Virat Kohli : కింగ్ రికార్డుల వేట..సచిన్‌ను దాటేసిన విరాట్
Virat Kohli : అత్యంత వేగంగా 28 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్ గా చరిత్ర విరాట్ సృష్టించాడు
Virat Kohli
అతను గ్రౌండ్ లో అడుగుపెట్టాడంటే రికార్డులు సలాం చేయాల్సిందే.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనబడాల్సిందే.. ఏ ఫార్మాట్ లోనైనా పరిస్థితులకు తగ్గట్టు ఆడడంలో సెపరేట్ స్టైల్… వన్డేల్లో అయితే ఎలా ఇన్నింగ్స్ నిర్మించాలో అతనికి తెలిసినట్టుగా మరొకరికి తెలీదేమో.. అందుకే ఇప్పటికీ మోడ్రన్ క్రికెట్ లో అతన్నే గ్రేటెస్ట్ గా చెబుతారు..
అతను ఎవరో ఈ పాటికే మీకందరికీ అర్థమైపోయి ఉంటుంది.. అవును విరాట్ కోహ్లీనే ( Virat Kohli )… రికార్డుల రారాజు… ఛేజింగ్ లో కింగ్… ఎప్పటికప్పుడు కొత్త ఆటగాళ్లు ఎంతమంది వచ్చినా కోహ్లీ స్థాయి ఆట కాదు కాదు కోహ్లీ లాంటి ఆట మాత్రం అతనికే సొంతం..
తాజాగావరల్డ్ క్రికెట్ లో సచిన్ రికార్డులను కొట్టే మొనగాడు విరాట్ కోహ్లీనే అని మరోసారి రుజువైంది. అత్యంత నిలకడగా ఆడుతూ మరోసారి తన క్లాసిక్ బ్యాటింగ్ తో అదరహో అనిపించిన కింగ్ వడోదరలో అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్ లో తన పరుగుల దాహం తీరలేదని నిరూపిస్తూ అత్యంత వేగంగా 28 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
తొలి వన్డేకు ముందు ఈ రికార్డుకు 25 పరుగుల దూరంలో ఉన్న కోహ్లీ కివీస్ స్పిన్నర్ ఆదిత్య అశోక్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి దానిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీకి 28 వేల పరుగులు చేసేందుకు 624 ఇన్నింగ్స్ లే సరిపోయాయి. అంతకుముందు సచిన్ ఈ మైలురాయిని 644 ఇన్నింగ్స్ లలో అందుకుంటే , లంక దిగ్గజం కుమార సంగక్కరాకు 666 ఇన్నింగ్స్ లు అవసరమయ్యాయి. దీంతో 28 వేల పరుగుల మైలురాయిని అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్ గా విరాట్ కోహ్లీ చరిత్రకెక్కాడు.

ఈ 28 వేల పరుగుల్లో కోహ్లీ 296 వన్డేలు , 210 టెస్ట్‌లు, 117 టీ20లు ఆడాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గానూ కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో సంగక్కరను కూడా కోహ్లీ దాటేశాడు. సంగక్కర 666 ఇన్నింగ్స్‌ల్లో 28016 పరుగులు చేయగా.. సచిన్ 34,357 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
కాగా 2024లో టీ ట్వంటీలకు, 2025లో టెస్టులకు వీడ్కోలు పలికిన కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు. సచిన్ 100 సెంచరీలు రికార్డు కూడా అతన్ని ఊరిస్తోంది. 2027 ప్రపంచకప్ వరకూ ఖచ్చితంగా ఆడనున్న విరాట్ కోహ్లీ సచిన్ సెంచరీల సెంచరీ రికార్డును కూడా అందుకుంటాడని పలువురు అంచనా వేస్తున్నారు.
Japanese:జపనీస్ సమురాయ్ వంశంలో పవన్ కళ్యాణ్‌కు చోటు.. ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఎలా అయ్యారు?



