Just SpiritualLatest News

Thirunama Seva:తిరు నామంతో సాక్షాత్తు శ్రీనివాసుడి దర్శనం.. తిరుమలలో పునః ప్రారంభమైన తిరునామ సేవ

Thirunama Seva: తిరుమల యాత్రలో శ్రీవారి భక్తులు మరో ముఖ్యమైన ఆచారం అయిన తిరునామ ధారణను కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో పాటిస్తారు.

Thirunama Seva

తిరుమల పుణ్యక్షేత్రం పేరు చెప్పగానే భక్తులకు ముందుగా ఆ వేంకటేశ్వరస్వామి దివ్య మంగళ స్వరూపం.. అలాగే ఆపై నోరూరించే లడ్డూ ప్రసాదం స్మరణకు వస్తాయి. అయితే అంతే ముఖ్యంగా తిరుమల యాత్రలో శ్రీవారి భక్తులు మరో ముఖ్యమైన ఆచారం అయిన తిరునామ ధారణను(Thirunama Seva) కూడా అత్యంత భక్తిశ్రద్ధలతో పాటిస్తారు.

గతంలో కొండపై తిరునామాలు దిద్దించుకోవడానికి భక్తులు కొంత సొమ్ము చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల సౌకర్యం కోసం ఈ సేవను పూర్తి ఉచితంగా పునఃప్రారంభించింది.

గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఈ తిరునామ ధారణ(Thirunama Seva) ఆధ్యాత్మిక సేవను ఇప్పుడు శ్రీవారి సేవకుల ద్వారా ప్రతి భక్తుడి చెంతకు మరోసారి చేరువ చేస్తున్నారు. తిరుమల కొండపైకి వచ్చే భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

టీటీడీ ప్రత్యేకంగా ఈ ఉచిత తిరునామధారణ సేవ(Thirunama Seva) కోసం శ్రీవారి సేవకులను నియమించింది. ప్రతిరోజూ రెండు షిఫ్టులలో సుమారు 168 మంది సేవకులు ఈ సేవలో పాల్గొని భక్తులకు నామాలు దిద్దుతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, గొల్ల మండపం, కల్యాణకట్ట, వరాహస్వామి ఆలయం, బేడి ఆంజనేయస్వామి ఆలయం, అన్నప్రసాద కేంద్రం వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ సేవలు నిత్యం అందుబాటులో ఉంటున్నాయి.

ప్రతి శుక్రవారం శ్రీవారి మూలవిరాట్టుకు అభిషేకం తర్వాత అలంకరించే తిరుమణికాపు తరహాలోనే శ్రీవారి భక్తులకు కూడా ఎర్ర సింధూరం, నామకోపులతో నామాన్ని అలంకరిస్తారు. ఇది భక్తులలో ఒక రకమైన సాత్విక భావనను, గోవిందుడికి చేరువయ్యామనే తృప్తిని కలిగిస్తోంది.

హిందూ ధర్మంలో ముఖ్యంగా తిరుమల భక్తులకు అలంకరించే తిరునామధారణకు అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. నుదుటిపై ఉండే ఆగ్నేయ చక్రంపై తిలకాన్ని ధరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, దుష్టశక్తుల ప్రభావం మనపై పడదని పురాణాలు చెబుతున్నాయి. తిరునామంలో ఉండే మూడు నిలువు గీతలు విష్ణుపాదాన్ని సూచిస్తాయి.

మధ్యలో ఉండే ఎర్రటి గీత (శ్రీచూర్ణం) లక్ష్మీదేవికి చిహ్నం కాగా, రెండు వైపులా ఉండే తెల్లటి గీతలు జ్ఞానానికి , భక్తికి సంకేతాలుగా చెబుతారు. స్వామివారి నామాన్ని ధరించడం ద్వారా మనలోని అహంకారం నశించి, వినయ విధేయతలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఏ వయసు వారైనా సరే, తమ నుదుట పైన నామం లేకుండా స్వామిని దర్శించుకోవడాన్ని అసంపూర్ణంగా భావిస్తారు.

Thirunama Seva
Thirunama Seva

ఈ తిరునామధారణ సంప్రదాయం వెనుక ఉన్న చరిత్రను పరిశీలిస్తే, రామానుజాచార్యుల కాలం నుంచి విశిష్టాద్వైత సిద్ధాంతంలో దీనికి ప్రాధాన్యత పెరిగినట్లు తెలుస్తోంది. భగవంతుడి పాదాలకు భక్తులు దాసులనే భావనను ఈ నామం ప్రతిబింబిస్తుంది. శరీరాన్ని ఆలయంగా భావించి, ఆ దేవాలయానికి ద్వారాల వంటి ద్వాదశ పుండ్రాలను (పన్నెండు నామాలు) ధరించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. దీనిలో చాలా ముఖ్యమయినది నుదుటిపై ధరించే ఊర్ధ్వపుండ్రం.

కాగా శ్రీవారి సేవకులు కూడా భక్తులకు ఇలా సేవలందించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు. భక్తులు కూడా ఎటువంటి డబ్బులు చెల్లించకుండా, ఆధ్యాత్మిక పరిమళం వెదజల్లేలా నామాలను ధరించి శ్రీనివాసుడి దర్శనానికి వెళ్తుండటం ఇప్పుడు తిరుమలలో కనిపిస్తున్న ఒక మనోహరమైన దృశ్యంగా చెప్పుకోవచ్చు.

Mango: మీరు మామిడి పండ్ల ప్రియులా? అయితే మ్యాంగోను తినడానికి కూడా ఓ లెక్క ఉందని తెలుసుకోండి..

Related Articles

Back to top button