Koneru Hampi : స్వర్ణానికి చేరువైన కోనేరు హంపికి..ఆల్ ది బెస్ట్
Koneru Hampi : భారత చెస్ చరిత్రలో కోనేరు హంపి ( Koneru Hampi) ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపింది.

Koneru Hampi : భారత చెస్ చరిత్రలో కోనేరు హంపి ( Koneru Hampi) ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. మన తెలుగు తేజం, భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి, ఫిడే మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్(FIDE Women’s World Cup)కు చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. జార్జియాలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో ఆమె తన అద్భుతమైన వ్యూహాలు, పట్టుదలతో దేశానికే గర్వకారణంగా నిలిచింది.
Koneru Hampi
క్వార్టర్ ఫైనల్స్‌లో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో కోనేరు హంపి 1.5-0.5 పాయింట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. మొదటి గేమ్‌లో తెల్లపావులతో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి విజయం సాధించిన హంపి, రెండో గేమ్‌లో డ్రా చేసుకుని సెమీస్‌లో తన స్థానాన్ని పక్కా చేసుకుంది. ఆమె ప్రతి కదలికలో కనిపించిన అనుభవం, వ్యూహాత్మక ఆలోచన విజయానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో 1987లో జన్మించిన కోనేరు హంపి, ఐదు సంవత్సరాల వయసులోనే తన తండ్రి కోనేరు అశోక్ ద్వారా చెస్(Chess) నేర్చుకుంది. 2002లో గ్రాండ్ మాస్టర్ టైటిల్ సాధించిన ఆమె, 2019, 2024లో మహిళల ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచింది. అనేక అంతర్జాతీయ టైటిళ్లను గెలుచుకున్న హంపి, భారత మహిళా చెస్‌కు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు తీసుకొచ్చింది.
కోనేరు హంపి ఈ గొప్ప విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా చాలామంది ప్రముఖులు హంపికి శుభాకాంక్షలు తెలియజేశారు. “వరల్డ్ కప్ సెమీఫైనల్లో చేరిన తొలి భారతీయ మహిళగా కోనేరు హంపి చరిత్ర సృష్టించింది. ఇది తెలుగు ప్రజలందరికీ గర్వకారణం,” అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేయగా, చంద్రబాబు నాయుడు “మన తెలుగు కుమార్తె ప్రపంచ వేదికపై కాంతులు విరజిమ్ముతోంది. నీ ఘనత దేశవ్యాప్తంగా మమ్మల్ని గర్వించేలా చేస్తోంది,” అని కొనియాడారు.
ప్రస్తుతం జార్జియాలో జరుగుతున్న FIDE మహిళల ప్రపంచ కప్ 2025 షెడ్యూల్ ప్రకారం.. సెమీఫైనల్స్ జూలై 26, జూలై 27 తేదీలలో జరగనున్నాయి.
ఫైనల్స్ జూలై 28 న జరుగుతాయి. కోనేరు హంపి ఇప్పటికే సెమీఫైనల్స్‌కు చేరుకుంది. సెమీస్‌లో ఆమె చైనాకు చెందిన టాప్ సీడ్ లీ టింగ్‌జీ (Lei Tingjie) తో తలపడనుంది. మరో సెమీఫైనలిస్ట్ కోసం డి.హారిక ద్రోణవల్లి , దివ్య దేశ్‌ముఖ్ మధ్య జరిగిన మ్యాచ్ టై బ్రేక్‌కు దారితీసింది. ఈ టోర్నమెంట్ జూలై 29 న ముగుస్తుంది.
మొత్తంగా ఫిడే మహిళల ప్రపంచ కప్ సెమీఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన కోనేరు హంపి..ఇప్పుడు సెమీఫైనల్లో కూడా విజయం సాధించాలని దేశమంతా కోరుకుంటోంది.
.…ఆల్ ది బెస్ట్ కోనేరు హంపి..