Cricket: జడేజాకు ప్రమోషన్..నాయర్ ఔట్ విండీస్ తో సిరీస్ కు భారత జట్టు ఇదే
Cricket: విండీస్ తో సిరీస్ (Cricket) కోసం ఊహించని విధంగా రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. ఇంగ్లాండ్ టూర్ గాయపడిన రిషబ్ పంత్ కోలుకోకపోవడంతో జడేజాను గిల్ కు డిప్యూటీగా ఎంపిక చేశారు.

Cricket
ఒకవైపు టీమిండియా ఆసియాకప్ తో బిజీగా ఉంటే… మరోవైపు వెస్టిండీస్ తో సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఆసియాకప్ ముగిసిన మూడు రోజులకే ఈ సిరీస్(Cricket) ఆరంభం కానుంది. అయితే స్వదేశంలో జరగబోయే ఈ రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టులో సంచలన మార్పులేమీ జరగలేదు. ఊహించినట్టుగానే కరుణ్ నాయర్ పై వేటు పడింది. ఇంగ్లాండ్ టూర్ లో కరుణ్ నాయర్ నిరాశపరిచాడు. ఎనిమిదేళ్ళ తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన నాయర్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. దీంతో అతన్ని తప్పిస్తారని ముందే ఊహించారు. కరుణ్ నాయర్ ను తప్పించిన సెలక్టర్లు దేవదూత్ పడిక్కల్ కు పిలుపునిచ్చారు. దేశవాళీ క్రికెట్ లో పడిక్కల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అలాగే సాయి సుదర్శన్ కూడా తన ప్లేస్ నిలుపుకున్నాడు. ఇంగ్లాండ్ టూర్ లో అతను పర్వాలేదనిపించాడు.
అయితే విండీస్ తో సిరీస్ (Cricket) కోసం ఊహించని విధంగా రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. ఇంగ్లాండ్ టూర్ గాయపడిన రిషబ్ పంత్ కోలుకోకపోవడంతో జడేజాను గిల్ కు డిప్యూటీగా ఎంపిక చేశారు. పంత్ స్థానంలో ధృవ్ జురెల్ ప్రధాన వికెట్ కీపర్ గా ఎంపికయ్యాడు. అతనితో పాటు ఎన్.జగదీశన్ బ్యాకప్ వికెట్ కీపర్ గా చోటు దక్కించుకున్నాడు. ఇక గాయం నుంచి కోలుకున్న నితీశ్ కుమార్ రెడ్డి కూడా రీఎంట్రీ ఇచ్చాడు. ఆసీస్ పర్యటనలో నితీశ్ రెడ్డి అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత గాయంతో ఇంగ్లాండ్ టూర్ నుంచి వైదొలిగాడు.

ఇదిలా ఉంటే పేస్ విభాగంలో బుమ్రాను కంటిన్యూ చేశారు. వర్క్ లోడ్ మేనేజ్ మెంట్ ను దృష్టిలో ఉంచుకుని అతనికి రెస్ట్ ఇస్తారని వార్తలు వచ్చాయి. అయితే డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్ లో సొంతగడ్డపై ఇదే తొలి సిరీస్ కావడంతో పూర్తిస్థాయి జట్టుకే సెలక్టర్లు మొగ్గుచూపారు. విండీస్ తో సిరీస్ విజయం ఖచ్చితంగా భారత్ కు కీలకం కానుంది. బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ పేసర్లుగా ఆడనున్నారు.

అటు స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తో పాటు కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కింది. ఇంగ్లాండ్ టూర్ లో పూర్తిగా బెంచ్ కే పరిమితమైన కుల్దీప్ ను విండీస్ తో సిరీస్ లోనైనా ఆడిస్తారో లేదో చూడాలి. రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్ట్ అక్టోబర్ 2 నుంచి మొదలుకానుంది. అక్టోబర్ 10 నుంచి జరిగే రెండో టెస్టుకు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అటు విండీస్ కూడా యువ, సీనియర్లతో కూడిన జట్టును ఎంపిక చేసింది.
One Comment