Kanakaratnam: అల్లు కుటుంబానికే కాదు మెగా ఫ్యామిలీకి దూరమయిన పెద్దదిక్కు..కనకరత్నం
Kanakaratnam: అల్లు కనకరత్నం అంత్యక్రియలు 2025 ఆగస్టు 30న మధ్యాహ్నం కోకాపేట్‌లోని అల్లు కుటుంబ వ్యవసాయ భూమి వద్ద జరిగాయి.

Kanakaratnam
ప్రఖ్యాత నటుడు దివంగత అల్లు రామలింగయ్య సతీమణి, అల్లు అరవింద్ తల్లి అయిన కనకరత్నం అంత్యక్రియలు ముగిసాయి. ఈరోజు అంటే ఆగస్ట్ 30న తెల్లవారుజామున తన 94వ ఏట వృద్ధాప్యం కారణంగా హైదరాబాద్‌లో తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు
అల్లు కనకరత్నం(Kanakaratnam) కేవలం అల్లు కుటుంబానికే కాదు, యావత్ మెగా ఫ్యామిలీకి ఒక మూలస్తంభం లాంటి వారు. అల్లు రామలింగయ్య గారికి సతీమణిగా, అల్లు అరవింద్, సురేఖ వంటి సినీ ప్రముఖులకు తల్లిగా ఆమె తన కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలిచారు.
సురేఖ, చిరంజీవిని వివాహం చేసుకోవడంతో అల్లు, మెగా కుటుంబాల మధ్య ఆమె ఒక బలమైన వారధిగా నిలిచారు. భర్త మరణం తర్వాత కూడా కుటుంబాన్ని కలిపి ఉంచి, ఆత్మీయతను పెంచడంలో కనకరత్నం పాత్ర ఎంతో ఉందంటారు రెండు కుటుంబాలకు చెందిన కొంతమంది.

అల్లు అర్జున్ జైలుకు వెళ్లిన సమయంలో..తిరిగి వచ్చాక నాన్నమ్మ ఆశీర్వదించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, మెగా అభిమానులందరినీ అప్పట్లో బాగా ఆకట్టుకుంది.మనవడు బన్నీతో ఆమె బంధాన్ని చెప్పకనే చెప్పిందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆ వీడియోను వైరల్ చేశారు.
కనకరత్నం(Kanakaratnam) గారి మరణ వార్త తెలుసుకున్న వెంటనే అల్లు అర్జున్ ముంబైలో తన షూటింగ్‌ను వదిలి హైదరాబాద్‌కు చేరుకున్నారు. కన్నీళ్లు తుడుచుకుంటూ బన్నీ తన నానమ్మకు నివాళులు అర్పించారు. అదేవిధంగా, రామ్ చరణ్ కూడా మైసూర్ నుంచి వెంటనే వచ్చారు.
ఈ కష్ట సమయంలో చిరంజీవి, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి మెగా హీరోలు అల్లు అరవింద్ కుటుంబానికి అండగా నిలబడ్డారు.

చిరంజీవి, అల్లు అరవింద్, రామ్ చరణ్ కలిసి పాడె మోస్తూ తమ అనుబంధాన్ని మరోసారి లోకానికి చాటి చెప్పారు. ఈ విషాదకర సన్నివేశం చూసి అభిమానులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. అల్లు అర్జున్ తన నానమ్మకు కన్నీటి నివాళులు అర్పిస్తూ కనిపించారు.
అల్లు కనకరత్నం(Kanakaratnam) అంత్యక్రియలు 2025 ఆగస్టు 30న మధ్యాహ్నం కోకాపేట్‌లోని అల్లు కుటుంబ వ్యవసాయ భూమి వద్ద జరిగాయి. అల్లు అరవింద్ తన తల్లికి తుది సంస్కారాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులు, ప్రముఖులు ఆమె మృతి తీరని లోటని పేర్కొన్నారు.