Gautam Gambhir: పిచ్ లపై కాదు తుది జట్టుపై ఫోకస్ పెట్టు.. గంభీర్ ను ఏకిపారేస్తున్న ఫ్యాన్స్
Gautam Gambhir: టెస్టుల్లో అత్యంత కీలకమైన మూడో స్థానంలో గంభీర్ చేస్తున్న మితిమీరిన ప్రయోగాలపై మాజీలు దుమ్మెత్తిపోస్తున్నారు.
Gautam Gambhir
టెస్ట్ మ్యాచ్ అంటే ఒకప్పుడు బోర్.. గత కొంతకాలంగా మాత్రం ఫలితాలు బాగానే వస్తున్నాయి.. అదే సమయంలో పలు సందర్భాల్లో టెస్టులు రెండు రోజుల్లోనే ముగిసిపోతున్నాయి.. అయితే డ్రా… లేకుంటే ఇలా రెండు రోజుల్లోనే ఫలితం.. ఇలాగే కొనసాగితే టెస్ట్ క్రికెట్ మనుగడ కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి లోపం ఎక్కడుందంటే అందరూ పిచ్ లనే కారణంగా చెబుతున్నారు.
ఆతిథ్య జట్టు చెప్పినట్టే పిచ్ రెడీ అవుతుంది. సౌతాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇదే జరిగింది. గంభీర్(Gautam Gambhir) సూచన మేరకే పిచ్ క్యూరేటర్ వికెట్ ను రెడీ చేసి ఇచ్చాడు. కానీ మన బ్యాటర్లు ఆ పిచ్ కు తగ్గట్టు వ్యూహాత్మకంగా ఆడలేకపోవడంతోనే ఓటమి ఎదురైంది. ఇప్పుడు పిచ్ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. అయితే పిచ్ ఎలా ఉన్నా కూడా ఆడాల్సిన బాధ్యత బ్యాటర్లదే. కఠినమైన పిచ్ లపై ఆడితేనే కదా బ్యాటర్ల సత్తా తెలిసేది.
నిజానికి గంభీర్ (Gautam Gambhir)చేసిన తప్పిదాలలో మొదటిది పిచ్ ఎంపిక.. రెండోది పిచ్ కు తగ్గట్టు తుది జట్టు కూర్పు లేకపోవడం… ఆతిథ్య జట్టు హోదాలో కోచ్ ఏం చెబితే అదే పిచ్ సిద్ధం చేసి ఇచ్చాడు క్యూరేటర్.. అలాంటప్పుడు తుది జట్టు కూర్పు విషయంలో పక్కాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈడెన్ టెస్టులో గంభీర్ ఇదే లాజిక్ మిస్ అయ్యాడు.

సింపుల్ లాజిక్ ఏంటంటే పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటే అదనపు బౌలర్ తో ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ బౌలర్లకు సహకరిస్తుందని అంచనా వేస్తే ఎక్స్ ట్రా బ్యాటర్ తో బరిలోకి దిగాలి. కోల్ కత్తా టెస్టుకు ముందు అక్కడి పిచ్ పైనే అందరి ఫోకస్ నిలిచింది. స్పిన్ కు అనుకూలిస్తుందని ముంబై అంచనా వేశారు. అలాంటప్పుడు స్పిన్ పిచ్ పై నలుగురు స్పిన్నర్లు ఎందుకు తీసుకున్నాడో గంభీర్ (Gautam Gambhir)కే తెలియాలి. ఇలాంటి పిచ్ పై ఇద్దరు స్పిన్నర్లు చాలు.
అలా తుది జట్టు ఎంపిక చేసుకుని ఉంటే సాయి సుదర్శన్ కూడా జట్టులో ఉండేవాడు. ప్రత్యర్థి సౌతాఫ్రికా మాత్రం పిచ్ ను బట్టే తుది జట్టును సెలక్ట్ చేసుకుంది. తుది జట్టులో ఇద్దరు స్పిన్నర్లనే ఆడించింది. బ్యాటింగ్ డెప్త్ ఉండేలా చూసుకోవడమే సఫారీలకు కలిసొచ్చింది. రెండో ఇన్నింగ్స్ లో బవుమాకు చక్కని సపోర్ట్ ఇచ్చిన బోస్చే చేసిన కీలక పరుగులే సఫారీ టీమ్ విజయానికి కారణమయ్యాయి.
పైగా టెస్టుల్లో అత్యంత కీలకమైన మూడో స్థానంలో గంభీర్ చేస్తున్న మితిమీరిన ప్రయోగాలపై మాజీలు దుమ్మెత్తిపోస్తున్నారు. పుజారా, రహానే వంటి టెస్ట్ స్పెషలిస్టులు ఆడాల్సిన ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ ను ఆడించడంపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. పిచ్ కంటే కూడా ముందు ఫైనల్ ఎలెవన్ కాంబినేషన్ సెట్ చేసుకోమని సూచిస్తున్నారు.



