China: China: భారత్‌పై చైనా వాటర్ బాంబ్..
China: చైనా, తన విస్తరణవాద వ్యూహాలను మరోసారి చాటుతూ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది.

China: చైనా, తన విస్తరణవాద వ్యూహాలను మరోసారి చాటుతూ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. భారత్ సరిహద్దును ఆనుకుని ఉన్న టిబెట్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర నది(Brahmaputra River)పై భారీ డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ చైనాలోని అనేక ప్రాంతాలకు మేలు చేస్తుందని బీజింగ్ చెబుతోంది. అయితే, దీనిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయితే దిగువన ఉన్న భారత్‌కు నీటి ప్రవాహం గణనీయంగా తగ్గిపోతుందని, ఈశాన్య రాష్ట్రాల్లోని జీవవైవిధ్యం తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరిస్తోంది. భారత్, బంగ్లాదేశ్ ఆందోళనలను చైనా ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసి తీరుతామని తెగేసి చెబుతోంది.
China’s water war against India
ప్రపంచంలోనే అతిపెద్ద ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని దాదాపు రూ. 14 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ‘డ్రాగన్ కంట్రీ’ నిర్మిస్తోంది. తాజాగా పనులు ప్రారంభమైనట్లు చైనా ప్రధాని లీ కియాంగ్ ప్రకటించారు. టిబెట్ ప్రాంతంలోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ఈ వివాదాస్పద ప్రాజెక్టును నిర్మిస్తోంది. భారత్, బంగ్లాదేశ్‌ల తీవ్ర ఆందోళనలను సైతం చైనా లెక్క చేయడం లేదు.
భారత్, చైనా మధ్య దాదాపు 3,488 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. భారత్‌లోని జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు చైనాతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఈ సమయంలో చైనా ఈ డ్యామ్ నిర్మాణంతో భారత్‌పై పెద్ద కుట్ర పన్నిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా చైనా కేవలం విద్యుత్ ఉత్పత్తిని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోలేదని విశ్లేషకుల అంచనా. వ్యూహాత్మక ఆధిపత్యాన్ని పెంచుకోవడం, భవిష్యత్తులో నీటిని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవడం చైనా వ్యూహంలో అంతర్భాగం కావచ్చని అంటున్నారు. ఈ డ్యామ్ పూర్తయితే, బ్రహ్మపుత్రపై ఆధారపడిన భారత ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలకు నీటి ప్రవాహం తీవ్రంగా తగ్గుతుంది. ఇది వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమలపై దారుణ ప్రభావం చూపుతుంది. నది ప్రవాహం తగ్గడం వల్ల ఈ ప్రాంతంలోని సున్నితమైన పర్యావరణ వ్యవస్థ ధ్వంసమవుతుంది. జీవవైవిధ్యం నశించి, అటవీ సంపద, వన్యప్రాణులకు పెనుముప్పు వాటిల్లుతుంది.
యుద్ధ సమయాల్లో లేదా సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగినప్పుడు చైనా ఈ డ్యామ్‌ను నియంత్రించి, నీటిని విడుదల చేయడం లేదా నిలిపివేయడం ద్వారా భారత్‌పై తీవ్ర ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ఇది జాతీయ భద్రతకు భారీ ముప్పు. నదిపై ఆధారపడిన పర్యాటక రంగం, స్థానిక ప్రజల జీవనోపాధి దారుణంగా దెబ్బతింటుందని సాంకేతిక నిపుణులు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖాండు, చైనా చర్యలను తీవ్రంగా ఖండించారు. భారత్ సరిహద్దులోని యార్లాంగ్ సాంగ్ పో నదిపై చైనా అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోందని, ఇది భారత్‌పై చైనా వేసిన ‘వాటర్ బాంబ్’ అని పోల్చారు. చైనా సైనిక శక్తి కన్నా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం మరింత ప్రమాదకరమని పెమా ఖాండు తీవ్ర హెచ్చరిక చేశారు. భారత విదేశాంగ శాఖ కూడా చైనా చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎగువ ప్రాంతాల్లో నిర్మించే ప్రాజెక్టుల వల్ల దిగువన ఉన్న ప్రాంతాలకు హాని కలగకుండా చూసుకోవాలని చైనాకు సూచించింది.
మరోవైపు, భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఆగస్టులో చైనాలో పర్యటించనున్నారు. అక్కడ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(Xi Jinping)తో మోదీ చర్చలు జరపనున్నారు. గతంలో లద్దాఖ్ సరిహద్దుల్లోని గాల్వన్ లోయలో సైనికుల మధ్య జరిగిన ఘర్షణతో రెండు దేశాల మధ్య సంబంధాలు స్తంభించిపోయాయి. ఈ తరుణంలో ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో తియాంజిన్ వేదికగా జరగనున్న SCO సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో బ్రహ్మపుత్ర డ్యామ్ వివాదం, సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.