T20 World Cup : వరల్డ్ కప్‌లో శ్రీలంక బోణీ..ఐర్లాండ్‌పై విజయం
T20 World Cup : సొంతగడ్డపై జరుగుతున్న టీ ట్వంటీ ప్రపంచకప్ లో శ్రీలంక శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.

T20 World Cup
సొంతగడ్డపై జరుగుతున్న టీ ట్వంటీ ప్రపంచకప్ ( T20 World Cup) లో శ్రీలంక శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ లో కమిందు మెండిస్, కుశాల్ మెండిస్.. బౌలింగ్ లో హసరంగా, తీక్షణ రాణించడంతో ఐర్లాండ్ పోరాడినా ఓటమి తప్పలేదు.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. నిస్సాంక (24), కమిల్ మిశారా(14), రత్నానాయకే (5), వెల్లలాగే (10) పరుగులకే ఔటవడంతో లంక 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కుశాల్ మెండిస్, కమిందు మెండిస్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 67 పరుగులు జోడించారు. ఈ క్రమంలో కుశాల్ మెండిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. కమిందు మెండిస్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
కేవలం 19 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 44 రన్స్ చేశాడు. అటు కుశాల్ మెండిస్ 43 బంతుల్లో 5 ఫోర్లతో 56 పరుగులు చేశాడు. వీరిద్దరూ ఆదుకోవడంతో శ్రీలంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. ఐర్లాండ్ బౌలర్లలో మెకర్తీ 2, డాక్రెల్ 2 వికెట్లు పడగొట్టారు.
ఛేజింగ్ లో ఐర్లాండ్ త్వరగానే పాల్ స్టిర్లింగ్ (6) వికెట్ కోల్పోయింది. ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. తర్వాత రాస్ అడియర్, హ్యారీ టెక్టర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంతసేపూ ఐర్లాండ్ లంకకు షాకిచ్చేలా కనిపించింది. రాస్ 34 రన్స్ కు ఔటవగా.. టక్కర్ , టెక్టర్ మూడో వికెట్ కు 49 పరుగులు జోడించడంతో మ్యాచ్ ఆసక్తికరం సాగింది. అయితే కీలక సమయంలో లంక బౌలర్లు విజృంభించారు.

స్పిన్నర్ హసరంగా, పేసర్ తీక్షణ చెలరేగడంతో ఐర్లాండ్ వరుస వికెట్లు చేజార్చుకుంది.వీరిద్దరి దెబ్బకు ఐర్లాండ్ 143 పరుగులకే ఆలౌటైంది. హసరంగా, తీక్షణ మూడేసి వికెట్లు పడగొట్టారు. కమిందు మెండిస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.



