West Indies : జేసన్ హోల్డర్ మ్యాజిక్.. సూపర్-8లో వెస్టిండీస్
West Indies : టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్ సూపర్ 8కు దూసుకెళ్లింది. నేపాల్ ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కరేబియన్ టీమ్ హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
West Indies
టీ20 ప్రపంచకప్ లో వెస్టిండీస్(West Indies) సూపర్ 8కు దూసుకెళ్లింది. నేపాల్ ను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసిన కరేబియన్ టీమ్ హ్యాట్రిక్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. బౌలింగ్ లో జేసన్ హోల్డర్ మ్యాజిక్ చేసి నేపాల్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేశాడు. బ్యాటింగ్ లో హోప్ , హెట్ మెయిర్ దుమ్మురేపడంతో విండీస్ సునాయాసంగా గెలిచింది. ఇంగ్లాండ్ జట్టుకు వణుకు పుట్టించిన నేపాల్ గత మ్యాచ్ లో తేలిపోయినట్టే.. విండీస్ పైనా నిరాశపరిచింది.
దూకుడుగా ఆడి మ్యాచ్ ను ఆసక్తికరంగా మారుస్తుందేమో అనుకుంటే పేలవ ప్రదర్శనతో ఉసూరుమనిపించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన నేపాల్ కేవలం 23 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కుశాల్(1), ఆసిఫ్(11), రోహిత్ (5), ఆరిఫ్ షేక్(2) పరుగులకే వెనుదిరిగారు. హోల్డర్ దెబ్బకు నేపాల్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారుయ ఈ టోర్నీలో నిలకడగా రాణిస్తున్న దీపేంద్రసింగ్ మాత్రమే హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు.
చివర్లో సోంపాల్ 15 బంతుల్లోనే 26 పరుగులు చేయడంతో నేపాల్ స్కోరు 130 దాటగలిగింది. చివర్లో సైతం విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఫలితంగా నేపాల్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో హోల్డర్ 27 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అకిల్ హొస్సేన్, మాథ్యూ హోర్డ్ , సమర్ జోసెఫ్, ఛేజ్ ఒక్కో వికెట్ తీశారు.

134 పరుగుల ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన వెస్టిండీస్(West Indies) కు ఓపెనర్లు బ్రాండన్ కింగ్, షై హోప్ మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 5.3 ఓవర్లలో 43 పరుగులు జోడించారు. కింగ్ 22 రన్స్ కు ఔటైనప్పటకీ.. షై హోప్ , హెట్ మెయిన్ మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ రెండో వికెట్ కు 91 పరుగులు జోడించారు. దీంతో విండీస్ కేవలం 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
హోప్ కేవలం 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 నాటౌట్ , హెట్ మెయిన్ 32 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 నాటౌట్ రాణించారు. ఈ విజయంతో ఆరు పాయింట్లు సాధించిన విండీస్ సూపర్ 8 బెర్త్ ఖరారు చేసుకుంది. అటు మూడు పరాజయాలతో నేపాల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.



