War Begins : యుద్ధం మళ్లీ మొదలు..ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా
War Begins : తమ మిత్రదేశాల రక్షణ, అంతర్జాతీయ జలాల్లో నౌకల సురక్షిత ప్రయాణం కోసమే ఈ ముందస్తు దాడులు చేపట్టినట్లు అమెరికా తెలిపింది.
War Begins
అమెరికా , ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరి యుద్ధం ముగిసిందనుకుంటున్న వేళ పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. యుద్ధం మళ్లీ మొదలయిందా (War Begins) అనుకునే దిశగా ఇరాన్‌పై అమెరికా క్షిపణులతో విరుచుకుపడింది.
ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలు, డ్రోన్ స్థావరాలు,తీరప్రాంత రాడార్ కేంద్రాలు లక్ష్యంగా చేసుకుని యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ దాడులు చేసింది. రాజధాని టెహ్రాన్ సమీప ప్రాంతాలపై భీకరమైన క్షిపణులతో మెరుపు దాడులకు దిగింది. దీనికి కారణం హర్మూజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న సింగపూర్ నౌకపై ఇరాన్ దాడికి పాల్పడడమే.
ఎవర్ లవ్లీ అనే సింగపూర్ కార్గో నౌకపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఒమన్ దేశంలోని దహిత్ రేవుకు ఆగ్నేయంగా 7.5 నాటికల్ మైళ్ల దూరంలో, హర్మూజ్ జలసంధి గుండా వెళ్తుండగా ఈ దాడి జరిగింది. బ్రిటన్ నౌకాదళం సూచించిన దక్షిణ మార్గం నుంచి ఈ నౌక ప్రయాణించింది. అయితే, తమ అనుమతి లేని మార్గాల్లో వెళ్లే నౌకల భద్రతకు గ్యారెంటీ లేదని ఇరాన్ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే ఈ దాడికి పాల్పడింది.
ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ తాత్కాలిక సీజ్ ది ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే ఈ దాడి అని ప్రకటించారు. దీంతో రెండు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం మళ్లీ ప్రమాదంలో పడినట్టయింది.

తమ మిత్రదేశాల రక్షణ, అంతర్జాతీయ జలాల్లో నౌకల సురక్షిత ప్రయాణం కోసమే ఈ ముందస్తు దాడులు చేపట్టినట్లు అమెరికా తెలిపింది. ఇదిలా ఉంటే ఈ దాడి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఎలాంటి ఉసిగొల్పు చర్యలు లేకుండా చేసిన ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు హర్మూజ్ జలసంధిలో నెలకొన్న తాజా ఉద్రిక్తతల వల్ల అక్కడ చిక్కుకుపోయిన వేలాది మంది నావికులను సురక్షితంగా తరలించడానికి ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ చేపట్టిన తరలింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. కాగా శాంతి చర్చలు జరుగుతున్న సమయంలోనే రెండు దేశాల మధ్య ఈ విధమైన భీకర దాడులు(War Begins) జరగడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.





