Chandrayaan 4 :చంద్రుడిపై సేఫ్ ప్లేస్ దొరికింది..చంద్రయాన్-4 కోసం ఇస్రో మాస్టర్ ప్లాన్
Chandrayaan 4 : చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోని అత్యంత క్లిష్టమైన మాన్స్ మౌటన్ (Mons Mouton) దగ్గరలో ఒక సురక్షితమైన ల్యాండింగ్ ప్రాంతాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు.
Chandrayaan 4
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ‘చంద్రయాన్-4′(Chandrayaan 4 ) మిషన్ కోసం ఇస్రో సైంటిస్టులు ఒక కీలక అడుగు వేశారు. చంద్రుని ఉపరితలం నుంచి శాంపిల్స్ అంటే మట్టి, రాళ్లు సేకరించి తిరిగి భూమికి తీసుకురావడమే ఈ మిషన్ మెయిన్ ఉద్దేశ్యం. దీనికోసం చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోని అత్యంత క్లిష్టమైన మాన్స్ మౌటన్ (Mons Mouton) దగ్గరలో ఒక సురక్షితమైన ల్యాండింగ్ ప్రాంతాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (SAC) శాస్త్రవేత్తలు చంద్రయాన్-2 ఆర్బిటర్ పంపిన.. చాలా క్లియర్‌గా చిత్రాలను (OHRC – Orbiter High Resolution Camera) విశ్లేషించారు. ఐదు వేర్వేరు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాక.. అందులో ‘MM-4’అనే పేరు గల ఒక చదరపు కిలోమీటరు ప్రాంతాన్ని ల్యాండింగ్ కోసం అత్యంత అనువైనదిగా తేల్చారు.
ఎందుకు ఈ ప్రాంతాన్నే ఎంచుకున్నారంటే..చంద్రుని దక్షిణ ధ్రువం ఎత్తుపల్లాలు, పెద్ద పెద్ద గుంతలు , రాళ్లతో నిండి ఉంటుంది. ల్యాండర్ క్షేమంగా దిగాలంటే కొన్ని కఠినమైన నిబంధనలు పాటించాలి.
ల్యాండింగ్ అయ్యే చోట వాలు 10 డిగ్రీల కంటే తక్కువగా ఉండాలి. దీనికి తగినట్లుగానే MM-4 ప్రాంతంలో సగటు వాలు కేవలం 5 డిగ్రీలే ఉంది.
అలాగే ల్యాండర్‌కు కనీసం 11- 12 రోజుల పాటు నిరంతర సూర్యరశ్మి అందాలి. ఈ ప్రాంతంలో అది సాధ్యమవుతుంది.
అంతేకాకుండా ఈ ప్రదేశంలో రాళ్లు , గుంతల వల్ల కలిగే ప్రమాదం కేవలం 9.89 శాతం మాత్రమే ఉంటుంది. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ.

ఇస్రో ఇప్పటివరకు చేపట్టిన మిషన్లన్నింటిలోనూ చంద్రయాన్ -4 (Chandrayaan 4 )అత్యంత సంక్లిష్టమైనది అని తెలుస్తోంది. ఈ అంతరిక్ష నౌకలో మొత్తం ప్రొపల్షన్, డిసెండర్, అసెండర్, ట్రాన్స్‌ఫర్ రీ-ఎంట్రీ మాడ్యూల్స్ అనే ఐదు మాడ్యూల్స్ ఉంటాయి . ల్యాండర్ చంద్రునిపై దిగి, నమూనాలను సేకరించిన తర్వాత, అక్కడి నుంచి మళ్లీ రాకెట్ లాగా బయలుదేరి (Ascender), చంద్రుని కక్ష్యలో ఉన్న మరో మాడ్యూల్‌తో కలిసి ఆ నమూనాలను భూమికి పంపాల్సి ఉంటుంది.
ల్యాండింగ్ సైట్ సెలక్షన్ కమిటీ గనుక ఒకవేళ దీనికి ఆమోదం తెలిపితే, భారత్ మరో అద్భుతమైన చరిత్రను సృష్టించడానికి ఈ ‘MM-4’ ప్రాంతమే వేదిక కాబోతోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే, ఇతర గ్రహాల నుంచి నమూనాలను తీసుకురాగల అతికొద్ది దేశాల జాబితాలో భారతదేశం కూడా చేరుతుంది.



