Just SportsLatest News

IND vs SL : భారత్,లంక సిరీస్‌కు ఫ్రీ ఎంట్రీ..ఇకనైనా టెస్టులకు ఆదరణ పెరుగుతుందా ?

IND vs SL : తాజాగా భారత్, శ్రీలంక మధ్య వచ్చే వారం నుంచి జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌పై ఆసక్తి ఉన్నా టికెట్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు.

IND vs SL

టీ20 ఫార్మాట్‌లు వేగంగా విస్తరించిన తర్వాత టెస్టులు, వన్డేలకు ఆదరణ బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా రెడ్ బాల్ ఫార్మాట్‌ను చూడటానికి ఎవ్వరూ ఆసక్తి చూపించడం లేదు. రెండు అత్యుత్తమ జట్లు ఆడితే తప్ప టెస్ట్ మ్యాచ్‌లకు ఆదరణ అంతంత మాత్రమే.

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాల్లో తప్పిస్తే మిగిలిన దేశాల్లో టెస్టు మ్యాచ్‌లు వీక్షించడానికి అభిమానులు స్టేడియాలకు రావడం లేదు. టికెట్లు తక్కువ ధరకే పెట్టినా కూడా స్టేడియాలు పావు వంతు కూడా నిండని పరిస్థితి. ఒకవేళ ఫలితం వచ్చే అవకాశమున్న రోజు కాస్తో కూస్తో అభిమానులు కనిపిస్తున్నారు.

దీంతో ఐసీసీ, కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు అభిమానులను స్టేడియాలకు రప్పించడంపై దృష్టి పెడుతున్నాయి. తాజాగా భారత్, శ్రీలంక(IND vs SL) మధ్య వచ్చే వారం నుంచి జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌పై ఆసక్తి ఉన్నా టికెట్ల అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

ఈ సిరీస్‌కు అభిమానులను ఉచితంగా అనుమతించాలని నిర్ణయం తీసుకుంటూ ప్రకటన విడుదల చేసింది. రెండు టెస్టులను అభిమానులు స్టేడియంలో ఉచితంగా వీక్షించవచ్చని పేర్కొంది. టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ పెంచే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

ఫ్రీ ఎంట్రీ కల్పించడంతో రద్దీ పెరిగే అవకాశముంది. దీంతో లంక క్రికెట్ బోర్డు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంది. అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్టేడియంలోకి ఫ్రీ ఎంట్రీని కొన్ని గేట్లకే పరిమితం చేశారు. గాలె స్టేడియంలో గేట్ నెంబర్ 4 ద్వారా, కొలంబో స్టేడియంలో గేట్లు నెంబర్లు 3, 4, 5, 7 ద్వారా ప్రేక్షకులను అనుమతిస్తారు.

కాగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో భాగంగా ఈ సిరీస్ జరుగుతోంది. డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియాకు ఈ రెండు టెస్టులు కీలకంగా మారాయి. లంక స్పిన్ వ్యూహాలను తట్టుకుని మన బ్యాటర్లు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

IND vs SL
IND vs SL

ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ఐదో స్థానంలోనూ, శ్రీలంక ఆరో స్థానంలోనూ ఉన్నాయి. కాగా ఈ రెండు(IND vs SL )టెస్టుల సిరీస్‌కు అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని లంక బోర్జు పిలుపునిచ్చింది.  ఆగస్టు 15 నుంచి 19 వరకూ జరిగే తొలి టెస్టుకు గాలె అంతర్జాతీయ స్టేడియం, ఆగస్టు 23 నుంచి 27 వరకు జరిగే రెండో టెస్టుకు కొలంబో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌ ఆతిథ్యమివ్వనున్నాయి.

అయితే అభిమానుల విషయంలో లంక క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అదే సమయంలో పిచ్‌ల విషయంలోనూ కీలక సూచనలు చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ పెరగాలంటే ఫలితాలు వచ్చేలా పిచ్ లు రూపొందించాలని అంటున్నారు.

బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా అనుకూలించే పిచ్‌లు ఉండాలని సూచిస్తున్నారు. అలాగే టెస్ట్ క్రికెటర్లకు మిగతా ఫార్మాట్ల కంటే ఎక్కువ మ్యాచ్ ఫీజులు, రివార్డులు ఇస్తే ఆటగాళ్లలోనూ ఆసక్తి పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

Sitting On Floor : నేలపై కూర్చొని తింటే బాడీలో జరిగే మ్యాజిక్ తెలుసా ? ఈ అలవాటుతో ఇక డాక్టర్‌తో పనే ఉండదు..

Related Articles

Back to top button