Mahalaxmi scheme:మహాలక్ష్మి పథకానికి రెండేళ్లు పూర్తి.. ఇకపై ఆ బస్సుల్లో కూడా ఫ్రీ జర్నీ
Mahalaxmi scheme: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించి సరిగ్గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.
Mahalaxmi scheme
తెలంగాణలో మహిళల ఆర్థిక సాధికారతకు , రవాణా సౌలభ్యానికి తోడ్పడుతున్న ‘మహాలక్ష్మి’ పథకం(Mahalaxmi scheme) మరో కీలక అప్‌డేట్‌ను అందుకుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించి సరిగ్గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.
ప్రస్తుతం ఆర్టీసీలోని కొన్ని బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంది. అయితే, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన ప్రకారం, ఇకపై భవిష్యత్తులో తీసుకురానున్న అన్ని ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ నిర్ణయం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, మహిళలకు ప్రయాణ ఎంపికలను పెంచనుంది.

ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డు చూపించి ఉచిత బస్సు ప్రయాణం పొందుతున్నారు. అయితే, ఆధార్ కార్డు చెకింగ్ విషయంలో బస్సుల్లో మహిళలు ,ఆర్టీసీ సిబ్బంది మధ్య కొన్ని సందర్భాలలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి, మరింత పారదర్శకత కోసం, ప్రభుత్వం త్వరలో మహిళలకు ప్రత్యేక స్మార్ట్ కార్డులను అందించేందుకు సిద్ధమవుతోంది.
ఈ స్మార్ట్ కార్డుల ద్వారా ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా మహిళలు తమ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందొచ్చు.త్వరలోనే ఈ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
మహాలక్ష్మి పథకం(Mahalaxmi scheme) 2023 డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించారు. ఈ రెండేళ్ల కాలంలో ఈ పథకం సాధించిన పురోగతి అద్భుతమైనది.ఇప్పటివరకు సుమారు 251 కోట్ల మంది మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ ప్రయాణ సౌకర్యం కోసం ప్రభుత్వం రూ. 8,459 కోట్లు ఖర్చు చేసింది.
ఈ పథకం వల్ల ఆర్టీసీలో ప్రయాణించే మహిళల సంఖ్య గణనీయంగా పెరగడమే కాకుండా, దేవాలయాల సందర్శన వంటి సామాజిక కార్యకలాపాలు కూడా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.



