Just NationalJust Political

NCERT:సుప్రీంకోర్టు ఆగ్రహం.. బహిరంగ క్షమాపణ చెప్పేంతగా ఎన్‌సీఈఆర్‌టీ ఏం చేసింది?

NCERT:సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని గంటలకే ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) తన వివరణను అఫీషియల్‌గా విడుదల చేసింది.

NCERT

భారత దేశమంతటా పాఠశాల విద్యా ప్రమాణాలను రూపొందిస్తున్న.. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)’ ఇప్పుడు ఒక అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఎనిమిదో తరగతి సోషల్ పాఠ్యపుస్తకంలో భారతదేశంలోని న్యాయవ్యవస్థ గురించి వివరిస్తూ ..అవినీతి అనే పదాన్ని వాడటంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో స్పందించింది.

దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అవడంతో ఉలిక్కిపడ్డ ఎన్‌సీఈఆర్‌టీ.. వెంటనే సుప్రీంకోర్టుకు బహిరంగ క్షమాపణలు చెప్పింది. అంతే కాకుండా, వివాదాస్పదంగా మారిన ఆ పాఠ్యాంశాలను వెబ్‌సైట్ నుంచి తొలగించడటంతో పాటు ఇప్పటికే ముద్రించిన పుస్తకాల పంపిణీని నిలిపివేసింది. రాజ్యాంగబద్ధమైన సంస్థలను కించపరిచేలా పాఠాలు ఉండటం స్టూడెంట్స్ భవిష్యత్తుపై తప్పుడు ప్రభావం చూపుతుందని కోర్టు హెచ్చరించింది.

ఈ వివాదానికి ప్రధాన కారణం ఏంటంటే.. ఎనిమిదో తరగతి కొత్త పాఠ్యపుస్తకంలో భారతదేశంలో న్యాయవ్యవస్థ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్‌ గురించి ఒక అధ్యాయం చేర్చి..అందులో న్యాయవ్యవస్థలో అవినీతి ఒక ప్రధాన సమస్యగా పేర్కొన్నారు. అలాగే కేసుల విపరీతమైన బ్యాక్‌లాగ్ , న్యాయమూర్తుల కొరత వంటి అంశాలను కూడా అందులో చర్చించారు.

అయితే, ప్రాథమిక స్థాయిలోనే విద్యార్థులకు న్యాయవ్యవస్థ పట్ల గౌరవాన్ని పెంచాల్సింది పోయి, ఇలాంటి అభ్యంతరకర పదజాలం వాడటంతో.. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్ , అభిషేక్ మను సింఘ్వీ ఇద్దరూ సుప్రీంకోర్టు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని విచారించింది. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసేలా, న్యాయవ్యవస్థపై మచ్చ వేసేలా వ్యవహరించే వారిని ఎవరినీ కూడా సహించబోమని, విద్యార్థుల మనసుల్లో విషం నింపే ఇలాంటి పాఠ్యాంశాలు తగవని సీజేఐ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సుప్రీంకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని గంటలకే ఎన్‌సీఈఆర్‌టీ(NCERT) తన వివరణను అఫీషియల్‌గా విడుదల చేసింది. కేవలం నిర్ణయాత్మక లోపం వల్ల ,అలాగే ఎడిటింగ్ పొరపాటు వల్లే ఈ అవాంఛనీయ పదం పుస్తకంలోకి వచ్చిందని, న్యాయవ్యవస్థను తక్కువ చేయాలనే ఉద్దేశ్యం తమకు ఏమాత్రం లేదని వివరణ ఇచ్చింది.

NCERT
NCERT

భారత రాజ్యాంగాన్ని అలాగే పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడే న్యాయవ్యవస్థను తాము అత్యున్నత గౌరవంతో చూస్తామని ఎన్‌సీఈఆర్‌టీ (NCERT)చెప్పింది . ప్రస్తుతం ఆ అధ్యాయాన్ని నిపుణుల కమిటీ సాయంతో తిరిగి రాయనున్నామని, తప్పులు లేని సరికొత్త పాఠ్యపుస్తకాలు 2026-27 విద్యాసంవత్సరం ప్రారంభం నాటికల్లా విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేసింది.

నిజానికి ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలపై ఇలా వివాదాలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చరిత్ర,, సామాజిక శాస్త్ర పాఠ్యాంశాల్లో చేసిన మార్పులు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీశాయి. కరోనా సమయంలో విద్యార్థులపై భారం తగ్గిస్తున్నామన్న పేరుతో మొఘల్ సామ్రాజ్య చరిత్రను, గాంధీజీ హత్య తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌పై విధించిన నిషేధం వంటి ముఖ్యమైన అంశాలను తొలగించడంపై అప్పట్లో చరిత్రకారులు విరుచుకుపడ్డారు.

అలాగే పదో తరగతి సైన్స్ పుస్తకం నుంచి ఏకంగా చార్లెస్ డార్విన్ పరిణామ సిద్ధాంతం చాప్టర్‌ను తొలగించినప్పుడు సుమారు 1800 మంది శాస్త్రవేత్తలు బహిరంగ లేఖ ద్వారా తమ నిరసన తెలిపారు. అయితే తాజా వివాదం న్యాయవ్యవస్థకు సంబంధించింది కావడంతో, విద్యాశాఖ కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button