Shiv Sena : ఆపరేషన్ టైగర్‌తో షాక్.. ఉద్ధవ్ ఠాక్రే ఏం చేయబోతున్నారు ?
Shiv Sena : కొన్ని రోజులుగా యూబీటీ నుంచి పార్టీ ఫిరాయింపులు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఏక్ నాథ్ షిండే వర్గం చేపట్టిన ఆపరేషన్ టైగర్ దీనికి కారణం.
Shiv Sena
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శివసేన యూబీటీకి ఆరుగురు ఎంపీలు భారి షాకిచ్చారు. ఆ పార్టీకి గుడ్ బై చెప్పి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన పార్టీలో చేరారు. నిజానికి కొన్ని రోజులుగా యూబీటీ నుంచి పార్టీ ఫిరాయింపులు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఏక్ నాథ్ షిండే వర్గం చేపట్టిన ఆపరేషన్ టైగర్ దీనికి కారణం.
పది రోజులుగా దీనిపై ప్రచారం జరుగుతుండగా మధ్యలో పలుసార్లు శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే తన పార్టీ ఎంపీలతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. దీనికి కొంతమంది డుమ్మా కొట్టినప్పుడే వారంతా షిండే వర్గంతో మంతనాలు జరుపుతున్నారని ఖాయమైంది. వ్యక్తిగత కారణాలతో కొందరు హాజరు కాలేదని ఉద్ధవ్ చెప్పినా తెరవెనుక ఆపరేషన్ టైగర్ విజయవంతమైంది.
దీంతో ఆరుగురు ఎంపీలు సంజయ్ దేశ్‌ముఖ్, సంజయ్ జాదవ్, సంజయ్ దిన పాటిల్, నగేశ్ పాటిల్, ఓం ప్రకాశ్ రాజే నింబాల్కర్, భావుసాహెబ్ వాక్చౌరే ఏక్ నాథ్ షిండే శివసేనలో చేరిపోయారు. వీరు పార్టీలో చేరిన క్షణంలోనే మీడియా సమావేశం నిర్వహించిన ఏక్ నాథ్ షిండే తాము సిక్సర్ కొట్టామంటూ ప్రకటించారు. ఆపరేషన్ టైగర్ విజయవంతమైందంటూ వ్యాఖ్యానించారు.
9 మందిలో ఆరుగురు ఉద్ధవ్ ఠాక్రేకు షాకివ్వగా ఇక ముగ్గురే మిగిలారు. మరోవైపు షిండే శివసేన పార్టీ ఎంపీల బలం 13కు చేరినట్టయింది. ఒక విధంగా ఉద్ధవ్ ఠాక్రేకు భారీ ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే పార్టీ పేరు, గుర్తు కూడా కోల్పోయిన ఉధ్ధవ్ మళ్లీ ఏవిధంగా కోలుకుంటారనేది చూడాలి.
పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించడం ఇప్పుడు ఉద్ధవ్ ముందున్న పెద్ద సవాల్. ఈ సమయంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు, మహారాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను బలోపేతం చేయడానికి రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సిద్ధమవుతున్నారు. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, తిరుగుబాట్ల వల్ల.. కార్యకర్తలతో నేరుగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.

పార్టీ కేడర్‌ను ఏకం చేయడానికి జూన్ 27 నుంచి మహారాష్ట్రలో ప్రత్యేక పర్యటనలను ప్రారంభించనున్నారు. ఇప్పటికే తన పార్టీ శ్రేణులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికైనా తన నాయకత్వం నచ్చకపోతే తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ భావోద్వేగంతో ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాల విషయంలో అస్సలు రాజీపడే ప్రసక్తే లేదన్నారు. శివసేన(shiv Sena) యూబీటీ కనుమరుగవుతుందని చాలా మంది అనుకుంటున్నారని, అది అసాధ్యమన్నారు. తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందంటూ పార్టీ శ్రేణులకు సందేశమిచ్చారు.
AP Cabinet : 80కి పైగా అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంపు





