Just National

Non-veg milk: నాన్ వెజ్ మిల్కా? ఏంటీ నాన్సెస్.. ?

అమెరికా తమ పాల ఉత్పత్తులను, ముఖ్యంగా ఈ "నాన్-వెజ్ మిల్క్"ను మన మార్కెట్‌ (Dairy Market)లోకి ప్రవేశపెట్టాలని ఒత్తిడి చేస్తోంది

Non-veg milk: భారత్, అమెరికా మధ్య హై-ప్రొఫైల్ ట్రేడ్ చర్చల్లో ఇప్పుడు ఒక విచిత్రమైన అంశం తెరపైకి వచ్చింది. అదే “నాన్-వెజ్ మిల్క్”(Non Veg Milk). అవును, మీరు విన్నది నిజం! ఈ ఒక్క పదం ఇప్పుడు రెండు దేశాల మధ్య పెద్ద చిచ్చు పెడుతోంది. ఈ వార్తలతో అసలు ఈ “నాన్-వెజ్ మిల్క్” అంటే ఏంటి? దీనివల్ల మన నమ్మకాలకు, ఆర్థిక వ్యవస్థకు, లక్షలాది మంది రైతన్నల బ్రతుకులకు ఎలాంటి ముప్పు రాబోతోందన్న ప్రశ్నలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

Non-veg milk

పాలు అంటే మనకు పవిత్రమైన గోవు, పచ్చటి గడ్డి, స్వచ్ఛత గుర్తుకొస్తాయి. కానీ, అమెరికాలో పరిస్థితులు వేరు. అక్కడ కొన్ని ఆవులకు సాధారణ గడ్డితో పాటు, షాకింగ్ అనిపించే మాంసం, రక్తం, చేపల వ్యర్థాలు, కోళ్లు, పందుల భాగాలను కలిపిన దాణా ఇస్తున్నారంటే .. ఓ మైగాడ్ అన్పించినా ఇది నిజం.

ప్రోటీన్ కోసం పంది, గుర్రపు రక్తం, జంతువుల కొవ్వును కూడా ఆహారంగా వాడతారట. ఇలాంటి “ప్రత్యేక” దాణా తిన్న ఆవుల నుంచి వచ్చే పాలనే ఇప్పుడు “నాన్-వెజ్ మిల్క్” అని పిలుస్తున్నారు. ఇది కేవలం పుకారు కాదు, కొన్ని నివేదికలు స్పష్టంగా పేర్కొంటున్న నిజాలు. దీంతో ఆవులకు మాంసాహారం పెట్టడం ఏంటి నాన్సెన్స్ అని భారతీయులు మండిపడుతున్నారు.

అమెరికా తమ పాల ఉత్పత్తులను, ముఖ్యంగా ఈ “నాన్-వెజ్ మిల్క్”ను మన మార్కెట్‌ (Dairy Market)లోకి ప్రవేశపెట్టాలని ఒత్తిడి చేస్తోంది. కానీ, భారత్ మాత్రం దీన్ని సీరియస్‌గా వ్యతిరేకిస్తోంది.

మన దేశంలో పాలు కేవలం ఆహారం కాదు, అవి పవిత్రం అని భావిస్తారు. దేవతలకు సమర్పించే నైవేద్యాల్లో, ప్రతి శుభకార్యంలో, ఆధ్యాత్మిక క్రియల్లో పాలు, నెయ్యి తప్పనిసరి. గోమాతను పూజించే మన సంస్కృతిలో, మాంసాహారం తిని ఇచ్చిన పాలు మన ధార్మిక విశ్వాసాలకు పూర్తిగా వ్యతిరేకం. కోట్లాది మంది భారతీయులు శాఖాహారులు. వారికి ఈ పాలు తాగమంటే వారి మతపరమైన, ఆహార నియమాలను కించపరిచినట్లే అవుతుంది.

భారత ప్రభుత్వం ఆహార దిగుమతులపై కఠినమైన నిబంధనలు పెట్టింది. పాలను ఇచ్చే జంతువులకు మాంసం, రక్తం, పంది మాంసం లేదా ఎముకల నుండి తయారుచేసిన దాణా(Animal-based Feed)ను ఇవ్వకూడదని మన వెటర్నరీ సర్టిఫికేషన్ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. అమెరికా దీన్ని వాణిజ్య అడ్డంకిగా WTOలో ప్రస్తావించినా, భారత్ మాత్రం తన నిబంధనల విషయంలో వెనక్కి తగ్గడం లేదు.

భారతదేశం(India) పాల ఉత్పత్తిలో, వినియోగంలో ప్రపంచంలోనే నంబర్ వన్. మన పాడి పరిశ్రమ దాదాపు 140 కోట్ల మందికి పాలను అందిస్తూ, 8 కోట్ల మందికి పైగా రైతన్నలకు జీవనోపాధిని కల్పిస్తోంది. అమెరికా నుంచి ఈ “నాన్-వెజ్ మిల్క్”తో సహా పాల ఉత్పత్తులు పెద్ద ఎత్తున వస్తే, మన దేశీయ పాల ధరలు సుమారు 15% తగ్గిపోతాయి అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల మన పాడి రైతులు ఏటా ₹1.03 లక్షల కోట్లు నష్టపోతారని ఒక అంచనా. ఇది లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వాణిజ్య ఒప్పందాన్ని ఆగస్టు 1, 2025 నాటికి పూర్తి చేయాలని గడువు విధించారు. కానీ, “నాన్-వెజ్ మిల్క్” అంశం భారత్‌కు ఒక “నో-గో” ఏరియాగా మారింది. అంటే, ఈ విషయంలో ఎలాంటి రాజీకీ తావు లేదని భారత్ క్లారిటీ ఇచ్చింది.

మరి అమెరికా మన ఆందోళనలను ఎలా స్వీకరిస్తుంది? ఈ వాణిజ్య చర్చలు చివరకు ఏ మలుపు తిరుగుతాయి? “నాన్-వెజ్ మిల్క్” లాంటి ఒక చిన్న పదం .. మన దేశ సంస్కృతి, ప్రజల ఆరోగ్యం, లక్షలాది మంది రైతన్నల బ్రతుకులపై ఎంత పెద్ద ప్రభావాన్ని చూపుతుందో  చూడాలి.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button