Digital Detox: మీలో ఈ లక్షణాలున్నాయా? అయితే డిజిటల్ డీటాక్స్‌కు టైమయినట్లే..
Digital Detox: అయితే మన కళ్లు స్క్రీన్ చూస్తున్నా కూడా.. లోపల మన మెదడు ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి విపరీతంగా కష్టపడుతుందన్న విషయం ఎవరికీ తెలియదు.
Digital Detox
ఈ రోజుల్లో మనం నిద్రలేచినప్పటి నుంచీ పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్‌తోనే కాలం గడుపుతున్నాం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్.. ఇలా ఏదో ఒక యాప్ లో ఏదొక వీడియోను నిరంతరం చూస్తూనే ఉంటున్నాం. దీనినే సైకాలజీలో ‘డిజిటల్ ఓవర్‌లోడ్’ (Digital Overload) అని పిలుస్తారు.
అయితే మన కళ్లు స్క్రీన్ చూస్తున్నా కూడా.. లోపల మన మెదడు ఆ సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి విపరీతంగా కష్టపడుతుందన్న విషయం ఎవరికీ తెలియదు. దీనివల్ల ఏ పనీ చేయకపోయినా విపరీతమైన అలసట, చిరాకు,కోపం, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా మనం రీల్స్ చూస్తున్నప్పుడు మెదడులో ‘డోపమైన్’ అనే హార్మోన్ రిలీజవుతుంది. ఇది మనకు తాత్కాలికంగా ఆనందాన్ని ఇస్తుంది ..అయితే అదే మెల్లమెల్లగా మనల్ని ఆ డిజిటల్ ప్రపంచానికి బానిసలుగా మార్చేస్తుందట.
అలాగే ఎప్పుడూ నోటిఫికేషన్లను చెక్ చేయడం వల్ల మన మెదడు ‘హైపర్-అలెర్ట్’ మోడ్‌లో ఉంటుంది. దీనివల్ల నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. చాలామంది ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో ఫోన్ చూడటం వల్ల వారి ఉత్పాదకత (Productivity) తగ్గిపోతుంది.

దీని నుంచి బయటపడటానికి ‘డిజిటల్ డీటాక్స్’ (Digital Detox) అనే పద్ధతిని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. రోజులో కనీసం రెండు గంటల పాటు అయినా ఫోన్ కి దూరంగా ఉండటం, భోజనం చేసేటప్పుడు, ముఖ్యంగా బాత్రూమ్‌కు వెళ్లినపుడు ఫోన్ వాడకపోవడం వంటి చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉంటే మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
అలాగే రాత్రి పడుకునే ముందు ఫోన్ వాడటం వల్ల అందులో నుంచి వచ్చే బ్లూ లైట్ మన నిద్రను దెబ్బతీస్తుంది. వారంలో ఒకరోజు అయినా.. ఆదివారం వంటి రోజుల్లో సోషల్ మీడియాకు పూర్తిగా బ్రేక్ ఇవ్వడం వల్ల మీ మెదడుకు రీఛార్జ్ అయ్యే అవకాశం దొరుకుతుంది.
ఆ సమయంలో ప్రకృతితో గడపడం, పుస్తకాలు చదవడం , చుట్టాలు, పాత స్నేహితులతో నేరుగా మాట్లాడటం వంటివి చేయడం వల్ల మన మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మీ మెదడును డిజిటల్ చెత్తతో నింపేయకుండా, దానికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం ద్వారా మీరు మరింత సృజనాత్మకంగా మారొచ్చు. సో..మీ మెదడు ఆరోగ్యం(Digital Detox) మీ చేతిల్లోనే ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు.



