Yoga: టెన్షన్‌ను మాయం చేసే నాలుగు యోగాసనాలు
Yoga:ఒత్తిడిని జయించడానికి యోగా ఒక ఉత్తమమైన మార్గం అంటున్నారు నిపుణులు.

Yoga
ఈ ఆధునిక యుగంలో మెంటల్ టెన్షన్ లేని వారు ఎవరూ ఉండనే ఉండరనే చెప్పొచ్చు. విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు అందరూ టెన్షన్ పడుతూనే ఉంటారు. ఈ ఒత్తిడిని నియంత్రించకపోతే అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ ఒత్తిడిని జయించడానికి యోగా(yoga) ఒక ఉత్తమమైన మార్గం అంటున్నారు నిపుణులు. అలా మనసుకు శాంతినివ్వడమే కాకుండా, శరీరానికి శక్తినిచ్చే కొన్ని యోగా(yoga)సనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శిశుముద్రాసనం (Child’s Pose): ఈ ఆసనం మెదడుకు విశ్రాంతినిచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. మోకాళ్లపై కూర్చుని, శ్వాస వదులుతూ ముందుకు వంగి, చేతులను ముందుకు చాచి నుదురును నేలపై ఆనించాలి. కనీసం 30 సెకన్లు ఈ స్థితిలో ఉండడం వల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి.

విపరీత కరణి (Legs-Up-The-Wall Pose): ఈ ఆసనం మానసిక ఆందోళనను పూర్తిగా పోగొడుతుంది. వెల్లకిలా పడుకుని కాళ్లను గోడకు ఆనించి, నడుము కింద చిన్న దిండు పెట్టుకోవాలి. ఈ స్థితిలో కాసేపు ఉండడం వల్ల శరీరం, మనసు ప్రశాంతంగా మారతాయి.

పశ్చిమోత్తాసనం (Seated Forward Bend): ఈ ఆసనం ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కూర్చుని కాళ్లను ముందుకు చాచి, చేతులతో పాదాలను పట్టుకుని ముందుకు వంగాలి. వెన్ను సమస్యలు ఉన్నవారు ఈ ఆసనం వేయకూడదు.

శవాసనం (Corpse Pose): ఇది అన్ని ఆసనాలలో కెల్లా అత్యంత ముఖ్యమైనది. వెల్లకిలా పడుకుని, కాళ్లు, చేతులు దూరంగా చాచి కళ్లు మూసుకోవాలి. ఈ ఆసనం గుండె వేగాన్ని, శ్వాసక్రియను నెమ్మదింపజేసి శరీరాన్ని పూర్తిగా రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో దీనికి మించిన ఆసనం లేదు.
