Senior citizen:వృద్ధుల ఒంటరితనాన్ని తరిమికొట్టే డే కేర్ సెంటర్లు..డబ్బులకు కాదు ఫ్రీగానే..ఎలా అప్లై చేయాలంటే..
Senior citizen: తెలంగాణ ప్రభుత్వం 'ప్రణామ్' (PRANAM) అనే అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది.కేంద్ర ప్రభుత్వ అటల్ వయో అభ్యుదయ యోజన సహకారంతో తెలంగాణ వ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు
Senior citizen
వృద్ధాప్యం అనేది మలి వసంతం కావాలి.. కానీ చాలామందికి అది ఒంటరితనంతో భారంగా మారిపోతుంది. తమ పిల్లలు ఉద్యోగాల రీత్యా దూరంగా ఉండటం వల్లో, ఇంట్లో ఉన్నా పట్టించుకునే వారు లేకో మానసిక కుంగుబాటుకు లోనవుతున్న సీనియర్ సిటిజన్లు(Senior citizen) రోజురోజుకు పెరిగిపోతున్నారు. పిల్లలు ఉదయం అంతా వారివారి పనులకు వెళ్లడంతో ఇంట్లో ఒక్కరూ ఉండలేక సతమతమవుతూ ఉన్నారు.
ఇలాంటివారి కోసం తెలంగాణ ప్రభుత్వం ‘ప్రణామ్’ (PRANAM) అనే అద్భుతమైన పథకాన్ని తీసుకువచ్చింది.కేంద్ర ప్రభుత్వ అటల్ వయో అభ్యుదయ యోజన సహకారంతో తెలంగాణ వ్యాప్తంగా 37 మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.
దీనిలో భాగంగా ఈరోజు అంటే జనవరి 12న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజాభవన్ నుంచి వర్చువల్ పద్ధతిలో.. మొదటి విడతగా 18 కేంద్రాలను ప్రారంభించి వృద్ధుల (Senior citizen) కు సంక్రాంతి కానుకను అందించారు.
అమ్మ ఒడిలాంటి డే కేర్ సెంటర్లు..ఈ సెంటర్లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తాయి. ప్రతి ప్రణామ్ సెంటర్ లో 50 మంది వృద్ధులకు అవకాశం ఉంటుంది. ఇది కేవలం కాలక్షేపం కోసం మాత్రమే కాదు, వారి ఆరోగ్యానికి , పోషణకు పెద్దపీట వేసేలా ఏర్పాటు చేశారు.
ఉదయం రాగి జావ, టిఫిన్ తో మొదలై, మధ్యాహ్నం పౌష్టికాహారం , సాయంత్రం టీ, బిస్కెట్లు అందిస్తారు. ఇక్కడ ఉండే డాక్టర్ రూమ్స్, ఫిజియోథెరపీ , యోగా సెంటర్లు వారి శారీరక ఆరోగ్యాన్ని కాపాడితే.. లైబ్రరీ, టీవీ, క్యారమ్స్ , చెస్ వంటి ఇండోర్ గేమ్స్ వారిలో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. అంతేకాదు తోటివారితో కబుర్లు చెప్పుకుంటూ గడిపే ఈ సమయం వారిలో డిప్రెషన్ రాకుండా కాపాడుతుంది.
ఈ సెంటర్లలో చేరడానికి 60 ఏళ్లు నిండిన సీనియర్ సిటిజన్స్(Senior citizen) మాత్రమే అర్హులు. ముఖ్యంగా ఒంటరిగా ఉండేవారికి, మహిళలకు అయితే 60 శాతం కోటాతో ప్రాధాన్యత ఇస్తారు. దారిద్య్రరేఖకు దిగువన (BPL) ఉన్నవారికి ,నెలకు రూ. 15,000 కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, గవర్నమెంట్ డాక్టర్ నుంచి పొందిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఒకే కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తారు. నెలకు కనీసం 20 రోజులయినా హాజరుకావడం తప్పనిసరి చేశారు.
దరఖాస్తు చేసుకునే మార్గం..ప్రణామ్ సెంటర్లలో చేరాలనుకునే వారు, లేదా తమ ఇంట్లోవాళ్లను చేర్చాలనుకునేవారు ఆన్‌లైన్లో ts-pranam.telangana.gov.in పోర్టల్ ద్వారా కానీ మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ వీలుకాని వారు నేరుగా తమ జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో కానీ సమీపంలోని డే కేర్ సెంటర్లో కానీ ఫారం నింపి ఇవ్వొచ్చు.
దరఖాస్తు చేసిన 7 నుంచి 10 రోజుల్లో వెరిఫికేషన్ పూర్తి చేసి ఐడీ కార్డులను అందజేస్తారు. ఈ సేవలు వృద్ధులకు పూర్తిగా ఉచితమే. ప్రభుత్వం ప్రతి ప్రణామ్ సెంటర్ మెయింటెనెన్స్ కోసం నెలకు సుమారు రూ. 90,000 ఖర్చు చేస్తూ, మొత్తం రూ. 4.61 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది.

నిజానికి ఈ ఆలోచన బీఆర్ఎస్ హయాంలోనే మొలకెత్తింది. 2022లో యెల్లారెడ్డిపేటలో కేటీఆర్ సూచనతో మొదటి సెంటర్ ను పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. ఆ సక్సెస్ ను చూసిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం.. దీనిని ఎంకరేజ్ చేయడానికి ముందుకువచ్చి రాష్ట్రవ్యాప్తం చేస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది.
ఉమ్మడి జిల్లాలైన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హనుమకొండలలో జిల్లాకు రెండు చొప్పున, మిగతా జిల్లాల్లో ఒక్కో సెంటర్ చొప్పున ఏర్పాటు చేశారు. ఎక్కడో అమెరికాలోనో, లండన్ లోనో ఉండే ఎంతోమందికి .. తమ తల్లిదండ్రులు స్వదేశంలో సురక్షితంగా, సంతోషంగా ఉన్నారనే భరోసాను ఈ ‘ప్రణామ్’ కల్పిస్తోంది.
Wardrobe: ఇంట్లో సంపద పెరగాలంటే బీరువా ఏ దిశలో ఉండాలో తెలుసా?




One Comment