Exercise:కొత్తగా వ్యాయామం స్టార్ట్ చేస్తున్నారా? మొదటి 15 రోజుల ప్లాన్ ఇదే..
Exercise: మీ శరీరం వ్యాయామానికి అలవాటు పడాలంటే ఈ 15 రోజుల ప్లాన్ పాటించాలని అంటున్నారు నిపుణులు.
Exercise
చాలామంది వ్యాయామం చేద్దామని ఉత్సాహంగా జిమ్‌లో జాయిన్ అవడమో..లేక ఇంట్లోనే హెవీ వర్కవుట్లు చేసేసి నాలుగు రోజుల్లోనే ఆపేస్తుంటారు. శరీరాన్ని ఒక్కసారిగా కష్టపెట్టడం వల్ల బాడీలో రకరకాల నొప్పులతో పాటు వ్యాయామం(Exercise) అంటేనే భయపడతారు. అలా కాకుండా మీ శరీరం వ్యాయామానికి అలవాటు పడాలంటే ఈ 15 రోజుల ప్లాన్ పాటించాలని అంటున్నారు నిపుణులు.
మొదటి ఐదు రోజులు కండరాలను ఫ్రీ చేయడమనేది ముఖ్యం. దానికోసం రోజుకు 20 నిమిషాల సాధారణ నడక (Normal Walk) తో మొదలుపెట్టాలి. ఆ తర్వాత కాళ్లు, చేతులు, మెడను మెల్లగా అటు ఇటు తిప్పుతూ స్ట్రెచింగ్ చేయండి. దీనివల్ల కండరాలు బిగుసుకుపోవు. స్ట్రెచింగ్ అయ్యాక కాసేపు రన్నింగ్ చేయాలి. అయితే రన్నింగ్ చేసినపుడు వేగంగా పరిగెత్తకండి. జస్ట్ మీ శరీరం కదులుతోంది అని దానికి తెలియజేయడమే ఈ దశ లక్ష్యం.
5 రోజులు పూర్తయ్యాక ఇప్పుడు మీ శరీరం నడకకు అలవాటు పడి ఉంటుంది. అందుకే ఆరో రోజు నుంచి 10 వ వరోజు వరకూ కాస్త తీవ్రత పెంచాలి. 20 నిమిషాల బ్రిస్క్ వాకింగ్‌ను 30 నిమిషాలకు పెంచండి. ఈసారి కాస్త వేగంగా చెమట పట్టేలా నడవండి.
నడక తర్వాత ఐదు నిమిషాల పాటు గాలిలోకి చేతులు ఆడిస్తూ ‘షాడో బాక్సింగ్’ లాంటివి చేయండి. ఇంట్లోనే ఐదు నిమిషాలు అటు ఇటు అడుగులు వేస్తూ చేతులు పైకి కిందకు అనండి.తర్వాత మీకు నచ్చిన చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోండి.

ఇక 11 నుంచి 15 రోజుల పాటు వ్యాయామానికి ఒక సమయం అనుకోవడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. 30 నిమిషాల వేగవంతమైన ఫాస్ట్ నడకతో పాటు, ఇంట్లోనే కుర్చీ సాయంతో ‘హాఫ్ స్క్వాట్స్’ అంటే కుర్చీలో కూర్చుని లేస్తున్నట్లుగా చేయడం, లేదా గోడకు చేతులు ఆనించి చేసే ‘వాల్ పుష్-అప్స్’ ఒక్కోటి 10 సార్లు చేయండి. తర్వాత 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని యోగాలో ప్రాణాయామం చేయండి. చివరిలో కాసేపు శవాసనం వేసినట్లుగా 3 నిమిషాలు పడుకోండి.
వ్యాయామం(Exercise) చేసే ముందు, తర్వాత తగినంత నీరు తాగడం మర్చిపోవద్దు. అలాగే సౌకర్యంగా ఉండే కాటన్ దుస్తులు, సరైన షూస్ వేసుకోండి. మీకు ఇష్టమైన పాటలు వింటూ ఎక్సర్సైజ్ చేస్తే సమయం తెలియదు, ఉత్సాహంగా ఉంటుంది. ఒకరోజు కుదరకపోతే పర్వాలేదు కానీ ఆ మరుసటి రోజు మాత్రం వాయిదా వేయకుండా కచ్చితంగా చేయండి.



