Just SportsLatest News

T20 World Cup : గెలిస్తే సెమీస్ కు..ఓడితే ఇంటికి..ఇక విండీస్ తో క్వార్టర్ ఫైనల్

T20 World Cup : టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు కీలక సమయంలో ఫామ్ అందుకుంది. గ్రూప్ స్టేజ్ లో నాలుగుకు నాలుగు మ్యాచ్ లూ గెలిచిన టీమిండియా సూపర్ 8ను ఓటమితో ఆరంభించింది

T20 World Cup

టీ20 ప్రపంచకప్(T20 World Cup) లో భారత జట్టు కీలక సమయంలో ఫామ్ అందుకుంది. గ్రూప్ స్టేజ్ లో నాలుగుకు నాలుగు మ్యాచ్ లూ గెలిచిన టీమిండియా సూపర్ 8ను ఓటమితో ఆరంభించింది. సౌతాఫ్రికా చేతిలో భారీగా ఓడిపోవడంతో ఒక్కసారిగా సెమీస్ రేసులో వెనుకబడిపోయింది. దీంతో టైటిల్ ఫేవరెట్ కాస్తా టోర్నీ నుంచే నిష్క్రమించే పరిస్థితుల్లో పడింది.

అయితే గురువారం వెస్టిండీస్ పై సౌతాఫ్రికా గెలవడంతో టీమిండియాకు బిగ్ రిలీఫ్ దక్కింది. రన్ రేట్ తో సంబంధం లేకుండా మిగిలిన మ్యాచ్ లు గెలిస్తే సరిపోతుందని తేలిపోవడంతో జింబాబ్వేపై పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచింది. బ్యాటింగ్ లో ఫామ్ లో లేని ఆటగాళ్ళంతా ఈ మ్యాచ్ తో టచ్ లోకి వచ్చేశారు. సంజూ శాంసన్(24) కాస్త నిరాశపరిచినా.. మిగిలిన బ్యాటర్లందరూ రాణించారు. అభిషేక్ , హార్థిక్ మెరుపు హాఫ్ సెంచరీలతో పాటు బౌలర్లు కూడా రాణించడంతో జింబాబ్వేపై 72 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

భారత్, జింబాబ్వే మ్యాచ్ పూర్తవగానే 4 పాయింట్లతో ఉన్న సౌతాఫ్రికా అధికారికంగా సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అటు వెస్టిండీస్ ప్లస్ రన్ రేట్ తో రెండో స్థానంలో ఉండగా.. భారత్ కూడా 2 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అయితే ఈ గ్రూప్ నుంచి భారత్ కు మిగిలిన మ్యాచ్ వెస్టిండీస్ తోనే.

T20 World Cup
T20 World Cup

ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ లాంటిది. ఇక్కడ ప్రత్యేకంగా ఆలోచించేది ఏమీ లేదు. భారత్, వెస్టిండీస్ జట్లలో ఎవరు గెలిస్తే ఆ జట్టు రెండో సెమీస్ బెర్త్ దక్కించుకుంటారు. ఈ రెండు జట్లు సౌతాఫ్రికాపైనే పరాజయం పాలవగా.. జింబాబ్వే జట్టుపై విజయాలు సాధించి రెండేసి పాయింట్లు ఖాతాలో వేసుకున్నాయి.

ఇప్పుడు ముఖాముఖీ పోరులో ఎవరు గెలిస్తే వారికి సెమీస్ బెర్త్ లభిస్తుంది. కాగా జింబాబ్వేపై మన బౌలర్లలో అర్షదీప్ సింగ్ రాణించగా.. మిగిలిన బౌలర్లు కాస్త పరుగులు ఇచ్చేయడం ఒకవిధంగా టెన్షన్ పెట్టే అంశమే. ఎందుకంటే విండీస్ జట్టులో విధ్వంసకర బ్యాటర్లున్నారు. వారిని కట్టడి చేయకుంటే భారత్ ఇంటిదారి పట్టడం ఖాయం. అందుకే డెత్ బౌలింగ్ కాస్త మెరుగుపడితే చాలు టీమిండియా సెమీఫైనల్లో అడుగుపెడుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Articles

Back to top button