FASTag :ఆగస్టు 15 నుంచి హైదరాబాద్ ORRపై ఫాస్టాగ్ వార్షిక పాస్ వర్తించదా?
FASTag : ఈ కొత్త పాస్ ప్రకారం, ప్రైవేట్ కార్లు, జీపులు , వాన్‌లు ఏడాదికి రూ. 3,000 చెల్లించి 200 టోల్ ట్రిప్‌లు చేయవచ్చు.

FASTag
ఆగస్టు 15 నుంచి అమలులోకి రానున్న జాతీయ వార్షిక ఫాస్టాగ్ పాస్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR)కు వర్తిస్తుందా లేదా అనే విషయంపై చాలామంది వాహనదారుల్లో సందేహాలు నెలకొన్నాయి. ఈ కొత్త పాస్ ప్రకారం, ప్రైవేట్ కార్లు, జీపులు , వాన్‌లు ఏడాదికి రూ. 3,000 చెల్లించి 200 టోల్ ట్రిప్(FASTag)లు చేయవచ్చు. అయితే, ఈ పాస్ కేవలం భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) పరిధిలోని జాతీయ రహదారులపై మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) విషయానికి వస్తే, ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. ఇది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) లేదా మినిస్ట్రీ ఆఫ్ రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్ అండ్ హైవేస్ (MoRTH) పరిధిలోకి రాదు. ప్రస్తుతం, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో, ప్రైవేట్ భాగస్వామి అయిన IRB గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌వే ఈ ORR నిర్వహణను చూసుకుంటోంది. దీనివల్ల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక ఫాస్టాగ్ (FASTag )పాస్ ORRపై వర్తించదు.

అందువల్ల, ORRపై ప్రయాణించే వాహనదారులు తప్పనిసరిగా టోల్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు తరచుగా ORRపై ప్రయాణిస్తున్నట్లయితే, HMDA అందించే ప్రత్యేక నెలవారీ పాస్‌ను తీసుకోవడం మంచిది. ఈ పాస్‌లు జాతీయ ఫాస్టాగ్ వార్షిక పాస్‌తో సంబంధం లేకుండా పనిచేస్తాయి. మీ కారుకు ప్రతి కిలోమీటర్‌కు రూ. 2.44 చొప్పున ఛార్జ్ చేస్తారు. ORR టోల్ పాస్‌ను పొందడానికి మీరు https://orrhyderabad.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో టోల్ ఛార్జీల వివరాలు, ఫిర్యాదుల నమోదుతో పాటు ప్రయాణ రికార్డులను కూడా పొందవచ్చు.
మొత్తానికి, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై ఫాస్టాగ్ (FASTag)సౌకర్యం ఉన్నా కూడా, అది నేషనల్ హైవే కాకపోవడంతో, ఆగస్టు 15 నుంచి అమలులోకి రానున్న కేంద్ర ప్రభుత్వ వార్షిక ఫాస్టాగ్ పాస్ దీనికి వర్తించదు. ORRపై ప్రయాణాలకు సాధారణ టోల్ చెల్లింపులు లేదా HMDA నెలవారీ పాస్‌లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది.
One Comment