Just TelanganaJust PoliticalLatest News

FSL:ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంపై సంచలన రిపోర్ట్..సాక్ష్యాలు బూడిదపాలు అయినట్లేనా?

FSL: ఈనెల ఫిబ్రవరి 7వ తేదీన నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్ భవనంలో ఉదయం పది గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల.. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి.

FSL

తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ( FSL)లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ఈరోజు అత్యంత కీలకమైన అడుగు పడింది. నాగపూర్ నుంచి వచ్చిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ టీమ్ తమ తుది నివేదికను తెలంగాణ ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ నివేదికలో ..మంటల్లో చిక్కుకున్న సుమారు 1100 ఫైళ్లకు సంబంధించిన మొత్తం డేటాను రికవరీ చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

సర్వర్ రూమ్ పూర్తిగా దెబ్బతినడంతో పాటు, హార్డ్ డిస్కులు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కరిగిపోయినట్లు నివేదికలో తేలింది. దీంతో వెయ్యికి పైగా కేసుల్లో శాస్త్రీయ ఆధారాలు పూర్తిగా పోయాయన్న వార్త ఇప్పుడు పోలీస్ శాఖలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఈనెల ఫిబ్రవరి 7వ తేదీన నాంపల్లిలోని ఎఫ్ఎస్ఎల్ ( FSL)భవనంలో ఉదయం పది గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల.. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మూడున్నర గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది పోరాడి మంటలను అదుపులోకి తెచ్చినా కూడా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

కంప్యూటర్ ఫోరెన్సిక్ విభాగం, లైబ్రరీ ,అలాగే సీజ్ చేసిన సాక్ష్యాధారాల గది పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి అసలు ఈ ఘటనలో ఎంత డేటా పోయింది? కీలక కేసులు సంగతి ఏంటన్న ఉత్కంఠకు ఈరోజు వచ్చిన నాగపూర్ బృందం నివేదిక ఒక చేదు ముగింపునిచ్చినట్లు అయింది.

అయితే ఈ డేటా లాస్ వల్ల సామాన్య నేరాలకు సంబంధించిన దర్యాప్తులపై చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా మర్డర్ కేసులు, డ్రగ్స్ నెట్‌వర్క్, సైబర్ క్రైమ్స్ , డీఎన్ఏ పరీక్షలకు సంబంధించిన 1100 ఫైళ్లు కాలిపోవడం వల్ల నిందితులు సాక్ష్యాధారాల లోపంతో కోర్టు నుంచి కూడా తప్పించుకునే ప్రమాదం ఉంది.

అయితే, అధికారులు మాత్రం ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ , ఎమ్మెల్యేల పోచింగ్ వంటి హై-ప్రొఫైల్ కేసులు డేటా మాత్రం సురక్షితంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటికి సంబంధించిన మెటీరియల్ కోర్టు కస్టడీలో ఉండటంతో పాటు వేరే చోట బ్యాకప్ ఉండటం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలగదని క్లారిటీ ఇచ్చారు.

ఇక ఈ విషయంలో తెలుగు రాష్ట్రాల చరిత్రను పరిశీలిస్తే..ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఇంత భారీ స్థాయిలో డేటా నష్టం జరగడం ఇదే మొదటిసారి. గతంలో 2019లో ఏపీలోని విజయవాడ ల్యాబ్‌లో ఒకసారి చిన్న అగ్నిప్రమాదం జరిగినా, వెంటనే స్పందించడంతో అప్పట్లో ఒక్క ఫైలు కూడా పాడవకుండా జాగ్రత్తపడగలిగారు.

అలాగే మదనపల్లె ఆర్డీఓ ఆఫీసులో జరిగిన ఫైళ్ల దహనం.. భూ దందాల విషయంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. ఆ ప్రమాదంలో ఏకంగా 2,440 ఫైళ్లు కాలిపోవడంతో పెద్దిరెడ్డి అనుచరులపై ఉన్న భూ కబ్జా ఆరోపణలతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్ల దర్యాప్తునకు పెద్ద ఆటంకం కలిగింది.

FSL
FSL

వేలాది ఎకరాల అసైన్డ్ భూములు, నిషేధిత 22ఏ భూములను అక్రమంగా ఫ్రీహోల్డ్ చేసిన వ్యవహారాలు ఈ దహనకాండతో చిక్కుల్లో పడినట్లు అయింది. ప్రస్తుతం సీఐడీ అధికారులు డూప్లికేట్ పత్రాల ద్వారా కేసులను పునర్నిర్మించే ప్రయత్నం చేస్తున్నా కూడా, కీలక ఆధారాలన్నీ దాదాపు కనుమరుగవ్వడం వల్ల విచారణ ఆలస్యమవుతోంది.

తెలంగాణలో ఇప్పుడు జరిగిన ఘటనలో బీఆర్‌ఎస్ ఇది ప్రమాదం కాదు కుట్ర అని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తుంది.

ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం ఈ నష్టాన్ని పూడ్చడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలను చేపట్టింది. కొత్త ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మించడంతో పాటు, ఫ్యూచర్లో ఇలాంటివి మళ్లీ జరగకుండా క్లౌడ్ స్టోరేజ్‌తో పాటు ఆఫ్-సైట్ బ్యాకప్ సర్వర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.

అంతేకాదు దర్యాప్తులో ఉన్న ఆ 1100 కేసులకు సంబంధించి ప్రత్యామ్నాయ ఆధారాలు ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూడాలని జిల్లాల పోలీసులకు సూచించారు. ఏది ఏమైనా ఈ ప్రమాదం ఫోరెన్సిక్ వ్యవస్థలో ఉన్న భద్రతా లోపాలను ఎత్తిచూపడమే కాకుండా, మన డిజిటల్ సాక్ష్యాల భద్రతపైన కూడా కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button