Vijay: డీఎంకేతోనే మాకు పోటీ బీజేపీకి అంత సీన్ లేదన్న విజయ్
Vijay: తమిళనాడులో రజనీకాంత్ తర్వాత విజయ్ కే ఎక్కువ పాపులారిటీ ఉంది. ఈ కారణంగానే విజయ్ తో పొత్తు కోసం అన్నాడీఎంకే ప్రయత్నిస్తోంది.

Vijay
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయమున్నా కొత్తగా పార్టీ పెట్టిన ప్రముఖ నటుడు విజయ్(Vijay) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. గత రెండు మూడు నెలలుగా అభిమాల సంఘాలు, పలువురు ప్రముఖలను కలుస్తూ సమావేశాలు నిర్వహిస్తూ గడుపుతున్నారు. మధ్యమధ్యలో భారీ సభలకు కూడా హాజరవుతూ తన పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. తాజాగా తమక్కల్ జిల్లాలోని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వంపైనా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకేకు, తన పార్టీ టీవీకే మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని తేల్చేశారు.
బీజేపీకి తమిళ ప్రజలు రాష్ట్రంలో చోటివ్వరని వ్యాఖ్యానించారు. అయితే అధికార డీఎంకే పార్టీ బీజేపీతో పొత్త కోసం ప్రయత్నిస్తోందంటూ విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను డీఎంకే నెరవేర్చలేదంటూ మండిపడ్డారు. డీఎంకేకు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టనేనని, కేవలం టీవీకే పార్టీనే తమిళ ప్రజల మేలు కోసం కృషి చేస్తుందంటూ చెప్పుకొచ్చారు.

తమ టీవీకే పార్టీ ఎప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకోదని విజయ్ తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే మహిళల భద్రత, విద్యార్థులకు నాణ్యమైన చదువు, ఆరోగ్యం, రోడ్లు, తాగునీరు వంటి అంశాలకు ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఇదిలా ఉంటే విజయ్ ప్రచారసభలకు తమిళనాట విపరీతమైన స్పందన వస్తోంది. జనం భారీగా తరలివస్తుండడంతో విజయ్ లో కూడా జోష్ పెరిగింది. ముందు విజయ్ పార్టీని పెద్దగా పట్టించుకోని ప్రత్యర్థి పార్టీలు ఇప్పుడు ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది.
డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల్లో ప్రాధాన్యత దక్కని నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారు. కానీ నేతలను చేర్చకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తమిళనాడులో రజనీకాంత్ తర్వాత విజయ్ కే ఎక్కువ పాపులారిటీ ఉంది. ఈ కారణంగానే విజయ్ తో పొత్తు కోసం అన్నాడీఎంకే ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం తమకంటే బలంగా ఉన్న డీఎంకేను ఓడించాలంటే విజయ్ లాంటి పాపులారిటీ ఉన్న వ్యక్తి ఖచ్చితంగా కలిసి రావాలని అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామి నమ్ముతున్నారు. అయితే బీజేపీతో వెళ్ళేందుకు విజయ్ మాత్రం సిద్ధంగా లేరు. దీంతో అన్నాడీఎంకేతో ఆయన కలిసి రావడం డౌటేనని రాజకీయ విశ్లేషకుల అంచనా.
మరోవైపు విజయ్ ప్రచారసభలకు వస్తున్న జనంపై నటుడు కమల్ హాసన్ సెటైర్లు వేస్తున్నారు. సభలకు వచ్చేవారంతా ఓట్లు వేయరంటూ చెబుతున్నారు. బహుశా తనకు గత ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకునే కమల్ ఈ కామెంట్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే విజయ్ మాత్రం వ్యూహాత్మకంగానే రాజకీయ అడుగులు వేస్తున్నట్టు పలువురు చెబుతున్నారు. పొత్తులపై ఇప్పటికిప్పుడే తొందరపడకుండా ఎన్నికలకు 3-4 నెలల ముందు ఆలోచిస్తారని అంచనా వేస్తున్నారు.