Just SpiritualLatest News

Akshaya Tritiya:అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలా? అమ్మవారికి ఇష్టమైన పనులు ఇవే..

Akshaya Tritiya: వెండి లేదా రాగి చెంబులో నీళ్లు పోసి, అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి దానిపై 5 మామిడి ఆకులు పెట్టి, పైన పీచు ఉన్న కొబ్బరికాయను ఉంచి కలశాన్ని ఏర్పాటు చేయాలి.

Akshaya Tritiya

ఏడాదిలో వచ్చే అత్యంత పవిత్రమైన రోజుల్లో అక్షయ తృతీయ ఒకటిగా హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం చెబుతారు. అక్షయం అంటే నాశనం లేనిదని అర్థం. ఈ రోజు ఏ పని ప్రారంభించినా, ఏ వస్తువు కొన్నా అది వృద్ధి చెందుతుందని పండితులు చెబుతుంటారు.

ఈ ఏడాది ఏప్రిల్ 19న వచ్చే అక్షయ తృతీయ(Akshaya Tritiya) సందర్భాన్ని పురస్కరించుకుని.. లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే మాత్రం ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుందని పండితులు చెబుతారు. సిరిసంపదలకు అధిదేవత అయిన మహాలక్ష్మిని ఈ పర్వదినాన ఎలా పూజించాలి, ఏ నియమాలు పాటించాలి అనేవి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.

అక్షయ తృతీయ(Akshaya Tritiya) రోజు సూర్యోదయానికి ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. తర్వాత ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. వీలయితే గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో అలంకరించుకుంటే మంచిదట.

మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటూ, లక్ష్మీ నామస్మరణ చేస్తూ గడపితే చాలా మంచిదని పండితులు అంటారు. ఉదయం ఏడు గంటల లోపే లక్ష్మీ దేవి పూజ పూర్తి చేసుకుని, హారతి తీసుకోవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గి సానుకూల శక్తి పెరుగుతుందట.

అలాగే లక్ష్మీదేవి పూజలో కలశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఒక వెండి లేదా రాగి చెంబులో నీళ్లు పోసి, అందులో కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి దానిపై 5 మామిడి ఆకులు పెట్టి, పైన పీచు ఉన్న కొబ్బరికాయను ఉంచి కలశాన్ని ఏర్పాటు చేయాలి.

అమ్మవారికి ఇష్టమైన ఆవు నెయ్యితో దీపారాధన చేయాలని పండితులు చెబుతున్నారు. అయితే ఈ రోజు తప్పకుండా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి కానీ కనకధారా స్తోత్రాన్ని కానీ పఠించడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందట. పూజ కోసం తామర పూలు కానీ గులాబీలను కానీ వాడటం మంచిది.

Akshaya Tritiya
Akshaya Tritiya

శ్రీ మహాలక్ష్మికి పాయసం అంటే అత్యంత ప్రీతి కాబట్టి.. అక్షయ తృతీయ రోజు అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. వీటితో పాటు తాంబూలం, పండ్లు, గాజులు, చీర వంటివి సమర్పిస్తే ఇంకా మంచిది. పూజ ముగిసిన తర్వాత పేదవాళ్లకు అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు చేసే ఎలాంటి దానధర్మాలు అయినా సరే అవి అక్షయమై, తిరిగి మనకే సంతోషాన్ని కలిగిస్తాయని పండితుల మాట.

అక్షయ తృతీయకున్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఈ రోజు ఎటువంటి ముహూర్తాలు చూడాల్సిన అవసరం లేకుండానే ఎలాంటి కొత్త పనినైనా ప్రారంభించవచ్చట. అందుకే వ్యాపారాలు మొదలు పెట్టేవారు, గృహప్రవేశం చేసేవారు , కొత్త వాహనాలు కొనేవారు ఇలా ఎవరైనా సరే అక్షయ తృతీయ(Akshaya Tritiya) రోజును మంచి ముహూర్తంగా ఎంచుకుంటారు.

అలాగే బంగారం కొనడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువై ఉంటుందని చాలామంది నమ్ముతారు. బంగారం కొనలేని వాళ్లు ఈ రోజు ఉప్పు, మట్టి పాత్రలు, చీపురు ఇలా వేటిని కొన్నా కూడా శుభమేనని పండితులు చెబుతున్నారు.

Bones:కాల్షియం టాబ్లెట్లు తీసుకున్నా ఎముకలు ఎందుకు విరుగుతున్నాయి? వైద్యులు చెబుతున్న షాకింగ్ నిజాలు ఇవే!

Related Articles

Back to top button