి పంపించాలని నిపుణులు సూచిస్తున్నారు. సిద్ధాంతపరంగా ప్రజాస్వామ్యంలో నాయకులపై నేరారోపణలు వస్తే వారు పదవిలో కొనసాగకుండా చూడాలన్న ఉద్దేశం మంచిదే అయినా, ఆచరణలో రాజకీయ దుర్వినియోగం జరగకుండా ఉండేందుకు బలమైన భద్రతా చర్యలు, నిబంధనలు ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం అవుతోంది.