Mushrooms: పుట్టగొడుగుల తింటే బరువు తగ్గుతారా?
Mushrooms: హార్వర్డ్ టి.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం, పుట్టగొడుగుల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

Mushrooms
పుట్టగొడుగులు(Mushrooms)… మష్రూమ్స్, ఓయ్‌స్టర్స్, షిటేక్, ఎనోకీ, పోర్సిని వంటి రకరకాల పేర్లతో పిలిచే ఇవి ఒక రకమైన ఫంగస్ జాతికి చెందినవి. పాశ్చాత్య దేశాలలో వీటిని శాఖాహారంగా పరిగణిస్తే, దక్షిణ భారతదేశంలో మాత్రం కొందరు వీటిని మాంసాహారంగా భావిస్తారు. మష్రూమ్స్‌లో ఫాస్ట్ ఫుడ్ నుంచి సంప్రదాయ వంటల వరకు అనేక రకాల వంటలు చేస్తారు. ఈ ఫంగస్‌లో అపారమైన పోషకాలు దాగి ఉన్నాయని, అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పలు అధ్యయనాలు నిరూపిస్తున్నాయి.
తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు: హార్వర్డ్ టి.హెచ్. చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం, పుట్టగొడుగుల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఆహారం. వీటిలో డైటరీ ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు (బి, సి, డి), కాపర్, పొటాషియం, సెలీనియం వంటి ముఖ్యమైన పోషకాలతో పాటు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతాయి: పుట్టగొడుగుల్లో ఉన్న యాంటీఆక్సిడెంట్లు మరియు పైటోకెమికల్స్ వల్ల శరీరంలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ లక్షణాలు పెరుగుతాయి. ఇవి సీజనల్ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి, తద్వారా రోగనిరోధక శక్తి (immunity) పెరుగుతుంది.

గుండె జబ్బులకు చెక్: పుట్టగొడుగులు(Mushrooms) లీన్ ప్లాంట్ ప్రొటీన్ కావడంతో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉన్న గ్లూటామేట్ రిబోన్యూక్లియోటైడ్స్ అనే సహజ ఉప్పు, రక్తపోటును నియంత్రించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
మెదడు పనితీరుకు ఊతం: వృద్ధాప్యం కారణంగా తగ్గే జ్ఞాపకశక్తి, మెదడు పనితీరును పుట్టగొడుగులు(Mushrooms) మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే ఎర్గోథైనిన్ మరియు గ్లూటాథైన్ వంటి ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు మెదడు కణజాలాలను చురుకుగా ఉంచి, అల్జీమర్స్, డిమెన్షియా వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.
ఎముకల పటుత్వానికి, జీర్ణక్రియకు సహాయం: పుట్టగొడుగుల్లో విటమిన్ డి, కాల్షియం, పొటాషియం వంటివి పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఇది ఆస్టియోపొరాసిస్, కండరాల బలహీనత వంటి సమస్యలకు ఒక ఔషధంలా పనిచేస్తుంది. అంతేకాకుండా, ఇందులో ఉండే ప్రీబయాటిక్స్ జీర్ణక్రియను వేగవంతం చేసి, పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. దీంతో అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.