Just Nationaljust AnalysisLatest News

POK : పాక్ పాలకుల గుండెల్లో రైళ్లు .. పీఓకే ప్రజా విప్లవం ఎటు దారి తీస్తుంది?

POK : పాక్ సైన్యం ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్నా కూడా అక్కడి ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంతేకాదు జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) పాకిస్తాన్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం కూడా జారీ చేసింది.

POK

పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో తాజాగా నడుస్తున్న ప్రజా ఉద్యమం.. ఇస్లామాబాద్ పాలకుల నిద్రను చెడగొడుతోంది. ముప్పై రోజులు దాటినా అక్కడ ప్రజా నిరసనలు ఏమాత్రం తగ్గకపోగా, రోజురోజుకూ మరింత ఉగ్రరూపం దాలుస్తున్నాయి.

పాక్ సైన్యం ఉక్కుపాదంతో అణచివేయాలని చూస్తున్నా కూడా అక్కడి ప్రజలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అంతేకాదు జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) పాకిస్తాన్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం కూడా జారీ చేసింది. తమ 38 డిమాండ్లను నెరవేర్చకపోతే ఆఖరి పోరాటానికి సిద్ధమని సీరియస్‌గా హెచ్చరించింది.

నిజానికి జూలై 27న జరగనున్న స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో 12 స్థానాలను శరణార్థులకు కేటాయించడమే ఈ వివాదానికి ఆజ్యం పోసినట్లు అయింది. పీఓకే(POK)లోని 33 లక్షల ఓటర్లకు 33 సీట్లు ఉంటే, పాకిస్థాన్‌లోని 4.36 లక్షల శరణార్థి ఓటర్ల కోసమే 12 సీట్లు కేటాయించడంపై అక్కడి స్థానికులు మండిపడ్డారు.

ఎందుకంటే దీనివల్ల పీఓకేపై ఇస్లామాబాద్ పెత్తనం ఎక్కువ అవుతుందని జేఏఏసీ వాదిస్తోంది. దీనికి తోడు ఈ రిజర్వ్ సీట్లను రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని సుప్రంకోర్టు తీర్పు ఇవ్వడంతో నిరసనలు మరింతగా పెరిగాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు పోవడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

సీట్ల వివాదంతో పాటు దశాబ్దాలుగా ఉన్న ఆర్థిక నిర్లక్ష్యం కూడా ఈ ఉద్యమానికి అసలు కారణం. పీఓకేలో అడవులు, ఖనిజాలు, జలవనరులు పుష్కలంగా ఉన్న సంగతి తెలిసిందే. పాకిస్థాన్ సాగునీటిలో 70 శాతం, దేశవ్యాప్త విద్యుత్‌లో 15 శాతం కూడా ఇక్కడి నుంచే లభిస్తోంది.

ఇంత సంపద ఉన్నా ఆదాయమంతా ఇస్లామాబాద్‌కు తరలిపోతోంది తప్ప అక్కడి స్థానికులకు దక్కడం లేదు. అందుకే హైడ్రో పవర్ ప్రాజెక్టులపై పునఃసమీక్ష జరపాలని, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, నిత్యావసరాలపై సబ్సిడీలు ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

కాగితాల మీద పీఓకే(POK)ను ఆజాద్ కశ్మీర్‌గా పిలుస్తున్నారు తప్ప అక్కడ ఎలాంటి స్వయంప్రతిపత్తి లేదు. అసలు పెత్తనమంతా పాకిస్తాన్ ప్రధాని నేతృత్వంలోని కశ్మీర్ కౌన్సిల్‌దే సాగుతుంది. ఇక్కడి రాజ్యాంగం ప్రకారం పాకిస్తాన్‌లో విలీనాన్ని వ్యతిరేకించే ఏ వ్యక్తి అయినా సరే అక్కడి ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. ఇస్లామాబాద్‌కు మద్దతుగా బాండ్ పేపర్‌పైన సంతకం పెడితేనే వారి నామినేషన్ చెల్లుతుంది.

ఇలాంటి రాజకీయ వివక్షకు తోడు ఆహార కొరత ప్రజలను ఎక్కువ వేధిస్తోంది. జనాభాలో 66 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడినా సరే, 57 శాతం మంది మాత్రం ఆహార లేమితో అల్లాడుతున్నారు. దాదాపు 29 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతుండగా, పిల్లల్లో ఎదుగుదల లోపం, ప్రసూతి మరణాలు ఎక్కువగా ఉండటం ఆందోళనను కలిగిస్తున్నాయి.

అక్కడ భద్రతా పరిస్థితులు అయితే మరీ దారుణంగా ఉన్నాయి. అణచివేత చర్యల్లో భాగంగా సామూహిక అరెస్టులు చేయడమే కాకుండా.. 100 మందికి పైగా ఉద్యమకారులను చంపేశారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) వంటి టెర్రరిస్ట్‌ సంస్థల పునరుజ్జీవనంతో గతేడాది వెయ్యికి పైగా ఘటనలు జరిగి 1,139 మంది ప్రాణాలు కోల్పోవడం అక్కడి పరిస్థితి ఎంత భయానకంగా ఉందో వివరిస్తుంది. దశాబ్ద కాలంలో ఈ రేంజ్‌లో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి.

POK
POK

కాగా ఈ విషయంలో భారతదేశపు వైఖరి మాత్రం ఎప్పుడూ స్పష్టంగానే ఉంది. 1947 అక్టోబరు 26న కశ్మీర్ రాజు హరిసింగ్ చట్టబద్ధంగా విలీన ఒప్పందంపై సైన్ చేయడంతో జమ్మూ కశ్మీర్ మొత్తం భారతదేశంలో అంతర్భాగమైంది. కానీ పాకిస్థాన్ సైన్యం దొంగతనంగా కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది.

అలా పాక్ అధీనంలో ఉన్న కశ్మీర్ భూభాగాలన్నీ చట్టబద్ధంగా భారతదేశానికి చెందినవేనని, వాటిని పాకిస్తాన్ తక్షణమే ఖాళీ చేయాలని 1994 ఫిబ్రవరి 22న భారత పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేసింది. అయితే ఇప్పుడు జేఏఏసీ తన ఆఖరి పోరాటానికి సిద్ధమవడంతో, పీఓకే(POK)లో రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో అనే ఆందోళన వ్యక్తమవుతుంది.

Sharad Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం..షిండేతో శరద్ పవార్ భేటీ దేనికి సంకేతం?

Related Articles

Back to top button