Vijay: నీ ఇంటిని బాంబులతో లేపేస్తాం.. నటుడు విజయ్‌కు బెదిరింపులు
Vijay: ఇప్పటికే తన అభిమానులతోనూ, పార్టీలో చేరిన నేతలతోనూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మధ్యలో పలు చోట్ల ర్యాలీల్లోనూ పాల్గొంటున్నారు.

Vijay
తమిళనాడులోని కరూర్ ర్యాలీ తొక్కిసలాట ఘటన ఇటీవల తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో అటు పోలీసులు, ప్రభుత్వం.. ఇటు నటుడు, టీవీకే అధినేత విజయ్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై తీవ్ర రాజకీయ ఒత్తిడితో పాటు విమర్శలు ఎదుర్కొంటున్న విజయ్(Vijay) కు ఇప్పుడు బెదిరింపులు మొదలయ్యాయి. ఘటన జరిగిన తర్వాతి రోజు నుంచే విజయ్ ను టార్గెట్ చేస్తూ బాంబు బెదిరింపులు రావడం.. ప్రత్యర్థి పార్టీ నేతలు నిరసనలకు ప్రయత్నించడం, పోలీసులు భద్రత పెంచడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అయితే ఇప్పుడు మూడోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని నీలంకరైలో ఉన్న విజయం ఇంటికి బెదిరింపు కాల్ వచ్చింది. మళ్ళీ బహిరంగ ర్యాలీలు నిర్వహిస్తే ఇంటిని బాంబులతో పేల్చివేస్తామని దుండగులు బెదిరించారు. ఈ కాల్ పై విజయ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీగా భద్రతను పెంచారు. విజయ్ ఇంటివైపు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.

కాగా ఈ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడు కన్యాకుమారి జిల్లా నుంచి కాల్ చేసినట్టు తెలిసింది. నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. అయితేఈ వరుస బెదిరింపులతో రాజకీయ నాయకుడిగా ఆయన(Vijay) వ్యక్తిగత భద్రతపై ఆందోళన కలిగిస్తోందని టీవీకే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే టీవీకే పార్టీని స్థాపించిన విజయ్ వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.

దీని కోసం ఇప్పటికే తన అభిమానులతోనూ, పార్టీలో చేరిన నేతలతోనూ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మధ్యలో పలు చోట్ల ర్యాలీల్లోనూ పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే కరూర్ ర్యాలీలో తొక్కిసలాట జరిగిన 40 మందికి పైగా మృతి చెందారు. అనుకున్న సమయానికి కంటే చాలా ఆలస్యంగా విజయ్ రావడం, ఊహించిన దానికంటే ఎక్కువమంది అభిమానులు ర్యాలీకి తరలిరావడం తొక్కిసలాటకు కారణమైందని నిర్థారించారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కూడా జరుగుతుంది. ఈ ఘటన తర్వాత విజయ్ పై బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయి.
మరోవైపు తమిళనాడులో ప్రముఖులకు బాంబు బెదిరింపులు రావడం కామన్ గా మారిపోయింది. ఇటీవల ఏకంగా సీఎం స్టాలిన్ తో పాటు హీరోయిన్లు త్రిష, నయనతార నివాసాలకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. అలాగే బీజేపీ కార్యాలయానికి, డీజీపీ కార్యాలయానికి, రాజ్‌భవన్‌కు కూడా బాంబు బెదిరింపులు రావడం పోలీసులకు, భద్రతా వర్గాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రజల్లో గందరగోళ పరిస్థితులు సృష్టించేందుకే ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.