BRICS: బ్రిక్స్ అధ్యక్ష పదవి బాధ్యతల్లో భారత్..ఎదురయ్యే సవాళ్లు ఏంటి?
BRICS: భారత్ బ్రిక్స్ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాక దౌత్యపరంగా పెద్ద సవాలుగా మారింది.
BRICS
ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం ఇప్పుడు మరో కీలక బాధ్యతను చేపట్టబోతోంది. శక్తివంతమైన దేశాల కూటమి అయిన బ్రిక్స్ (BRICS) అధ్యక్ష పదవిని బ్రెజిల్ నుండి భారత్ అందుకుంది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి భారతదేశం అధికారికంగా ఈ బాధ్యతలను నిర్వహించనుంది.
బ్రెజిల్ రాజధాని బ్రెసిలియాలో జరిగిన సమావేశంలో అధ్యక్ష పదవి బదిలీ కార్యక్రమం చాలా ప్రతీకాత్మకంగా జరిగింది. గతంలో రష్యా నుండి స్టీల్ సుత్తిని అందుకున్న కూటమి, ఈసారి బ్రెజిల్ అడవుల నుంచి సేకరించిన రీసైకిల్ కలపతో చేసిన సుత్తిని భారత్‌కు అందజేసింది.
ఇది ప్రకృతితో ముడిపడిన అభివృద్ధిని సూచిస్తుందని బ్రెజిల్ ప్రతినిధులు తెలిపారు. భారతదేశ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందని వారు ఈ సందర్భంగా చెప్పారు.

అయితే భారత్ ఈ బాధ్యతలు చేపడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రాక దౌత్యపరంగా పెద్ద సవాలుగా మారింది. బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్‌కు వ్యతిరేకంగా లేదా డాలర్ విలువను తగ్గించేలా వ్యవహరిస్తే 100 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే బెదిరింపులు మొదలుపెట్టారు.
అటు అమెరికాతో స్నేహాన్ని కాపాడుకుంటూనే, ఇటు బ్రిక్స్ సభ్య దేశాలైన రష్యా, చైనా, బ్రెజిల్ వంటి దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడం భారత్‌కు ఒక అగ్ని పరీక్ష లాంటిది.

బ్రిక్స్ కూటమి అమెరికాకు వ్యతిరేకమైనది కాదని, అది కేవలం అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం కోసమేనని ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు భారత్‌పై ఉంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వాతావరణ మార్పులు, శాస్త్రీయ రంగాల్లో సభ్య దేశాల మధ్య సత్సంబంధాలను పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.



