PAK vs NZ : తొలి పంచ్ ఎవరిదో ?..సూపర్ 8 పోరుకు కివీస్,పాక్ రెడీ
PAK vs NZ : కొలంబో వేదికగా జరగబోయే తొలి మ్యాచ్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి
PAK vs NZ
ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో సూపర్ 8 రౌండ్ నేటి నుంచే మొదలవుతోంది. కొలంబో వేదికగా జరగబోయే తొలి మ్యాచ్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్(PAK vs NZ) తలపడనున్నాయి. బలాబలాల పరంగా పాక్ కంటే కివీస్ మెరుగ్గా ఉన్నప్పటకీ ఎప్పుడెలా ఆడుతుందో తెలియని ఆ జట్టును తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. అలాగే న్యూజిలాండ్ కూడా గ్రూప్ స్టేజ్ లో మంచి ప్రదర్శనే కనబరిచింది.
నాలుగు మ్యాచ్ లలో ఒక్క సౌతాఫ్రికా చేతిలోనే ఓడిపోయిన కివీస్ యూఏఈ, కెనడా, ఆఫ్ఘనిస్థాన్ జట్లను చిత్తు చేసి సూపర్ 8లోకి ఎంట్రీ ఇచ్చింది. పలువురు ఆల్ రౌండర్లు కివీస్ కు ప్రధాన బలం. అలాగే బ్యాటింగ్ లో ఫిన్ అలెన్ , టిమ్ సిఫెర్ట్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ , చాప్ మన్ లు కీలకం కాబోతున్నారు. అలాగే డారిల్ మిఛెల్, మిఛెల్ శాంట్నర్ పైనా అంచనాలున్నాయి. బౌలింగ్ పరంగా జాకబ్ డఫీ అదరగొడుతున్నాడు. దాదాపు ప్రతీ మ్యాచ్ లోనూ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. జిమ్మీ నీషమ్ , మ్యాట్ హెన్రీ కూడా రాణిస్తున్నారు.
మరోవైపు పాకిస్థాన్ చిన్న జట్లపై తడబడుతూ గెలిచి సూపర్ 8లోకి అడుగుపెట్టింది. భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోవడం ఒక్కటే పాక్ ను ఇబ్బంది పెట్టిన విషయం. మిగిలిన మ్యాచ్ లలో నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏలపై గెలిచింది. పాక్ బ్యాటింగ్ లో నిలకడలేమి మైనస్ పాయింట్. బాబార్ అజామ్ పూర్తిస్థాయిలో ఫామ్ అందుకోలేకపోయాడు.

అటు ఓపెనర్లు కూడా పెద్దగా రాణించింది లేదు. ఉస్మాన్ ఖాన్ , సల్మాన్ అఘా కూడా అంతంత మాత్రంగానే పరుగులు చేస్తున్నారు. సూపర్ 8లో ఈ బలహీనతలను అధిగమిస్తేనే కివీస్ ను నిలువరించగలుగుతుంది. ఇదిలా ఉంటే గత రికార్డులను చూస్తే నువ్వా నేనా అన్నవిధంగా పోటీ జరిగింది. ఇరు జట్లు 49 మ్యాచ్ లలో తలపడితే 24 సార్లు పాక్ గెలిచింది. 23 మ్యాచ్ లలో కివీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.
ప్రపంచకప్ లో మాత్రం కివీస్ పై పాక్ దే పైచేయిగా ఉంది. మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉండగా.. కొలంబో పిచ్ ఛేజింగ్ చేసే జట్టుకే కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.



