Soul After Death : మనిషి చనిపోయాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మరణానికి ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయి?
Soul After Death : చుట్టూ ఎవరూ లేకపోయినా కూడా ఎవరివో మాటలు ముఖ్యంగా చనిపోయిన బంధువుల గొంతులు వినిపించడం, వారు పిలుస్తున్నట్లు భ్రమ కలగడం వంటివి జరుగుతుంటాయి.
Soul After Death
ఈ అనంత విశ్వంలో పుట్టిన ప్రతి జీవికి ఎప్పటికైనా మరణం తప్పదు. అయితే మనిషి చనిపోయిన తర్వాత భౌతిక శరీరంలోని ఆత్మ ఎక్కడికి వెళుతుందనే ప్రశ్న చాలామందికి వస్తుంటుంది. చనిపోయే ముందు మనిషికి ఏమైనా సంకేతాలు వినిపిస్తున్నాయా అనే అనుమానం తలెత్తుతుంటుంది. ఇలాంటి వాటి ఎన్నిటికో సనాతన ధర్మంలోని 18 మహాపురాణాలలో ఒకటి అయిన గరుడ పురాణంలో వివరణ ఉంది. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడికి ఈ మరణ రహస్యాలను, ఆత్మ ప్రయాణాన్ని, కర్మ సిద్ధాంతాన్ని చాలా స్పష్టంగా వివరించారు.
గరుడ పురాణం ప్రకారం చూస్తే మరణమనేది ఒక్కసారిగా వచ్చేది కాదు. అది ఒక ప్రక్రియలా సాగుతుంది. అది ఎలా అంటే.. ప్రాణం పోవడానికి కొన్ని గంటల ముందు లేదంటే కొన్ని రోజుల ముందు నుంచి కూడా మనిషికి తన సొంత నీడ తనకు కనిపించదు. ఒకవేళ కనిపించినా అది తల లేని నీడలా కనిపిస్తుంది. అద్దంలో చూసుకుంటే తన ప్రతిబింబం తనకే వికృతంగా తోస్తుంది.
అలాగే సూర్యచంద్రులు రెండుగా కనిపిస్తుంటాయి. చుట్టూ ఎవరూ లేకపోయినా కూడా ఎవరివో మాటలు ముఖ్యంగా చనిపోయిన బంధువుల గొంతులు వినిపించడం, వారు పిలుస్తున్నట్లు భ్రమ కలగడం వంటివి జరుగుతుంటాయి. అందుకే తాము చనిపోయే ముందు అదిగో నన్ను రమ్మంటున్నారంటూ మన అమ్మమ్మలు, తాతయ్యలు తమ ఆప్తుల పేర్లు చెప్పడం మనలో చాలామందికి అనుభవమే.
కాకపోతే చనిపోయే ముందు వారి అనుభవాలు వేరువేరుగా ఉంటాయి. పాపాలు చేసిన వారి వద్దకు అయితే భయంకరమైన రూపాలతో యమదూతలు వచ్చి వారి ప్రాణాన్ని శరీరంలోని దిగువ ద్వారాల ద్వారా బలవంతంగా లాక్కుంటారు. అదే ధర్మంగా జీవించినవారిని తీసుకెళ్లడానికి మాత్రం స్వయంగా విష్ణుదూతలే వచ్చి.. ఒక తల్లి పసిపాపను నిద్రలేపినంత సున్నితంగా తలలో ఉన్న బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణాన్ని శాంతియుతంగా తీసుకుని వెళతారు.
శరీరాన్ని వదిలిన ఆత్మను వెంటనే ముందుగా యమపురికి తీసుకెళ్లి, చిత్రగుప్తుడి అనుమతితో ఆ ఆత్మను మళ్లీ భూలోకానికి పంపుతారు. అలా మళ్లీ వారికి దశదినకర్మ చేసేవరకూ అంటే 10 నుంచి 13 రోజుల పాటు ఆత్మ ..ప్రేత శరీరంతో తన ఇంటి చుట్టూ గాలి రూపంలో తిరుగుతూనే ఉంటుంది. కుటుంబ సభ్యులు పెట్టే పిండ ప్రదానాలు, నీళ్లు ఆత్మకు ఆ కొద్ది రోజులు ఆహారంగా మారి సూక్ష్మ శరీరాన్ని ఏర్పరుస్తాయి. 13వ రోజున జరిగే వైకుంఠ సమారాధనతో ఆత్మ.. ప్రేత స్థితి నుంచి విముక్తి పొంది భూలోకం నుంచి 86 వేల యోజనాల దూరంలో ఉన్న యమలోకానికి ప్రయాణం అవుతుంది.

అయితే యమలోకానికి వెళ్లే మార్గంలో 100 యోజనాల వెడల్పుతో చీము, రక్తం,ఎముకలతో ప్రవహించే భయంకరమైన వైతరిణి నది వారికి అడ్డంగా ఉంటుంది. పాపాత్ములు అందులో పడి నరకయాతన అనుభవిస్తారని గరుడ పురాణం చెబుతుంది. కానీ జీవితంలో పుణ్యాలు చేసిన వారికి, అలాగే గోదానం చేసిన పుణ్యాత్ములకు మాత్రం ఒక గోవు ప్రత్యక్షమై తన తోకతో ఆ ఆత్మను సునాయాసంగా వైతరిణి నదిని దాటిస్తుంది.
ఆ తర్వాత చిత్రగుప్తుడు రాసే అగ్రసంధాని చిట్టా ఆధారంగా వారు చేసిన కర్మఫలాల ప్రకారం యమధర్మరాజు 28 రకాల నరకాల్లో శిక్షలు ఖరారు చేస్తాడు. అవి పూర్తయ్యాక తల్లి గర్భంలోకి ప్రవేశించిన ఆత్మ.. పూర్వజన్మ కర్మల ఆధారంగా మరో కొత్త జన్మను ఎత్తుతుందని గరుడ పురాణం వివరిస్తుంది.
Japanese Ma Theory : ఎప్పుడూ కలిసి ఉండటమే కాదు..బంధం గట్టిపడాలంటే చిన్న దూరం కూడా అవసరమేనట..





