Just LifestyleLatest News

Bystander Effect:మాయమవుతున్న మానవత్వం.. మీరూ బైస్టాండర్ ఎఫెక్ట్‌కు చెందినవారేనా?

Bystander Effect: ఎవరైనా ఆపదలో ఉంటే కాపాడటాన్ని పక్కన పెట్టి మరీ ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించి నాలుగు లైకులు సంపాదించుకోవాలనే పైశాచిక ఆనందం మనిషిలో ఎక్కువ అవుతోంది.

Bystander Effect

బిజీగా ఉన్న ఒక రోడ్డులో వెళుతున్నారు. పైగా ఎండ మండిపోతోంది. ఒక్కసారిగా ఒక పెద్ద శబ్దం వినిపించింది. అక్కడ ఒక బైక్ ప్రమాదానికి గురై..ఓ వ్యక్తి రక్తం ఓడుతూ కింద పడి ఉన్నాడు. మీతో పాటు అందరూ ఆగి చూస్తున్నారు. కొందరు ఫోన్లలో వీడియోలు కూడా తీస్తున్నారు, మరికొందరు అయ్యో పాపం అని బాధపడుతున్నారు. కానీ, విచిత్రంగా మీతో సహా ఏ ఒక్కరు కూడా ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ముందుకు రావడం లేదు.

ఎందుకంటే అక్కడున్న ప్రతి ఒక్కరి మనసులోనూ ఒకటే ఆలోచన మెదులుతూ ఉంటుంది. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, వారిలో ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారులే, నేనెందుకు అనవసరంగా దీనిని నెత్తిమీద వేసుకోవడం ఇరుక్కోవడం అని వెనుకడుగు వేస్తారు. సైకాలజీలో ఈ భయంకరమైన సామాజిక స్థితిని బైస్టాండర్ ఎఫెక్ట్(Bystander Effect) అని పిలుస్తారు.

ఇంకా చెప్పాలంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరైనా ఆపదలో ఉంటే మాత్రం మీరు వెంటనే రియాక్టవుతారు. కానీ, చుట్టూ గుంపు ఉన్నప్పుడు మాత్రం ఎవరో ఒకరు చూసుకుంటారులే అని ఆ బాధ్యత నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. దీనిని సైకలాజికల్ గా డిఫ్యూజన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటారు.

అంటే, రెస్పాన్సిబిలిటీ అనేది అందరి మధ్య పంపకంగా మారిపోవడంతో అక్కడ చివరికి ఎవరికీ బాధ్యత లేనట్లుగా తయారవుతుంది. ఒక వ్యక్తి మాత్రమే అక్కడ ఉంటే, ఆ బాధ్యత మొత్తం తనదే అని అనుకుని ప్రాణాలు కాపాడుతాడు. కానీ వంద మంది ఉన్నప్పుడు, ఆ వందలో నేను ఒకడిని మాత్రమే కదా అని మనిషి తన మనస్సాక్షిని సమాధి చేసేస్తాడు.

అయితే ఈ బైస్టాండర్ ఎఫెక్ట్(Bystander Effect)మనస్తత్వం వెనుక ప్లూరలిస్టిక్ ఇగ్నోరెన్స్ అనేది మరో కోణంగా ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. . చుట్టూ ఉన్నవాళ్లు ఎవరూ కదలడం లేదు కాబట్టి బహుశా ఇది అంత పెద్ద ప్రమాదం కాదని మనల్ని మనం నమ్మించుకుంటాం. అంతేకాదు అందరినీ కాదని ముందుకు వెళ్తే అందరూ తననే చూస్తారేమో అనే ఒక రకమైన సామాజిక భయం కూడా కొందరిలో కనిపించి ఆ నిర్ణయం నుంచి వెనక్కి లాగుతుంది. దీనివల్ల, సహాయం అందక ఒక ప్రాణం అందరి ముందే గాలిలో కలిసిపోతుంది. ఎందుకంటే మనం సమాజం అని పిలుచుకునే ఈ సోకాల్డ్ జనాలలో మానవత్వం కంటే మౌనమే ఎక్కువగా రాజ్యమేలుతోంది కనుక.

దీనికి తోడు చాలామందిలో పెరిగిపోతున్న సోషల్ మీడియా పిచ్చి కూడా తోడైంది. ఎవరైనా ఆపదలో ఉంటే కాపాడటాన్ని పక్కన పెట్టి మరీ ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించి నాలుగు లైకులు సంపాదించుకోవాలనే పైశాచిక ఆనందం మనిషిలో ఎక్కువ అవుతోంది. రక్తం చిందిస్తున్న మనిషిని కష్టాన్ని చూడకుండా కెమెరా, లెన్స్ ఫోకస్ మీదనే దృష్టి పెడుతున్నారు.

కాకపోతే కొంతమంది తాగుబోతులు పీకలదాకా తాగి రోడ్డుమీద పడిపోతున్న ఘటనలు ఎక్కువవడంతో.. నిజంగా ఎవరైనా అనారోగ్యంతో పడిపోయినా పట్టించుకోలేని విధంగా తయారయిన పరిస్థితులు కొన్ని చోట్ల కనిపించడం కామన్ అయిపోతున్నాయా అన్పిస్తుంది. దీంతో కొన్ని చోట్ల నిజంగా ఇబ్బంది పడినా పట్టించుకోవడం లేదు.

Bystander Effect
Bystander Effect

ఈ పరిస్థితి మారాలంటే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. గుంపులో ఉన్నప్పుడు మనం అందరిలా బాధ్యతను పంచుకోవడం కాదు, ఆ గుంపులో మొదటి అడుగు వేసే వ్యక్తిగా మనం మారాలి. మీరే కనుక ఒక్క అడుగు ముందుకు వేసి సహాయం చేయడానికి కదిలితే, మిగిలిన గుంపు కూడా మీ అడుగుల వెంటే వస్తుంది. ఎందుకంటే చాలామంది ఒక నాయకుడి కోసం ఎదురుచూస్తుంటారు. ఆ నాయకత్వం మీ నుంచే మొదలవ్వాలి.

సమాజం అంటే కేవలం జనాభా లెక్కలు కానే కాదు, ఒకరికొకరు తోడుండే ఒక నమ్మకం. బైస్టాండర్ ఎఫెక్ట్(Bystander Effect) అనే ఈ మానసిక జాడ్యాన్ని మీరు కనుక వదిలించుకోకపోతే, రేపు మీరు ఆపదలో ఉన్నప్పుడు కూడా.. ఇలాగే ఒక గుంపు మిమ్మల్ని చూస్తూ మౌనంగా ఉండిపోతుంది. అందుకే గుంపులో మనిషిగా కాదు.. గుండె ఉన్న మనిషిగా స్పందించడం నేర్చుకుందాం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button