Narakasura: నరకాసుర వధ వెనుక ఉన్న లోతైన జీవనబోధ గురించి మీకు తెలుసా?
Narakasura: నరకాసురుడు సాక్షాత్తూ విష్ణుమూర్తి (వరాహస్వామి) , భూదేవికి కుమారుడు. అతను సంధ్యవేళలో జన్మించాడు – ఇది జ్ఞానం (పగలు) ,అజ్ఞానం (రాత్రి) కలిసిన సమయాన్ని సూచిస్తుంది.

Narakasura
దీపావళి పండుగ, శ్రీకృష్ణుడు సత్యభామ సహాయంతో నరకాసురుడి(Narakasura)ని సంహరించిన సంఘటనకు చిహ్నంగా కూడా నిలుస్తుంది. ఈ కథలో కేవలం రాక్షసుడి అంతం మాత్రమే కాకుండా, లోతైన జీవనబోధ దాగి ఉంది. నరకాసురుడు సాక్షాత్తూ విష్ణుమూర్తి (వరాహస్వామి) , భూదేవికి కుమారుడు. అతను సంధ్యవేళలో జన్మించాడు – ఇది జ్ఞానం (పగలు) ,అజ్ఞానం (రాత్రి) కలిసిన సమయాన్ని సూచిస్తుంది.
అతడిలో దైవాంశ , సద్గుణాలు ఉన్నా కూడా, ఒక్క చెడు లక్షణం కారణంగా జీవితం నాశనమవుతుందని ఈ కథ బోధిస్తుంది. రావణుడు అపారమైన జ్ఞాని అయినా అహంకారంతో నశించాడు; మహిషాసురుడు మహా బలవంతుడు అయినా మదంతో నశించాడు; అదేవిధంగా, నరకాసురుడు కూడా కామం, మదం, క్రోధంతో తనను తాను నశింపజేసుకున్నాడు.

తన కుమారుడిని చంపకూడదని భూదేవి కోరినా, నరకాసురుడి దుష్టత్వం శ్రుతి మించడంతో, సత్యభామ రూపంలో తానే అతనిని సంహరించాల్సి వచ్చింది. తన సద్గుణాలను నిలుపుకోకపోతే, దేవుని పుత్రుడైనా నశిస్తాడని ఈ కథ స్పష్టం చేస్తుంది. నరకాసురుని అంతానికి ప్రధాన కారణం బాణాసురుడి వంటి రాక్షసుల చెడు సాంగత్యం. ఈ దుష్ట సాంగత్యంతోనే నరకాసురునిలో ఉన్న రాక్షస ప్రవృత్తి మేల్కొని, మునులను అవమానించడం, దేవతలను దూషించడం, మరియు 16,000 మంది రాజకుమార్తెలను బంధించడం వంటి పాపాలు చేశాడు. అంతిమంగా, అతడు సత్యభామ చేతిలో తన అంతాన్ని చూశాడు.
ఈ కథ ద్వారా లభించే జీవన బోధ ఏమిటంటే..మన గుణమే మన గమ్యం: ప్రహ్లాదుడు ఒక రాక్షసుని కడుపున పుట్టినా దైవ భక్తుడిగా (దేవుడిగా) మారాడు. కానీ నరకాసురుడు దేవుని కడుపున పుట్టినా రాక్షసుడయ్యాడు. మన సాంగత్యమే మనకు శాపంగా లేదా ఆశీర్వాదంగా మారుతుంది.
దీపావళి పండుగ అంటే కేవలం భౌతికమైన వెలుగు మాత్రమే కాదు – అజ్ఞానం అనే చీకటిపై జ్ఞానం అనే వెలుగు సాధించిన విజయమే నిజమైన దీపావళి.