Padmasana: పద్మాసనం భంగిమలో దాగి ఉన్న అద్భుత శక్తులు తెలుసా?
Padmasana: పద్మాసనం (Padmasana) అనేది కేవలం శరీరాన్ని వంచడం మాత్రమే కాదు. ఇది మనస్సు, శరీరం , శ్వాస మధ్య సమన్వయాన్ని సాధించే ఒక శక్తివంతమైన సాధనం.
Padmasana
యోగాసనాలలో అత్యంత గౌరవప్రదమైన భంగిమగా పరిగణించబడే పద్మాసనం (Lotus Pose) అనేది కేవలం శరీరాన్ని వంచడం మాత్రమే కాదు, ఇది మనస్సు, శరీరం , శ్వాస మధ్య సమన్వయాన్ని సాధించే ఒక శక్తివంతమైన సాధనం. ఈ ఆసనం యొక్క భంగిమ కమలం పువ్వును పోలి ఉంటుంది, అందుకే దీనిని పద్మాసనం అంటారు.
పద్మాసనం(Padmasana)లో కూర్చున్నప్పుడు, శరీరం స్థిరంగా ఉంటుంది మరియు వెన్నెముక (Spine) సహజంగా నిటారుగా ఉంటుంది. ఇది మెరుగైన శరీర భంగిమను (Posture) అందించడమే కాకుండా, ఊపిరితిత్తులకు గాలి పీల్చే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ భంగిమ తుంటి కీళ్ళు, మోకాళ్లు , చీలమండ కీళ్ల వశ్యతను (Flexibility) గణనీయంగా పెంచుతుంది.

పద్మాసనం యొక్క లోతైన ప్రభావం రక్త ప్రసరణపై ఉంటుంది. కాళ్లను ముడుచుకోవడం వలన ఆ ప్రాంతానికి రక్త ప్రసరణ కొంత తగ్గుతుంది. ఫలితంగా, రక్తం అధికంగా పొత్తికడుపు (Abdomen) ప్రాంతానికి మరియు గుండె వైపు మళ్లుతుంది. దీని వలన జీర్ణ అవయవాలు ఉత్తేజితమై, జీర్ణక్రియ సామర్థ్యం మెరుగుపడుతుంది.
అన్నింటికంటే ముఖ్యంగా, పద్మాసనం అనేది ధ్యానం (Meditation) కోసం అత్యంత అనువైన ఆసనం. ఈ భంగిమ మనస్సును స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. నాడీ వ్యవస్థ శాంతించి, శ్వాస నియంత్రణలోకి వస్తుంది. తరచుగా పద్మాసనం సాధన చేయడం వలన అధిక రక్తపోటు (High Blood Pressure), ఆందోళన , కండరాల నొప్పులు తగ్గుతాయని యోగా నిపుణులు చెబుతారు. రోజువారీ జీవితంలో శారీరక, మానసిక స్థిరత్వాన్ని పెంచడానికి పద్మాసనం ఒక గొప్ప మార్గం.



