HealthJust LifestyleLatest News

Personality Disorders: పర్సనాలిటీ డిజార్డర్స్..మీ ప్రవర్తన వెనుక ఉన్న నిజం

Personality Disorders: పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఆ లక్షణాలు అతిగా మారి, ఒక వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడంలోనూ, ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలు పెట్టుకోవడంలోనూ తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి.

Personality Disorders

మీకు మీ ఆలోచనలపై నియంత్రణ లేకపోతే ఎలా ఉంటుంది? ప్రతీ అనుమానం నిజమే అనిపిస్తే, ప్రతీ చిన్న మాట మనసును బాధపెడితే ఎలా ఉంటుంది? మనసులోని ఈ యుద్ధం మన జీవితాన్ని, సంబంధాలను దెబ్బతీస్తుంది. ఆ యుద్ధమే పర్సనాలిటీ డిజార్డర్. అయితే దీనికి భయపడాల్సిన పని లేదని.. ఈ లోతైన మానసిక సమస్య నుంచి ఈజీగానే బయటపడచ్చొంటున్నారు నిపుణులు .

వ్యక్తిత్వం అంటే ఒక మనిషి ఆలోచించే విధానం, అతను భావోద్వేగాలను వ్యక్తం చేసే తీరు. ఉదాహరణకు, కొందరు తక్కువ మాట్లాడే స్వభావం కలవారు. కొందరు బాగా కోపపడతారు. ఇవన్నీ వ్యక్తిత్వ లక్షణాలు. కానీ, పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఆ లక్షణాలు అతిగా మారి, ఒక వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడంలోనూ, ఇతరులతో ఆరోగ్యకరమైన సంబంధాలు పెట్టుకోవడంలోనూ తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి.

ఈ డిజార్డర్స్ (Personality Disorders)ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా బయటపడతాయి. కొందరిలో అనుమానాలు, కోపం అతిగా ఉంటాయి. ఉదాహరణకు, రేవంత్ అనే వ్యక్తిని తీసుకుందాం. అతను తన స్నేహితుడు చిన్న జోక్ వేసినా, అది తనను అవమానించడానికే అని అనుకుంటాడు. ఉద్యోగంలో తన సహోద్యోగులు ఏదైనా పని గురించి మాట్లాడితే, అది తనపై కుట్ర అని భావిస్తుంటాడు. ఇలాంటి అతిగా ఆలోచించే స్వభావం వల్ల అతను ఒంటరిగా ఉండిపోతాడు.

Personality Disorders
Personality Disorders

మరో ఉదాహరణ, రోహిణి అనే యువతి. ఆమె ఎప్పుడూ అందరి దృష్టి తనపైనే ఉండాలని కోరుకుంటుంది. ఎవరైనా పొగడకపోతే ఆమెకు తీవ్ర నిరాశ కలుగుతుంది. ఇతరుల నుంచి సానుభూతి పొందడానికి లేని సమస్యలు ఉన్నాయని చెబుతుంది. ఆమె సంబంధాలు క్షణంలో ప్రేమతో నిండి, మరో క్షణంలో ద్వేషంతో నిండి ఉంటాయి. ఈ ఉదాహరణలు పర్సనాలిటీ డిజార్డర్‌కు (Personality Disorders)ఒక చిన్న అద్దం మాత్రమే.

మానసిక శాస్త్రం ప్రకారం, పర్సనాలిటీ డిజార్డర్స్‌ను మూడు ప్రధాన కేటగిరీలుగా విభజిస్తారు.

క్లస్టర్ A .. ఈ వర్గంలోని వ్యక్తులు అనుమానాలు, విచిత్రమైన ఆలోచనలతో ఉంటారు. ఇతరుల నుంచి దూరంగా ఉండాలని కోరుకుంటారు. పారనాయిడ్, స్కిజాయిడ్ వంటి డిజార్డర్స్ ఈ కోవకు వస్తాయి.

క్లస్టర్ B .. ఈ వర్గంలోని వారు భావోద్వేగాలను తీవ్రంగా వ్యక్తం చేస్తారు. వీరి సంబంధాలు అస్థిరంగా ఉంటాయి. దృష్టిని ఆకర్షించుకోవడానికి ప్రయత్నిస్తారు. బోర్డర్‌లైన్, నార్సిసిస్టిక్, హిస్ట్రియోనిక్ డిజార్డర్స్ ఈ కేటగిరీ కిందకు వస్తాయి.

క్లస్టర్ C..ఈ వర్గంలోని వ్యక్తులు తీవ్రమైన భయం, ఆందోళనతో ఉంటారు. తమపై తమకు విశ్వాసం ఉండదు. ఎప్పుడూ ఇతరులపై ఆధారపడాలని చూస్తారు. అవైడెంట్, డిపెండెంట్, అబ్సెసివ్ వంటివి ఈ కేటగిరీలో ఉంటాయి.

Bipolar disorder:బైపోలార్ డిసార్డర్.. రెండు అంచుల మధ్య జీవితం, ఎలా బయటపడాలి?

పర్సనాలిటీ డిజార్డర్స్ కేవలం ఒక కారణం వల్ల రావు. చిన్ననాటి అనుభవాలు , జన్యు ప్రభావాలు , మెదడులోని రసాయనాల అసమతుల్యత వంటి అనేక అంశాలు కలిసి దీనికి దారితీస్తాయి.

ఈ సమస్య వల్ల ఒక వ్యక్తి జీవితం చాలా ఒంటరిగా, గందరగోళంగా మారుతుంది. ఇది తీవ్రమైన డిప్రెషన్, ఆందోళన, మాదకద్రవ్యాల వాడకానికి కూడా దారితీస్తుంది.ఈ సమస్యకు పూర్తి నివారణ లేకపోయినా, లక్షణాలను నియంత్రించవచ్చు. సైకోథెరపీ ద్వారా ఆలోచనా విధానాన్ని మార్చుకోవచ్చు. మందులు వాడటం వల్ల డిప్రెషన్, ఆందోళన వంటి లక్షణాలు తగ్గుతాయి.

అన్నింటికంటే ముఖ్యంగా, కుటుంబం, స్నేహితుల మద్దతు చాలా అవసరం. పర్సనాలిటీ డిజార్డర్ అనేది ఒక వ్యక్తి బలహీనత కాదు, అది ఒక వ్యాధి. సహాయం కోరడం ద్వారా జీవితాన్ని తిరిగి గాడిలో పెట్టుకోవడం సాధ్యమే.

మరిన్ని హెల్త్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button