Sabudana:సగ్గు బియ్యం గురించి మీకీ విషయాలు తెలుసా? డయాబెటిస్ ఉంటే తినొచ్చా లేదా?
Sabudana: సగ్గుబియ్యంలో ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది కేవలం కార్బోహైడ్రేట్లను మాత్రమే అందిస్తుంది.

Sabudana
మన నిత్య జీవితంలో, ముఖ్యంగా ఉపవాసాల సమయంలో విరివిగా వాడే ఆహార పదార్థాలలో ఒకటి సగ్గు బియ్యం. దీనిని ఇంగ్లీష్‌లో సాగో (Sago) లేదా సబుదానా(Sabudana) అని పిలుస్తారు. సగ్గు బియ్యం ప్రధానంగా సాగో పామ్ అనే చెట్టు మధ్య భాగం నుంచి లభించే స్టార్చ్‌ను ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. ఒక్కోసారి కర్రపెండలం (Tapioca) అనే దుంప నుంచి కూడా సగ్గు బియ్యంను తయారు చేసి మార్కెట్‌లో అమ్ముతుంటారు.
సగ్గు బియ్యం(Sabudana) గురించి చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. దీనిలో నిజంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా అంటే, మితంగా వాడినప్పుడు మాత్రమే ఉంటాయి.సగ్గు బియ్యంలో సహజంగా గ్లూటెన్ ఉండదు, కాబట్టి గ్లూటెన్ అలెర్జీ ఉన్నవారికి ఇది మంచి ఎంపిక.ఇందులో కొవ్వు , కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి.ఇది త్వరగా శక్తిని అందిస్తుంది, అందుకే ఉపవాసాల సమయంలో ఉపయోగిస్తారు. సగ్గు బియ్యంలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ పేగులోని మంచి బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేసి, జీర్ణక్రియకు సహాయపడుతుంది.

Pulses: పప్పులు ఇలా తింటేనే సంపూర్ణ ఆరోగ్యమట..
సగ్గు బియ్యం(Sabudana)లో కొన్ని ప్రయోజనాలు ఉన్నా కూడా దీనిని విరివిగా వాడడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సగ్గు బియ్యంలో ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది కేవలం కార్బోహైడ్రేట్లను మాత్రమే అందిస్తుంది, పూర్తిస్థాయి ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు.ఎక్కువగా తింటే, కేలరీలు అధికంగా ఉండే సగ్గు బియ్యం బరువు పెరగడానికి కారణమవుతుంది.ఇందులో పీచు పదార్థం (fiber) చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా తింటే మలబద్ధకం, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు రావచ్చు.
సైనైడ్ విషం (Cyanide Poisoning).. సగ్గు బియ్యం తయారు చేసే సాగో పామ్ లేదా కసవా దుంపను సరిగ్గా ప్రాసెస్ చేయకపోతే, అందులో ఉండే సైనైడ్ విషపూరితం కావచ్చు. కానీ మార్కెట్లో లభించే ప్రాసెస్డ్ సగ్గు బియ్యం సురక్షితమైనదే.

మధుమేహం (Diabetes) ఉన్నవారు సగ్గు బియ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సగ్గు బియ్యంలో దాదాపు 90% కాలరీలు కార్బోహైడ్రేట్ల నుంచి వస్తాయి దీంతో అధిక కార్బోహైడ్రేట్ల ప్రమాదం ఉంది.దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరిగిపోతాయి.
డయాబెటిస్ ఉన్నవారు సగ్గు బియ్యంను తక్కువ మోతాదులో, ఎప్పుడో ఒకసారి మాత్రమే తీసుకోవాలి. దానిని పాలు, పప్పులు, లేదా కూరగాయలతో కలిపి తినడం వల్ల కార్బోహైడ్రేట్లు శరీరానికి నెమ్మదిగా అందుతాయి.
సగ్గు బియ్యం(Sabudana) మితంగా తీసుకుంటే మంచిదే. కానీ అధికంగా, ప్రతిరోజూ తినడం వల్ల పోషకాహార లోపం, బరువు పెరగడం, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు సగ్గు బియ్యానికి బదులు మిల్లెట్స్, ఓట్స్, కూరగాయలు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఏదైనా ఆహారాన్ని తీసుకునేటప్పుడు, దాన్ని మితంగా, అవగాహనతో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో అవసరం.