Just SpiritualLatest News

Shivaratri:శివరాత్రి రోజు ఏం చేయాలి? ఎలా పూజిస్తే శివయ్య ప్రసన్నమవుతాడు?

Shivaratri: మాఘపు ఆదివారం రోజు శివరాత్రి రావడం వల్ల అటు సూర్యుడిని, ఇటు లయకారుడైన మహా శివుడిని ఒకేసారి ఆరాధించే అరుదైన అవకాశం ఈసారి భక్తులకు లభిస్తోంది.

Shivaratri

శివరాత్రి అనగానే అందరికీ ఉపవాసాలు, రాత్రంతా మేల్కొని జాగారాలు చేయడం గుర్తొస్తాయి. కానీ శివరాత్రి(Shivaratri) పరమార్థం కేవలం జాగరణ మాత్రమే కాదు, ఆ శివతత్త్వాన్ని మన మనసులో భక్తితో నింపుకోవడం. ఈ ఏడాది రాబోతున్న మహాశివరాత్రి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజు రావడం మరింత పవిత్రమైనదని పండితులు వివరిస్తున్నారు.

సాధారణంగానే మాఘ మాసం అంటేనే పాపాలను ప్రక్షాళన చేసేది అని అర్థంగా చెబుతారు. అలాంటి మాఘపు ఆదివారం రోజు శివరాత్రి(Shivaratri) రావడం వల్ల అటు సూర్యుడిని, ఇటు లయకారుడైన మహా శివుడిని ఒకేసారి ఆరాధించే అరుదైన అవకాశం ఈసారి భక్తులకు లభిస్తోంది. సూర్యుడికి అధిదేవత రుద్రుడే కావడం వల్ల ఆదివారం రోజు శివయ్యకు చేసే పూజలకు రెట్టింపు ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.

మహాశివరాత్రి అంటే శివుడు లింగోద్భవం చెందిన రోజు మాత్రమే కాకుండా లయకారుడు అయిన మహాశివుడు పార్వతీ దేవిని పరిణయమాడిన శుభదినం కూడా. సకల జగత్తును కాపాడటం కోసం పరమేశ్వరుడు గరళాన్ని గొంతులో బంధించి నీలకంఠుడిగా మారిన పవిత్ర ఘట్టం శివరాత్రి రోజే జరిగింది. అందుకే శివరాత్రి రోజు చేసే శివ నామస్మరణ మనిషిలోని నెగటివ్ ఆలోచనలను హరిస్తుంది.

ఉపవాసం అంటే కేవలం భోజనం మానేయడం కాదు, ఉప అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం అన్నమాట. అంటే ఉపవాసం చేసిన ఆ రోజంతా దైవ చింతనతో భగవంతుడకి దగ్గరగా ఉండటమే నిజమైన ఉపవాసం. అలాగే జాగరణ అంటే ఏదో కాలక్షేపానికి టీవీలు చూస్తూ, ఆటలు ఆడుకుంటూ గడపడం కాదు, మనలో ఉన్న అంతరాత్మను మేల్కొలిపి పరమాత్మతో అనుసంధానం చేయాలి.

పురాణాల ప్రకారం విష్ణుమూర్తి అలంకార ప్రియుడైతే, మహా శివుడు అభిషేక ప్రియుడు. అందుకే శివరాత్రి రోజు శివలింగానికి చేసే అభిషేకానికి అంత ప్రాముఖ్యత ఉంది. బొటనవేలు పరిమాణంలో ఉండే శివలింగానికి ఇంట్లోనే గంగాజలం, పంచామృతాలు, విభూతి, చందనంతో అభిషేకం చేయాలి. అలా చేయడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు, నెగెటివ్ శక్తి తొలగిపోతాయి.

శివరాత్రి(Shivaratri) రోజు అర్ధరాత్రి వేళ వచ్చే లింగోద్భవ కాలంలో అంటే రాత్రి 11:30 నుంచి 12:30 మధ్య శివలింగానికి బిల్వ పత్రాలతో కనుక అర్చన చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆదివారం శివరాత్రి కలిసిన ఈ అరుదైన సమయంలో శివారాధన చేయడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోవడమే కాకుండా, పితృ దోషాల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

Shivaratri
Shivaratri

శివరాత్రి పర్వదినాన ఓం నమః శివాయ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ, రుద్రాభిషేకం కానీ బిల్వార్చన కానీ చేసే వారికి శత్రు పీడనలు తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. నవగ్రహాల దోషాలు ఉన్నవారు ఈ రోజు సూర్యారాధనతో పాటు శివ పూజ చేయడం వల్ల గ్రహ బాధల నుంచి ఉపశమనం పొందుతారని పండితులు చెబుతున్నారు.

ఆరోజు కేవలం పూజలు మాత్రమే కాదు, శక్తి ఉన్నవారు అన్నదానం,వస్త్ర దానం వంటివి మీకు తోచినవి చేస్తే ఆ పుణ్యఫలం వంశపారంపర్యంగా కాపాడుతుందని పండితులు చెబుతున్నారు. శివరాత్రి పర్వదినాన పూజలు చేయలేని వారు కనీసం ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించినా చాలని అంటున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button