IND vs WI: శతక్కొట్టిన రాహుల్, జురెల్,జడేజా తొలి టెస్టులో భారత్ కు భారీ ఆధిక్యం
IND vs WI: తొలిరోజు బౌలింగ్ లో చెలరేగిన టీమిండియా రెండోరోజు బ్యాటింగ్ లో అదరగొట్టింది. టెస్ట్ ఫార్మాట్ లో తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ కేఎల్ రాహుల్ తొలి సెషన్ లోనే సెంచరీ సాధించాడు.

IND vs WI
ఊహించినట్టుగానే స్వదేశంలో భారత జట్టు దుమ్మురేపుతోంది. ఏ మాత్రం పసలేని విండీస్ బౌలర్లను భారత బ్యాటర్లు ఆటాడుకుంటున్నారు. ఫలితంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండోరోజు సైతం భారత్ దే పైచేయిగా నిలిచింది. టీమిండియా ఇన్నింగ్స్ లో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కారు. మొదట కేఎల్ రాహుల్ శతక్కొడితే… తర్వాత వికెట్ కీపర్ జురెల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం సెంచరీలతో దుమ్మురేపారు. దీంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ భారీ ఆధిక్యం సాధించింది.
తొలిరోజు బౌలింగ్ లో చెలరేగిన టీమిండియా రెండోరోజు బ్యాటింగ్ లో అదరగొట్టింది. టెస్ట్ ఫార్మాట్ లో తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ కేఎల్ రాహుల్ తొలి సెషన్ లోనే సెంచరీ సాధించాడు. రాహుల్ టెస్ట్ కెరీర్ లో ఇది 11వ సెంచరీ. స్వదేశంలో దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత శతకాన్ని సాధించాడు. చివరిసారిగా సొంతగడ్డపై రాహుల్ 2016లో సెంచరీ సాధించాడు. తర్వాత దాదాపు 25 ఇన్నింగ్స్ లు ఆడినా మూడంకెల మార్క్ అందుకోలేకపోయాడు. చివరికి ఇప్పుడు విండీస్ పై మళ్ళీ శతకం సాధించి సెలబ్రేట్ చేసుకున్నాడు.

రాహుల్ 100 పరుగులకు ఔటైన తర్వాత జురెల్, రవీంద్ర జడేజా కీలక పార్టనర్ షిప్ నెలకొల్పారు. ముఖ్యంగా రిషబ్ పంత్ ప్లేస్ లో చోటు దక్కించుకున్న ధృవ్ జురెల్ అద్భుతమైన బ్యాటింగ్ తో అలరించాడు. తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే క్రమంలో సెంచరీ సాధించాడు. జురెల్ టెస్ట్ కెరీర్ లో ఇదే తొలి సెంచరీ. జడేజా, జురెల్ ఐదో వికెట్ కు 206 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మరోవైపు రవీంద్ర జడేజా కూడా శతకం పూర్తి చేసుకున్నాడు. లోయర్ ఆర్డర్ లో ఈ మధ్య కీలక ఇన్నింగ్స్ లు ఆడుతున్న జడ్డూ తన ఫామ్ కొనసాగిస్తూ టెస్ట్ కెరీర్ లో ఆరో శతకం సాధించాడు.

సెంచరీ తర్వాత తనదైన కత్తిసాము స్టైల్ లో సెలబ్రేట్ చేసుకున్నాడు. జురెల్ 125 పరుగులకు ఔటవగా… భారత్ కు భారీ ఆధిక్యం దక్కింది. రెండోరోజు ఆటముగిసే సమయానికి టీమిండియా 5 వికెట్లకు 448 పరుగులు చేసింది. జడేజా 104, వాషింగ్టన్ సుందర్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. రాహుల్ 100 , గిల్ 50 , జైశ్వాల్ 36 పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ 2 వికెట్లు తీశాడు. ఇప్పటికే 286 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్ మూడోరోజు ఇదే దూకుడు కొనసాగించి మ్యాచ్(IND vs WI) ను శాసించే స్థితిలో ఉండబోతోంది.
గంభీర్ వ్యూహం ప్రకారం రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగకుండా ఇన్నింగ్స్ విజయంపైనే భారత్ కన్నేసినట్టు తెలుస్తోంది. దీంతో మూడోరోజు తొలి సెషన్ లో చేయబోయే పరుగులు కీలకం కాబోతున్నాయి. అటు విండీస్ ఈ మ్యాచ్ ను డ్రా చేసుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది.