Nimisha Priya: నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దు వెనుక జరిగిందేంటి?
Nimisha Priya: యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన భారతీయ నర్సు నిమిషా ప్రియకు భారీ ఊరట లభించింది.

Nimisha Priya: యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళకు చెందిన భారతీయ నర్సు నిమిషా ప్రియకు భారీ ఊరట లభించింది. ఆమెకు విధించిన ఉరిశిక్షను రద్దు చేసేందుకు యెమెన్ ప్రభుత్వం అంగీకరించింది. భారత గ్రాండ్ ముఫ్తీ, సున్నీ లీడర్ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం నుంచి ఈ సంచలన ప్రకటన వెలువడటంతో, ఎంతోకాలంగా ఆమె విడుదల కోసం ఎదురుచూస్తున్న కుటుంబానికి, మద్దతుదారులకు ఆశలు చిగురించాయి.
Nimisha Priya
నిజానికి, షెడ్యూల్ ప్రకారం జులై 16నే ఉరిశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే, భారత ప్రభుత్వం చేసిన పటిష్టమైన దౌత్య విజ్ఞప్తితో ఈ ప్రక్రియ వాయిదా పడింది. అప్పటి నుంచి న్యూఢిల్లీ, యెమెన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, ఈ క్లిష్టమైన కేసును పరిష్కరించేందుకు అన్ని విధాలా ప్రయత్నించింది.
నిమిషా ప్రియ(Nimisha Priya) కేసులో కేవలం దౌత్య ప్రయత్నాలే కాకుండా, మత పెద్దల చొరవ కూడా కీలక పాత్ర పోషించింది. భారత గ్రాండ్ ముఫ్తీ అబూబకర్ ముస్లియార్ (Abu Bakar Musliyar,)ప్రత్యేక విజ్ఞప్తి మేరకు, ప్రముఖ సూఫీ పెద్ద షేక్ హబీబ్, సున్నీ లీడర్ అబూబకర్ ముస్లియార్ స్వయంగా యెమెన్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ ఉన్నత స్థాయి సమావేశాలు ఫలించడంతోనే నిమిషా ప్రియ ఉరిశిక్ష రద్దుకు యెమెన్ ప్రభుత్వం సమ్మతించినట్లు ముఫ్తీ కార్యాలయం ప్రకటించింది. యెమెన్‌లోని యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ జస్టిస్ ప్రతినిధి కూడా ఈ ప్రకటనను ధృవీకరించారు. మతపెద్దలు తీసుకున్న ఈ సాహసోపేతమైన చొరవే, నిమిష ప్రియకు పునర్జన్మ ప్రసాదించినట్లు తెలుస్తోంది.
ఉరిశిక్ష రద్దు కావడంతో, నిమిష ప్రియ భవిష్యత్తు ఇప్పుడు తదుపరి దశలోకి ప్రవేశించింది. ఆమెను పూర్తిగా విడుదల చేస్తారా, లేక ఆమె మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈ కీలక నిర్ణయం, హత్యకు గురైన యెమెన్ పౌరుడు మహదీ కుటుంబంతో జరిగే చర్చలపై ఆధారపడి ఉంటుంది. మహదీ కుటుంబం అంగీకారం, లేదా బ్లడ్ మనీ (దియా) చెల్లింపు వంటి అంశాలు ఈ కేసులో తుది నిర్ణయాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
కేరళకు చెందిన నిమిషా ప్రియ, ఉపాధి నిమిత్తం యెమెన్‌కు వెళ్లి అక్కడ నర్సుగా పనిచేసింది. యెమెన్ దేశస్థుడైన తలాల్ అబ్దో మహదీతో కలిసి ఆమె ఒక క్లినిక్‌ను ప్రారంభించింది. అయితే, వ్యాపార భాగస్వామ్యం, వ్యక్తిగత అంశాల కారణంగా ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. మహదీ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని నిమిష ప్రియ ఆరోపించింది. ఈ క్రమంలో, మరొక వ్యక్తి సహాయంతో మహదీకి నిమిషా ప్రియ మత్తు మందు ఇచ్చింది. దురదృష్టవశాత్తు, ఆ మత్తు మందు డోస్ ఎక్కువ కావడంతో మహదీ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో యెమెన్ న్యాయస్థానం నిమిష ప్రియకు మరణశిక్ష విధించింది. అప్పటినుంచి ఆమెను ఉరిశిక్ష నుంచి తప్పించేందుకు ఆమె కుటుంబం, భారత ప్రభుత్వం, వివిధ స్వచ్ఛంద సంస్థలు చేసిన అలుపెరగని పోరాటం ఎట్టకేలకు ఫలించింది.
ఈ పరిణామం నిమిషా ప్రియ కుటుంబానికి, ఆమె విడుదల కోసం ప్రార్థిస్తున్న ప్రతీ ఒక్కరికీ ఎంతో ఉపశమనాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఈ కేసులో తదుపరి అడుగులు ఎలా ఉంటాయో చూడాలి.