Goddess Pratyangira:నరసింహుని కోపాన్ని చల్లార్చిన ప్రత్యంగిరా దేవి విశిష్టత, మహిమ
Goddess Pratyangira: శని దోషంతో బాధపడేవారు, సంతానం లేనివారు, శత్రు బాధలు ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతారు.

Goddess Pratyangira
ఆదిపరాశక్తి రూపాల్లో అత్యంత భయంకరమైన, శక్తిమంతమైన దేవత శ్రీ ప్రత్యంగిరా దేవి(Goddess Pratyangira). పురాణాల ప్రకారం, ఆమె లక్ష సింహాల ముఖాలతో, మూడు నేత్రాలతో, భగభగమండే కేశాలతో ఆవిర్భవించి దుష్టశక్తులను నాశనం చేసింది. అందుకే శత్రు సంహారం, దారిద్య్ర నిర్మూలన, మంచి ఆరోగ్యం కోసం ఈ అమ్మవారిని భక్తులు పూజిస్తారు.
అమ్మవారి ఆవిర్భావ కథనం..ఒక కథనం ప్రకారం, దేవతలు, రాక్షసుల యుద్ధంలో ఒక శక్తిమంతమైన రాక్షసుడిని సంహరించడానికి శ్రీమహావిష్ణువు, శివుడు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ రాక్షసుడి గర్వాన్ని అణచివేయడానికి ఆదిపరాశక్తిని వారు ప్రార్థించారు. అప్పుడు ప్రత్యంగిరా దేవి భయంకర రూపంలో ప్రత్యక్షమై, ఆ రాక్షసుడిని, అతని సైన్యాన్నీ సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించింది.
మరొక కథనం ప్రకారం, హిరణ్యకశ్యపుడిని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపం శాంతించలేదు. దాంతో శివుడు శరభ రూపంలో వచ్చి నరసింహుని శాంతపరచడానికి ప్రయత్నించగా, శరభ రూపం రెక్కల నుండి ప్రత్యంగిరా దేవి (Goddess Pratyangira) ఉద్భవించి, నరసింహుని కోపాన్ని చల్లార్చి యోగ నరసింహుడిగా మార్చింది. ఈ కారణంగానే ఆమెను ‘నృసింహిక’ అని కూడా పిలుస్తారు.

ప్రత్యంగిరా దేవి స్వరూపం, నామాలు..ప్రత్యంగిరా దేవి (Goddess Pratyangira)రూపం చాలా ప్రత్యేకమైనది. ఆమె నేల నుంచి ఆకాశాన్ని తాకేంత భారీకాయంతో, నలుపు రంగుతో, వేల సింహాల తలలతో, అనేక చేతులతో దర్శనమిస్తుంది. ఆమె మెడలో కపాల మాల, చేతుల్లో వివిధ రకాల ఆయుధాలు ఉంటాయి.
అధర్వణ వేదంలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉన్నందున ఆమెను ‘అధర్వణ భద్రకాళి’ అని కూడా పిలుస్తారు. అలాగే, శత్రువులకు ఊపిరాడకుండా చేసే శక్తి కనుక ‘నికుంభిల’ అనే పేరు కూడా ఉంది. ఈ అమ్మవారి నామం ఇద్దరు మహర్షులైన అంగీరస, ప్రత్యంగిరా పేర్ల కలయికతో వచ్చిందని పురాణాల చెబుతున్నాయి.
పురాణ పురుషుల ఆరాధన..రామాయణ కాలం నుంచే ఈ అమ్మవారి ఆరాధన ఉన్నట్టు చెబుతారు. రావణాసురుని కుమారుడు ఇంద్రజిత్తు ప్రత్యంగిరా దేవిని నికుంభిల రూపంలో పూజించేవాడు. అందుకే అతనికి అపజయమనేది ఉండేది కాదు. రామరావణ యుద్ధ సమయంలో ఇంద్రజిత్తు ఆమె కోసం యజ్ఞం చేస్తుండగా, విభీషణుడి సూచనతో వానరసేన యజ్ఞాన్ని ధ్వంసం చేసింది. యజ్ఞం పూర్తికాకపోవడంతో ఇంద్రజిత్తు అదే రోజు లక్ష్మణుడి చేతిలో హతమయ్యాడు.
పూజా విధానం..శని దోషంతో బాధపడేవారు, సంతానం లేనివారు, శత్రు బాధలు ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని చెబుతారు. ముఖ్యంగా అమావాస్య రోజున ఈ అమ్మవారికి ఎండు మిరపకాయలు, నల్ల ఉప్పు, తెల్ల ఆవాలు వంటి ప్రత్యేక వస్తువులతో హోమాలు నిర్వహిస్తారు. నిత్యం లలితా సహస్రనామం పఠించే వారిని కూడా ఈ అమ్మవారే దుష్ట గ్రహ పీడల నుంచి కాపాడుతారని భక్తుల విశ్వాసం.